Sunday, October 26, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికారకులెవ్వరు!

కారకులెవ్వరు!

- Advertisement -

‘ఈ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్లిపోయింది’ అంతే! సమాధానాలు మాత్రం ఎవ్వరూ ఇవ్వరు. ఈ పాపాలపుట్టను కదిలించడం చాలా కష్టమైన పని. ఎవరు తీరుస్తారు కన్నీళ్ల బాధని, ఎవరు ఓదార్చగలరు ఈ గుండెకోతల దు:ఖాన్ని. ఏ పరిహారం పూడుస్తుందీ నష్టాన్ని. ఎవరూ తీర్చలేని, ఎవరూ పూడ్చలేని హృదయ విదారక ఘటన జరిగిపోయింది. ఏం మిగిలిందక్కడ. కాలిన ఆశలు. బూడిదయిన భవిష్యత్తు. నిలువునా ఆవిరైన ప్రాణాలు. మృత్యుగీతాలపనలతో దద్దరిల్లుతున్న దగ్ధ హృదయ వేదనలు. ఆ ఆవరణం చూస్తుంటే గుండెలవిసి పోతున్నయి.ఆ కుటుంబీకుల దు:ఖ భాషణం వింటుంటే ఎవ్వరయినా చలించిపోక ఉండలేరు. ఎందుకు ఆ పచ్చని బతుకులు నిప్పుల్లో పడి కాలిపోయాయి! ఆశలన్నీ బుగ్గిపాలయ్యాయి! ఇది యాదృచ్ఛిక ఘటనేనా! ఒక్కడ్రైవరు నిర్లక్ష్యమేనా? ఎవరు చెబుతారు అసలైన కారణాలను?

ఇరవైమంది ఆనవాళ్లు లేని దేహాలు ఎవరివో తెలుసుకునే పనిలో ప్రభుత్వాలు మునిగిపోయాయి. ఇక చివరి చూపులేవీ లేవు. ఇప్పుడు సగం కాలిన ఆత్మీయులను గుర్తించలేని దీనస్థితి ఎవరికీ రావొద్దు.గురువారం రాత్రి హైదరాబాద్‌ నుండి బెంగళూరుకు బయలుదేరిన ప్రయివేటు ట్రావెల్‌ ఏసీ స్లీపర్‌బస్‌ కర్నూల్‌ సమీపంలోకి రాగానే, ఒక బైక్‌ను ఓవర్‌టెక్‌ చేయబోయి ఢకొీట్టి అలాగే బైక్‌ను ఈడ్చుకుపోవడంతో పెట్రోల్‌ట్యాంక్‌ పగిలి మంటలు లేచాయి. ప్రయాణికులంతా నిదురలో ఉండగా మంటలు చెలరేగి చుట్టుముట్టాయి. మొత్తం నలభై ఆరుమంది ప్రయాణికుల్లో పందొమ్మిది మంది మంటల్లో చిక్కుకుని కాలిపోయిన సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. డోరుతీసి ప్రయాణికులను కాపాడాల్సిన డ్రైవర్‌ బస్సుదూకి పారిపోవడం, బస్సు తలుపులు తెరుచుకోకపోవడం, డ్రైవర్‌ నిర్లక్ష్యం ఈ దుర్ఘటనకు కారణమని అందరూ అనుకుంటున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రగాఢ సానుభూతినీ వ్యక్తం చేశారు.చనిపోయిన వారిలో తెలంగాణవాసులూ ఉన్నారు. ఏపీవాళ్లూ ఉన్నారు.ఏ ప్రాంతం వారైతేనేమి, పోయింది మనుషుల ప్రాణాలు.

