నవతెలంగాణ – మునిపల్లి :మునిపల్లి మండలం లోని పోల్కంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో తనకున్న వ్యవసాయ భూమిలో తాను ఫామ్ హౌస్ నిర్మించుకోలేదని అది ఫామ్ హౌస్ కాదని ఫార్మర్ హౌస్ అని భారాస రాష్ట్ర నాయకులు, పి ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పైతర సాయికుమార్ వివరణ ఇచ్చారు. తాను తన సొంత వ్యవసాయ భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టానని, పది సంవత్సరాలుగా ఎలాంటి పనులు చెల్లించలేదని కార్యదర్శి షోకాజ్ నోటిస్ అందించడంపై , నవతెలంగాణ దిన పత్రికలో వచ్చిన కథనంపై ఆయన స్పందించి వివరణ ఇచ్చారు.
ఈ మేరకు సాయికుమార్ ఒక ప్రకటన విడుదల చేస్తూ తాను తన వ్యవసాయ భూమిలో 100 గజాలలో స్లాబు మరియు 50 గజాలలో రేకులతో నిర్మాణం చేపట్టానన్నారు. అదేవిధంగా రేకులతో పశువుల పాకను సైతం నిర్మించానన్నారు. అయితే తాను నిర్మించిన సమయంలో గ్రామపంచాయతీ నుంచి అనుమతి పొందే విధానం లేదని అందువల్లే అనుమతి తీసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇందు కోసం వ్యవసాయ భూమిలో 10 గుంటల భూమిని కూడా వ్యవసాయేతర భూమిగా (నాన్ అగ్రికల్చరల్ ) మార్చినట్టు సాయికుమార్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా 16 సంవత్సరాల క్రితం తాను అనుమతితోనే సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ కూడా మంజూరు చేయించుకున్నాను అని ఆయన అన్నారు.
కేవలం కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఒత్తిడితో గ్రామపంచాయతీ కార్యదర్శి తనకు నోటీసులు అందజేశారని ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉందని సాయికుమార్ పేర్కొన్నారు. గ్రామపంచాయతీ అధికారులు కొలతలు పూర్తిచేసి తనకు పన్ను నోటీసు అందజేస్తే ఎప్పుడో పన్ను చెల్లించే వాడినని ఇంతవరకు ఎవరు కూడా తనకు పన్ను అడిగిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలకు సైతం ఎన్నో అనుమతులేని పామ్ హౌసులు,అసైన్డ్ భూములలో ఇల్లు ఉన్నాయని తాను ఆధారాలతో సహా నిరూపిస్తానని ఇలాంటి చౌకబారు రాజకీయం చేస్తూ తనను కానీ బారాస పార్టీని కానీ అపఖ్యాతి చేసేందుకు ప్రయత్నించొద్దని సాయికుమార్ సూచించారు.