తొలి విడతలో నామినేషన్ల దాఖలుకు ముందుకు రాని అభ్యర్థులు
మంచిర్యాలలో 3, ఆసీఫాబాద్, నిర్మల్ జిల్లాలో ఒక్కొక్కటి
133 వార్డులకు సైతం నామినేషన్లు నిల్
సర్పంచ్ ఎన్నికల బరిలో 22,330 మంది అభ్యర్థులు
నేడు అప్పీళ్లపై పరిశీలన
3న నామినేషన్ల ఉపసంహరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో తొలి దశలో ఎన్నికలు జరుగుతున్న 4,236 పంచాయతీల్లో 5 గ్రామాలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. నవంబర్ 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నామినేషన్లకు అవకాశం కల్పించినా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఒక్కరు కూడా దాఖలు కాని ఆ గ్రామాలు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందినవే కావడం గమనార్హం. మంచిర్యాల జిల్లాలో 3, ఆసీఫాబాద్, నిర్మల్ జిల్లాలో ఒక్కొ గ్రామంలో పోటీకి అభ్యర్థులెవరూ ముందుకు రాలేదు. స్థానిక సమస్యలు తీర్చాలనీ, తమ గ్రామాన్ని నిర్లక్ష్యం చేశారని తదితర కారణాలతో ఆయా గ్రామాలు ఎన్నికలు దూరంగా ఉన్నట్టు సమాచారం. అలాగే 37,440 వార్డులకు గాను 133 వార్డులో కూడా ఎవరూ పోటీకి ఆసక్తి చూపక పోవడంతో ఒక్క నామినేషన్ దాఖలు కాలేదని ఈసీ తెలిపింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 34 వార్డుల్లో, ఆ తర్వాత ఆసీఫాబాద్ జిల్లాలో30 వార్డుల్లో నామినేషన్ వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాఖలైన మొత్తం నామినేషన్ల పరిశీలన అనంతరం సర్పంచ్ స్థానాలకు 22,330 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 85,428 మంది బరిలో నిలిచి నట్టు తెలిపారు. నేడు అప్పీళ్ల పరిశీలన, బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
రెండో దశ తొలి రోజు సర్పంచ్ నామినేషన్లు 2,975 వార్డు ఎన్నికల్లో 38,342 గాను 3,608 నామినేషన్ల దాఖలుకు నేడే అఖరి రోజు
రెండో విడుత గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజు మంద కొడిగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,332 సర్పంచ్ స్థానాలకు 2,975 నామినేషన్లు, 38,342 వార్డులకు 3,608 నామినేషన్లు దాఖలయ్యాయి. 187 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సిద్దిపేటలో అత్యధికంగా 228, ఆ తర్వాత వికారాబాద్ జిల్లాల్లో 184 నామినేషన్లు వచ్చాయి. 117 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్న వరంగల్ జిల్లాలో అత్యల్పంగా 32. ఆ తర్వాత ములుగు జిల్లాలో 18 నామినేషన్లు దాఖలయ్యాయి 1,540 వార్డు స్థానాలకు రెండో విడుతలో ఎన్నికలు జరగుతున్న రంగారెడ్డి జిల్లాలో 316, ఆ తర్వాత సిద్దిపేట జిల్లాలో 218 నామినేషన్లు వచ్చాయి. అత్యల్పంగా మలుగులో 24, జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలో 28 నామినేషన్లు వచ్చినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. కాగా రెండో రోజు నామినేషన్ల వివరాలను మంగళవారం ప్రకటించనున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.



