నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట జిల్లాలో మొదటి విడతన 8 మండలాలలో 159 గ్రామపంచాయతిలు, 1442 వార్డ్ లకు గాను 44 నామినేషన్ కేంద్రాల ద్వారా నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదినికి తెలియజేశారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు ,ఎస్పీలు, పంచాయతీ అధికారులతో గ్రామపంచాయతీ ఎన్నికలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సూర్యపేట జిల్లాకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వివరిస్తూ నామినేషన్ల స్వీకరణకు 44 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, నామినేషన్ కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తు, రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
మొదటి విడత నామినేషన్లు ,ఎన్నికల కమిటీలు, ఇతర వివరాలకు సంబంధించిన అన్ని రిపోర్టులను టి పోల్ లో అప్లోడ్ చేశామని, అలాగే సమస్యత్మక,అత్యంత సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను సమర్పిస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రవర్తన నియమాలని తు.చ తప్పకుండా అమలు చేసేందుకు అవసరమైన సిబ్బందిని, ఇతర నోడల్ టీమూలను ఏర్పాటు చేశామన్నారు. ఎంసీఎంసీ, ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి పంపించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని జిల్లా కలెక్టర్ల తో మాట్లాడుతూ మొదటి విడత నామినేషన్లకు తీసుకున్న చర్యలు ,బందోబస్తు, రిసెప్షన్ కేంద్రాల వివరాలను అప్లోడ్ చేయటం, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, వివిధ రకాల కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై సూచనలు చేశారు.జిల్లా నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ కె సీతారామారావు, డిపిఓ యాదగిరి, డి ఆర్ డి ఏ పి డి వి వి అప్పారావు, డివిజనల్ పిఓలు తదితరులు పాల్గొన్నారు.