హైద్రాబాదు మహానగరంలో రాత్రి అయిందంటే లక్డీకపూల్‌, కూకట్‌పల్లి, సనత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ రోడ్లన్నీ ప్రయివేటు ఏసీ స్లీపర్‌ బస్సులు వరుస కడతాయి. వందలాది మంది ప్రయాణికులను గమ్యాలకు చేరవేసేందుకు పయనమవుతుంటాయి. వీటిని ఎవరు పర్యవేక్షిస్తున్నారో తెలియదు. బస్సులు సక్రమంగా ఉన్నాయో లేదో, కండీషన్‌లో ఉన్నాయో, సరైన ప్రమాణాలు పాటిస్తున్నారో, లేదో కూడా తెలియదు. ఇప్పుడు ప్రమాదానికి గురైన బస్సు కూడా ఇక్కడ రిజిస్టర్‌ అయినది కాదని తెలుస్తున్నది. రవాణా పర్మిట్లు వాహనాలకు ఉన్నాయా? ఫిట్‌నెస్‌ తనిఖీలు జరుగుతున్నాయా? అసలు డ్రైవర్లు శిక్షణ, లైసెన్సు పొందిన వారేనా? ఇవన్నీ చెక్‌ చేస్తున్నది ఎవరు? ఇక బస్సుల వేగం వాళ్ల ఇష్టం. చాలా వేగంగా పోతుంటాయి. అసలు ఆ బస్సుల డిజైనింగే అస్తవ్యస్తంగా ఉంటుంది. ప్రయివేటు వారికి అనుకూలంగా మోటారు వాహనాల చట్టానికి మోడీ సర్కార్‌ సవరణలు తీసుకొచ్చింది. ఇటీవలనే ఆర్టీఏ చెక్‌పోస్టులన్నింటినీ మన రాష్ట్రప్రభుత్వం ఎత్తేసింది కూడా. ఇవన్నీ ప్రభుత్వం వైపు నుండి జరుగుతున్న నిర్లక్ష్యాలు. వేలాది ప్రజల ప్రాణాలకు కావాల్సిన రక్షణ చర్యలు ప్రభుత్వాలు చేపట్టవు. ఎందుకంటే కోట్లాది రూపాయలు బస్సు యాజమాన్యాల నుండి పెద్దలకు అందుతుంటాయి.

ఇప్పుడు సానుభూతి ప్రకటించిన ప్రభుత్వా ధినేతలు, నాయకులు, ప్రయివేటు బస్సు యాజమాన్యాల రక్షణ చర్యలపై కానీ, బస్సుల నిర్వహణ విషయంపై కానీ మాట్లాడరు. నోళ్లు పెకలవు. ఇది ప్రభుత్వ వ్యవస్థ చేసిన హత్యలే. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేసి, ప్రజల అవసరాలను తీర్చాలన్న తలంపు కూడా ప్రభుత్వాలకు లేదు. ప్రయివేటు వ్యవస్థ అనగానే ప్రజలకూ ఒకింత ఆసక్తి ఎక్కువ. ప్రయివేటు వాళ్లు సమర్థంగా ఉంటారనే ప్రచారం దానికి కారణం. కానీ ప్రజల రక్షణ, వారి సౌకర్యం, సౌలభ్యం ప్రయివేటు వారికి ఎందుకుంటుంది! లాభాలు దండుకోవడమే వారి ఏకైక లక్ష్యం. అలాంటి వారికే ప్రభుత్వాలూ వత్తాసు పలుకుతున్నాయి. ఇప్పుడు జరిగిన ఘోర ప్రమాదం మొదటిది మాత్రమే కాదు. దీనికి ఒకరిద్దరి తప్పిదమో కూడా కారణం కాదు. నిండిపోయిన అవినీతి ఫలమిది. ఇందుకు ప్రేరకులయిన రాజకీయ వ్యవస్థదీనేరం. ప్రభుత్వాలను సైతం అజమాయిషీ చేయగల ప్రయివేటు వ్యవస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరును తిప్పికొట్టి, ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకుని, పెంపొందించు కోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘోరాలను అప్పుడే నివారించగలుగుతాము.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -