Wednesday, December 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదు : కవిత

కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదు : కవిత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపై, తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌తో తనకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని, కుట్రపూరితంగా తనను, తన కుటుంబాన్ని పార్టీకి దూరం చేశారని ఆరోపించారు. ప్రస్తుతానికి కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేశారని, ఆ పార్టీతో తన బంధం తెగిపోయిందని కవిత తేల్చిచెప్పారు. ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన నేత తుమ్మల నాగేశ్వరరావును పార్టీ వదులుకోవడమే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషించారు. తుమ్మల లాంటి నేతను దూరం చేసుకోవడం నూటికి నూరు శాతం పెద్ద తప్పని అన్నారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు తనకు, జాగృతి కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీస గుర్తింపు కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు రెండూ తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యాయని కవిత విమర్శించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తామే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని ప్రకటించారు. సామాజిక తెలంగాణ సాధనే తన ఆశయమని, అవకాశం, అధికారం, ఆత్మగౌరవం కోసమే తన పోరాటమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపైనా కవిత విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని, బీసీల ద్రోహిగా మిగిలిపోతారని ఆరోపించారు. బీసీల పేరుతో కాంగ్రెస్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేసిందని ఎద్దేవా చేశారు. సీతారామ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని, పత్తి రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలపై బుధవారం హైదరాబాద్‌లో సింగరేణి భవన్‌ను ముట్టడిస్తామని కవిత ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -