బీసీ రిజర్వేషన్లపై చిలువలు, పలువలు చేయొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేసీఆర్‌ది కల్వకుంట్ల కాదు… ఎవరినీ కల్వకుండా చేసే కుటుంబమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. అందుకే బీసీ బిల్లుకు అడ్డు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలు.. హిందువులు కలవకుండా, బీసీలు.. ఓసీలు కలవకుండా, ఎస్సీలు.. ఎస్టీలు కలవకుండా చూడటమే కల్వకుంట్ల కుటుంబ లక్ష్యమని రేవంత్ ఎద్దేవా చేశారు. ఆదివారం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యుల విమర్శలపై సీఎం స్పందించారు. బీసీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిస్తే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందన్నారు. బిల్లుపై చర్చకు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ వచ్చి ఉంటే ఆయన పెద్దరికం నిలిచేదని చెప్పారు. ‘తాను చెడ్డ కోతి వనమల్లా చెడగొట్టినట్టు’ కేసీఆర్ వ్యవహారం ఉందన్నారు. కేసీఆర్ ఒత్తిడికి లొంగకుండా బిల్లుకు మద్దతు తెలపాలని గంగుల కమలాకర్‌ను కోరారు. రాజకీయ వివాదాలకు తావివ్వకుండా, ఆరోపణలు చేయకుండా మంచి ఉద్దేశంతో తెచ్చిన బిల్లుకు మద్దతివ్వాలని కోరారు. ‘బీసీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దు. ఈ ఒక్క విషయంలోనన్నా కేసిఆర్ ఒత్తిడికి లొంగొద్దు. నువ్వేం వాళ్లకు భయపడకు మిత్రమా. మనం పాత మిత్రులమే కదా. నీకు తెల్వంది ఏముంది. వాళ్లకు ఇష్టం లేదు. వాళ్ల పోకడలు ఎట్లుంటయో నీకు తెల్వదా. నేను చెప్పాల్నా. నాకు వాళ్ల గురించి చానా తెలుసు.. కాబట్టే కర్రు కాల్చి వాత పెట్టి ఇక్కడొచ్చి కూర్చున్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం బీసీల రిజర్వేషన్లకు గుదిబండగా మారిందని విమర్శించారు. ఆ అడ్డంకులను తొలగించేందుకు ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. బీఆర్‌ఎస్ తెర వెనుక ఉండి దాన్ని ఆమోదం పొందకుండా కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలంటూ ఐదుసార్లు ప్రధాని మోడీకి లేఖ రాసినా ఆయన స్పందించలేదన్నారు. అందుకే బీసీ రిజర్వేషన్లపై తాము ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తే వివిధ పార్టీలకు చెందిన 100 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు కానీ రాజ్యసభలో బీఆర్‌ఎస్ ఎంపీలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. కడుపులో కావాల్సినంత విషం పెట్టుకుని బీఆర్‌ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్వకుంట్ల కాదు.. కల్వకుండా చేసే కుటుంబం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES