Wednesday, October 29, 2025
E-PAPER
Homeఆటలుఇక పొట్టి పోరు

ఇక పొట్టి పోరు

- Advertisement -

భారత్‌, ఆసీస్‌ తొలి టీ20 నేడు
సూర్యకుమార్‌ ఫామ్‌పై ఫోకస్‌
మధ్యాహ్నం 1.45 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

నవతెలంగాణ-కాన్‌బెర్రా
భారత్‌, ఆస్ట్రేలియా వన్డే సవాల్‌ ముగిసింది. 2027 ఐసీసీ వరల్డ్‌కప్‌ ప్రణాళికల్లో కొత్త ప్రయోగాలకు మినహా ఈ సిరీస్‌ ఇరు జట్లలో ఉత్సాహం నింపలేకపోయింది. 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో నేటి నుంచి ఆరంభం కానున్న పొట్టి సవాల్‌ను భారత్‌, ఆస్ట్రేలియా సీరియస్‌గా తీసుకుంటున్నాయి. 2022, 2024లో ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌లో విఫలమైంది. దీంతో కంగారూలు వచ్చే ఏడాది కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేశారు. వరల్డ్‌ నం.1, డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమ్‌ ఇండియాతో సిరీస్‌లో ఆసీస్‌ ఈ ప్రణాళికలను ఆచరణలోకి తీసుకురానుంది. 2024 ప్రపంచకప్‌ విజయం, ఆ తర్వాత అజేయంగా ఆసియా కప్‌ చాంపియన్‌గా నిలిచిన భారత్‌.. ఈ ఫార్మాట్‌లో శత్రు దుర్బేద్యంగా కనిపిస్తోంది. వరల్డ్‌ నం.1 భారత్‌, వరల్డ్‌ నం.2 ఆస్ట్రేలియా తలపడుతున్న టీ20 సిరీస్‌ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. భారత్‌, ఆస్ట్రేలియా తొలి టీ20 పోరు నేడు కాన్‌బెర్రాలో జరుగుతుంది.

సూర్యకుమార్‌ మెరిసేనా? :
పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ గొప్పగా కనిపిస్తోంది. వన్డే సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న జశ్‌ప్రీత్‌ బుమ్రా.. టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. పేస్‌ దళపతి రాకతో సహజంగానే బౌలింగ్‌ విభాగం బలోపేతమైంది. అర్ష్‌దీప్‌ సింగ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా పేస్‌ దాడి ఎటువంటి ఫలితాలు రాబడుతుందో ఈ సిరీస్‌ తేల్చనుంది. కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి తుది జట్టులో చోటు కోసం పోటీపడుతుండగా.. పేస ఆల్‌రౌండర్‌ శివం దూబెతో హర్షిత్‌ రానా పోటీలో ఉన్నాడు. అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, తిలక్‌ వర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆసియా కప్‌లో గెలుపు ఇన్నింగ్స్‌లు నమోదు చేసిన ఈ త్రయం ఆసీస్‌తో సిరీస్‌లోనూ భారత్‌కు కీలకం.

కొత్త స్థానంలో పరుగులు చేసేందుకు సంజు శాంసన్‌ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఈ సిరీస్‌లో సంజు శాంసన్‌ మిడిల్‌ ఆర్డర్‌లో కుదురుకునేందుకు ఎదురుచూస్తున్నాడు. రింకు సింగ్‌, అక్షర్‌ పటేల్‌, శివం దూబె లోయర్‌ ఆర్డర్‌లో సత్తా చాటాల్సి ఉంది. జట్టు గొప్పగా ఆడుతున్నా.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తేలిపోతున్నాడు. గత 14 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్‌ ఒక్క అర్థ సెంచరీ సాధించలేదు. బ్యాటింగ్‌ సగటు 10.50, స్ట్రయిక్‌రేట్‌ 100.80 మాత్రమే. ఆసియా కప్‌లో తేలిపోయిన సూర్యకుమార్‌ ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. ఈ సిరీస్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు వ్యక్తిగతంగా అత్యంత కీలకం.

ఆసీస్‌ శిబిరం కొత్తగా.. :
మిచెల్‌ మార్ష్‌ సారథ్యంలో ఆసీస్‌ దంచికొడుతుంది. మార్ష్‌ కెప్టెన్సీలో 20 టీ20ల్లో ఆసీస్‌ రెండు ఓటములు చూసింది. ట్రావిశ్‌ హెడ్‌, జోశ్‌ ఇంగ్లిశ్‌, టిమ్‌ డెవిడ్‌, జోశ్‌ ఫిలిప్‌ సహా మిచ్‌ ఓనెన్‌, మార్కస్‌ స్టోయినిస్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. పరుగుల వేటలో, వికెట్ల వేటలో కంగారూ క్రికెటర్లు అంచనాలను అందుకుంటున్నారు. ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ అందుబాటులో లేకపోయినా.. కంగారూ శిబిరం సరికొత్త ఉత్సాహంగా కనిపిస్తోంది. బౌలింగ్‌ విభాగంలో జేవియర్‌ బార్ట్‌లెట్‌, మాట్‌ కున్హేమాన్‌, జోశ్‌ హాజిల్‌వుడ్‌, నాథన్‌ ఎలిస్‌లు ఆసీస్‌కు కీలకం కానున్నారు.

పిచ్‌, వాతావరణం :
భారత్‌, ఆసీస్‌ తొలి టీ20 వేదిక కాన్‌బెర్రా సంప్రదాయంగా స్వల్ప స్కోర్ల పిచ్‌. పెద్ద గ్రౌండ్‌లో స్పిన్నర్ల కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. నేడు మధ్యాహం వేళ వర్షం సూచనలు ఉన్నప్పటికీ.. మ్యాచ్‌ సమయంలో వర్షం కురిసే అవకాశం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -