వచ్చే జనవరికి పునరావాసం పూర్తి
మార్చికి ప్రాజెక్టు జాతికి అంకితం : ‘పోలవరం’ సందర్శన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు
ఏలూరు: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి విషయంలో రాజకీయాలు వద్దని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరి జలాల వినియోగంపై తలెత్తిన వివాదాన్ని ఆయన ప్రస్తావిస్తూ..తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులను తానే నిర్మించినట్టు చెప్పారు.నీటి విషయంలో రాజకీయాలు చేయకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.. సముద్రంలో కలిసిపోయే నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తప్పేంటన్నారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ఒక అబద్ధం చెబితే నిజం అయిపోతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీటి విషయంలో రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడటం సరికాదు తెలుగు జాతి ఒక్కటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. భావోద్వేగాలతో ఆటలాడటం మంచిది కాదు’ అని ఆయన అన్నారు.
జనవరి నాటికి పునరావాసం పూర్తి
వచ్చే సంవత్సరం (2027) జనవరి నాటికి పోలవరం ప్రాజెక్టు ఫేజ్-1కు సంబంధించిన 41.15 మీటర్ల పరిధిలోని నిర్వాసితులకు పునారావాసం పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు. బుధవారం పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ముందుగా వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గం గుండా వెళ్లి ప్రాజెక్టు పనుల్లోని గ్యాప్1, 2 ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్, డయాఫ్రంవాల్ పనులను పరిశీలించారు. కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ పనులను చూశారు. పనుల పురోగతికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. గెస్ట్ హౌస్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, నిర్వాసితుల అంశాన్ని ప్రస్తావించారు. 41.15 కాంటూరు పరిధిలో 38,060 కుటుంబాలు ఉన్నాయన్నారు.
ఇప్పటి వరకూ 16,291 కుటుంబాలను తరలించామని, 21,769 కుటుంబాలను తరలించాల్సి ఉందని చెప్పారు. 75 ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు గాను 26 పూర్తి చేశామని, 49 పనులు జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం 1.99 లక్షల ఎకరాల భూ సేకరణకు గాను 91,125 ఎకరాలను సేకరించామన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి భూ సేకరణ పూర్తి చేస్తామన్నారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత డయాఫ్రం వాల్ దెబ్బతిన్నా కనిపెట్టలేక పోయారన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆరేడు సంవత్సరాలు ఆలస్యం అవుతోందని చెప్పారు. విదేశీ నిపుణుల సలహాలతో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నామని, 1,350 మీటర్లకు గాను 87 శాతం పూర్తయిందని చెప్పారు. ఫిబ్రవరి 15కు డయాఫ్రంవాల్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. మెయిట్ డ్యామ్‌లో గ్యాప్ -1 పనులు పూర్తయ్యాయని చెప్పారు. 2027 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. మొదటి దశ పనులు పూర్తయ్యాక రెండో దశ పనుల గురించి ఆలోచన చేస్తామని చెప్పారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలో పూర్తి చేసి రాయలసీమకు నీళ్లిచ్చామన్నారు.
గ్లోబల్ హబ్‌గా రాయలసీమ
దేశంలో ఎక్కువ ఉద్యానవన పంటలను ఉత్పత్తి చేసే రాయలసీమను గ్లోబల్ హబ్‌గా చేస్తామన్నారు. పోలవరం పూర్తి చేసి రాష్ట్రానికి ఇబ్బందిగా లేకుండా చేస్తానని చెప్పారు. ఈ ఏడాది ప్రాజెక్టుల్లో 780 టిఎంసిల నీరు ఉందని, వేసవి వెళ్లిన వెంటనే రైతులకు నీరిచ్చే పరిస్థితికి వచ్చామన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రెండు రోజుల్లో రైతులకు సొమ్ములు చెల్లించామన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారధి, ఏలూరు జిల్లాలోని ఎంఎల్‌ఎలు, అధికారులు పాల్గొన్నారు.



