Friday, October 31, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబెయిలౌట్‌ కాదు…బ్లాక్‌మెయిల్‌

బెయిలౌట్‌ కాదు…బ్లాక్‌మెయిల్‌

- Advertisement -

డిస్కంలకు రూ.లక్షకోట్ల ప్యాకేజీ కేంద్రం కుట్ర
రాష్ట్రాల హక్కుల్ని హరించే ప్రయివేటీకరణ చర్య
ప్రజలు తిప్పికొట్టాలి : ఈఈఎఫ్‌ఐ


నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజలు తమ విద్యుత్‌ హక్కును పరిరక్షించుకుంటూ, ఆ రంగంలో కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ చర్యల్ని తిప్పికొట్టాలని ఇండియన్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (ఈఈఎఫ్‌ఐ) కోరింది. ఈ మేరకు తెలంగాణ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీజీయూఈఈయూ) ప్రధాన కార్యదర్శి నలవాల స్వామి గురువారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కంలు) కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 1 లక్ష కోట్ల బెయిలౌట్‌ ప్యాకేజ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కొన్ని ఆంగ్ల దినపత్రికల్లో దీనికి సంబంధించిన కథనాలు ప్రచురితమయ్యాయనీ, ఈ ప్రతిపాదన అత్యంత దుర్మార్గమైందని విమర్శించారు.

ప్యాకేజీలో భాగంగా డిస్కంలను ప్రయివేటీకరించాలనీ, లేకుంటే ఆయా రాష్ట్రాలకు చెందిన డిస్కంలను స్టాక్‌ ఎక్స్చేంజీలోకల లిస్ట్‌ చేయించాలని కేంద్రం బలవంతం చేయడం సరికాదన్నారు. ఇది విద్యుత్‌ సంస్థల్ని అదానీ, రిలయన్స్‌, టాటా వంటి పెద్ద కార్పొరేట్లకు అప్పగించి, లాభం చేకూర్చే ప్రభుత్వ బ్లాక్‌మెయిల్‌ చర్య అని విమర్శించారు. 1990 నాటి సరళీకృత ఆర్థిక విధానాల కొనసాగింపేననీ, దీన్ని విద్యుత్‌ ఉద్యోగులతో పాటు ప్రజలు సమర్ధవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 2025 విద్యుత్‌ (సవరణ) బిల్లు కూడా ఇవే అంశాలను ప్రస్తావిస్తున్నాయని తెలిపారు. విద్యుత్‌ సంస్థల ప్రయివేటీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలను రకరకాల ఆర్థిక ప్రలోభాలకు గురిచేస్తున్నారనీ, అమలు చేయని రాష్ట్రాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. విద్యుత్‌ సవరణ బిల్లు 2018, 2020, 2022లో పునరుద్ధరించినా నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (ఎన్‌సీసీఓఈఈఈ) నేతృత్వంలో బలమైన పోరాటాల వల్లే నిలుపుదల సాధ్యమైందన్నారు.

డిస్కంలకు నష్టాలు ప్రభుత్వ సరళీకృత ఆర్థిక విధానాలు, ఎక్కువ ధరకు ప్రయివేటు సంస్థలు విద్యుత్‌ను విక్రయించడం వంటివే కారణమని స్పష్టంచేశారు. విద్యుత్‌ సంస్థల్లో ప్రయివేటీకరణ పదేపదే విఫలమైనా, కేంద్ర ప్రభుత్వం గుణపాఠాలు నేర్వట్లేదని పేర్కొన్నారు. ఇఇఎఫ్‌ఐ విద్యుత్‌ రంగాన్ని కాపాడేందుకు ఐక్యంగా నిలుస్తుందనీ, ఎలాంటి షరతులు లేకుండా డిస్కంలకు ఆర్థిక సహాయం అందించాలనీ, విద్యుత్‌ (సవరణ) బిల్లు 2025 తక్షణం రద్దు చేయాలనీ, విద్యుదుత్పత్తి ఖర్చులను నియంత్రించి, మార్కెట్‌ ఆధారిత ధరల అస్థిరతను తగ్గించాలని కోరారు. క్రాస్‌ సబ్సిడీలను రక్షించి, రైతుల విద్యుత్‌ హక్కును మానవ హక్కుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌రంగ పరిరక్షణ కోసం ప్రతి భారతీయుడు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -