Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఫొటోలు లేకుంటే వేతనాలు రావు

ఫొటోలు లేకుంటే వేతనాలు రావు

- Advertisement -

తాజా నిబంధనలతో ఉపాధి చట్టం కార్మికులకు కష్టాలు
న్యూఢిల్లీ :
గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పని చేసే కార్మికులు విధిగా ఫొటోలు అందజేయాల్సి ఉంటుంది. లేకుంటే వారికి వేతనాలు రావు. ఉపాధి పథకం మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ లేదా ఎన్‌ఎంఎంఎస్‌ హాజరు యాప్‌ తెచ్చిన తంటా ఇది. ఇప్పటికే అసమంజసంగా, ఆచరణసాధ్యం కాని విధంగా ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల మరింత కట్టుదిట్టం చేసింది. కార్మికుల హాజరును నమోదు చేసేందుకు కేంద్ర గ్రామీణా భివృద్ధి శాఖ 2022 మేలో ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ను తప్పనిసరి చేసింది. దీనిపై పౌర సమాజ సంఘాలు, కార్మిక సంఘాలు, క్షేత్ర స్థాయి పరిశోధకులు అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కార్మికుల అభ్యంతరాలను మంత్రిత్వ శాఖ జూలైలో అంగీకరిం చింది. యాప్‌ దుర్వినియోగం అవుతోందని గుర్తించింది. అయితే లోపాలను సరిదిద్దాల్సింది పోయి మరో సాంకేతికపరమైన ఆదేశాన్ని జారీ చేసింది. ఫొటోను సరిచూడడం, డేటా నిల్వ, నివేదికను అందించడం వంటి పనుల భారాన్ని పంచాయతీలు, బ్లాక్‌ అధికారులపై మోపింది. కానీ అందుకు అవసరమైన అదనపు సిబ్బందిని కానీ, మౌలిక సదుపాయాలను కానీ కల్పించలేదు.ఎలాంటి ముందు జాగ్రత్తలు, సన్నాహాలు లేకుండా నిబంధనలు అమలు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ను పని ప్రదేశంలో సూపర్‌వైజర్లు నిర్వహించాల్సి ఉంటుంది. స్టాంపు వేసిన, జియోట్యాగ్‌ చేసిన కార్మికుల ఫొటోలను రెండు సార్లు…పనిదినం ప్రారంభ సమయంలో, పని పూర్తయిన సమయంలో… తీయాల్సి ఉంటుంది. ఫొటోలను ఆఫ్‌లైన్‌లో తీసి తాత్కాలికంగా నిల్వ చేసినప్పటికీ చిత్రాలను అప్‌లోడ్‌ చేయాలంటే ఇంటర్నెట్‌ సదుపాయం తప్పనిసరి. పని పూర్తయిన తర్వాత తీసే ఫొటోలు అప్‌లోడ్‌ కాని పక్షంలో కార్మికులు వేతనంలో కొంత భాగాన్ని కానీ, పూర్తిగా కానీ కోల్పోతారు. పగలంతా కష్టపడి పనిచేసినా ప్రయోజనం ఉండదు.
గత నెల 8వ తేదీన గ్రామీణాభివృద్ధి శాఖ కఠినమైన ఎన్‌ఎంఎంఎస్‌ హాజరు ప్రొటోకాల్‌తో సర్క్యులర్‌ జారీ చేసింది. అనేక కొత్త నిబంధనలు విధించింది. జియోట్యాగ్‌ చేసిన రెండు ఫొటోలు ఉంటేనే కార్మికులకు పూర్తి వేతనం చెల్లిస్తారు. ఒక ఫొటో మాత్రమే అప్‌లోడ్‌ అయితే సగం వేతనమే వస్తుంది. అప్‌లోడ్‌ అయిన ఫొటోలను పరిశీలించే బాధ్యత గ్రామ పంచాయతీలు, బ్లాకులు, జిల్లాలు, రాష్ట్రాల అధికారులదే. పరిశీలించిన ఫొటోలను సంవత్సరం పాటు కానీ లేదా సామాజిక ఆడిట్‌ జరిపేంత వరకూ కానీ నిల్వ చేయాలి. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు స్థానిక సంస్థల వద్ద ఉండవు. ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేని చోట కార్మికుల సంఖ్య 20 కంటే తక్కువ ఉంటే గతంలో ఈ యాప్‌ నుంచి మినహాయింపు లభించేది. ఇప్పుడు దానిని తొలగించారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా వేతనాల కోతతో కార్మికులను శిక్షించడమేమిటని పలువురు ప్రశ్నించారు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండదు. అలాంటప్పుడు యాప్‌ ద్వారా కార్మికుల హాజరును ఎలా నమోదు చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img