– వారిలో భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : సీపీఐ(ఎం) నేత తరిగామి
శ్రీనగర్ : దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్ధులు, కార్మికులు ఎదుర్కొంటున్న వేధింపులపై సీపీఐ(ఎం) నేత ఎం.వై.తరిగామి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ వేధింపులు ఆగాలని డిమాండ్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్న యువతరంలో ఈ వేధింపుల పరిస్థితులు తీవ్రమైన భయాందోళనలను సృష్టించాయని అన్నారు. విద్యార్ధులను ఈ వాతావరణంలోకి లాగవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వారిని బెదిరింపులు లేదా అనుమానాలకు గురి చేయడానికి బదులుగా వారిలో ఒక రకమైన భద్రతా భావాన్ని కలిగించేలా ఈ దేశం హామీ కల్పించాలని కోరారు. విద్యార్ధులు తమ చదువును, పనిని కొనసాగించడానికి భరోసా, సుస్థిరత, విశ్వాసం వంటివి అవసరమైన పరిస్థితుల్లో ప్రస్తుతమున్న ఇటువంటి వేధింపుల వాతావరణం వారికి అనువైన, సక్రమమైన వాతావరణాన్ని కల్పించలేదని తరిగామి పేర్కొన్నారు. ఇటువంటి హేయమైన ఉగ్రవాద కార్యకలాపాలకు బాధ్యులైన వారికి ఇక్కడ స్థానం లేకుండా చేస్తూనే మరోపక్క అమాయకులైన పౌరులు ఆందోళన చెందకుండా, అవమానాలకు గురి కాకుండా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి వుందని ఆయన స్పష్టం చేశారు.ప్రజల ముఖ్యంగా యువత హృదయాలను, మనస్సులను గెలుచుకునే ప్రయత్నాలు చాలా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. అలా కాకుండా అమాయకులను వెనక్కి నెట్టివేయడం వల్ల అర్ధవంతమైనదేమీ సాధించడానికి దోహదపడదని అన్నారు. నిరాశా నిస్పృహల వల్ల ఎప్పుడూ ప్రతికూల ఫలితాలే వస్తాయన్నారు. వివక్షపూరితమైన చర్యల వల్ల ఎప్పుడూ ఒంటరి, వేరు అనే భావన మరింత పెరుగుతుందని అన్నారు. ఘర్షణల సమయంలో గత అనుభవాలను పరిశీలిస్తే ఈ విషయం బోధపడుతుందన్నారు.ఢిల్లీలో తీవ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో ఎలాంటి విచక్షణారహిత అరెస్టులు జరగకుండా చూడాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. విద్యార్ధులు, కార్మికులు, లేదా సాధారణ పౌరులు ఎవరైనా సరే అమాయకులు భయానికి లేదా అనుమానాలకు బాధితులుగా మారకుండా చూడాల్సిన బాధ్యత లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలదేనని తరిగామి పేర్కొన్నారు.
విద్యార్ధులు, కార్మికులపై వేధింపులు వద్దు
- Advertisement -
- Advertisement -



