రెండో దశలో సర్పంచ్ స్థానాలకు 28,278
అత్యధికంగా నల్లగొండజిల్లాలో 2,116…అత్యల్పంగా సంగారెడ్డిలో 1,444
వార్డు స్థానాలకు 93,595 దాఖలు…6న అభ్యర్థుల తుది జాబితా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం మంగళవారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డులకు రెండోదశలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి దాఖలైన నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారులు బుధవారం వెల్లడించారు. సర్పంచ్ పదవికి 28,278 నామినే షన్లు, వార్డు స్థానాలకు 93,595 నామినే షన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవికి అత్యధికంగా నల్లగొండ జిల్లాల్లో 2,116 నామినేషన్లు దాఖలయ్యా యి. ఈ జిల్లాలో రెండు రోజుల్లో 883 నామినేషన్లు దాఖలు కాగా, చివరి రోజు 1,233 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత అత్యధిక నామినేషన్లు దాఖలైన రెండో జిల్లాగా సూర్యాపేట నిలిచింది.
ఈ జిల్లాల్లో 181 గ్రామ పంచాయతీలకు 1,447 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 243 జీపీలకు గాను 1,444 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 52 జీపీలకు గాను 288 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుల వారీగా రెండోదశలో మొత్తం 38,342 వార్డులకు 93,595 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధిక నల్లగొండ జిల్లాలో 2,418 వార్డులకు గాను 6,120 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 2,164 వార్డులకు గాను 4,965 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా ములుగులో 420 వార్డు స్థానాలకు గాను 1,109 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. సర్పంచ్, వార్డు మెంబర్లకు దాఖలైన నామినేష్ల పరిశీలన బుధవారం రాత్రి వరకు కొనసాగు తూనే ఉంది. పరిశీలన పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం అధికారులు సక్రమంగా ఉన్న నామినేషన్ల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
నేటి నుంచి రెండో దశ అప్పీళ్లు
తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యర్థి సంబంధిత రెవెన్యూ డివిజనల్, సబ్ కలెక్టర్ వద్ద రిటర్నింగ్ అధికారిపై డిసెంబర్ 4న అప్పీల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 5న అప్లీళ్లను పరిష్కరిస్తారు. డిసెంబర్ 6న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించి ఆల్ఫాబేటికల్ వారీగా ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు.



