Tuesday, December 9, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్గ్లోబల్‌ సమ్మిట్‌ కాదు… గోబెల్స్‌ సమ్మిట్‌

గ్లోబల్‌ సమ్మిట్‌ కాదు… గోబెల్స్‌ సమ్మిట్‌

- Advertisement -

కాంగ్రెస్‌ రెండేండ్ల పాలనలో అభివృద్ధి ఏది ?
ఇది ప్రజాపాలన కాదు…నయవంచన
అన్ని వర్గాలనూ మోసం చేసిన రేవంత్‌రెడ్డి
హామీలు అమలు చేయకుంటే ప్రజలు ఫుట్‌బాల్‌ ఆడతారు : మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్‌ పేరుతో నిర్వహిస్తున్నది గ్లోబల్‌ సమ్మిట్‌ కాదనీ, గోబెల్స్‌ సమ్మిట్‌ అని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఈ రెండేండ్లలో అన్ని వర్గాల ప్రజలకూ మొండిచేయి చూపించిందని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రెండేండ్లలో అంతా అయోమయం, గందరగోళం, ఆగమాగం అని అన్నారు. హామీలు అమలు చేయలేదనీ, అభివృద్ధి, సంక్షేమంలో అడుగు ముందుకు పడలేదని చెప్పారు. ఈ రెండేండ్లలో నిస్సారం, నిష్పలం, నిరర్ధకమని ఎద్దేవా చేశారు. 2014లో కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన మొదటి రెండేండ్లలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని హామీ ఇచ్చి ఒక్క రోజే ప్రజలను కలిశారని అన్నారు. ఆయనో బిల్డప్‌ బాబాయిలా మారాడని చెప్పారు. కరీంనగర్‌ నుంచి గొడుగు నాగరాజు సమస్యతో ప్రజావాణికి పరిష్కారమైందంటూ సమాచారం వచ్చిందన్నారు. కానీ ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదన్నారు. విందులు, వినోదాలు, జల్సాలకు ప్రజాభవన్‌ వేదికగా మారిందని చెప్పారు. సీఎల్పీ సమావేశాలు జరుగుతున్నాయని వివరించారు. అభివృద్ధి ఏం లేదనీ, పారదర్శకత కాకుండా దోపిడీ చేస్తున్నారనీ, గ్యారంటీలు గారడీగా మారాయని అన్నారు. ఇది ప్రజా పాలన కాదనీ, నయవంచక పాలన అని విమర్శించారు. అంతా ఆత్మస్తుతి పరనింద అని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి విజన్‌ లేదు, విధానం లేదన్నారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ తగ్గిందని చెప్పారు. ప్రభుత్వ ఆదాయం ఎందుకు తగ్గిందో సమాధానం చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. వ్యవస్థీకృత అవినీతి జరుగుతున్నదని ఆరోపించారు. ఆర్‌ఆర్‌ పన్ను, భట్టి, పొంగులేటి, ఉత్తమ్‌ పేరుతో పన్నులను వసూలు చేస్తున్నారని అన్నారు. ఇందులో కాంగ్రెస్‌ అధిష్టానానికి కూడా భాగముందన్నారు. కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు కాంగ్రెస్‌ పాలనలో కాదేదీ స్కాంకు అనర్హం అన్నట్టుగా మారిందని చెప్పారు. కాంగ్రెస్‌ది అభయహస్తం కాదనీ, భస్మాసుర హస్తమని విమర్శించారు. నెలకు రూ.2,500 ఇవ్వకుండా మహిళలను మోసం చేశారని అన్నారు. హత్యలు, లైంగిక దాడులు, ఆత్మహత్యల్లో తెలంగాణ రైజింగ్‌గా ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వకపోవడం వల్ల ఓ బీసీ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ప్రభుత్వం విజయోత్సవాలు కాకుండా అపజయోత్సవాలను నిర్వహించాలని కోరారు. అందర్నీ మోసం చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఏ ఊరిలో అయినా పూర్తిగా రుణమాఫీ అయ్యిందా?అని ప్రశ్నించారు. మధిర, ఖమ్మం, కొడంగల్‌ నియోజకవర్గాల్లో ఏ గ్రామానికైనా వెళ్దామని సవాల్‌ విసిరారు. అందరికీ రుణమాఫీ అయ్యిందంటే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. ఈ ప్రభుత్వం జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ను ప్రకటించిందన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడల్లా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసిందని చెప్పారు. ప్రతి బిల్లుకూ 20 శాతం, 30 శాతం కమీషన్‌ తీసుకుని ఢిల్లీకి మూటలు పంపిందన్నారు. ఈ రెండేండ్లలో రూ.18 వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చిందని అన్నారు. దీనిపై బహిరంగచర్చకు సిద్ధమని ప్రకటించారు. కానీ ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీ ఇవ్వడానికి, ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించడానికి మాత్రం డబ్బుల్లేవంటూ ప్రభుత్వం అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్ల బిల్లులు ఇప్పిస్తే అందుకే వాటా తీసుకునేలా సీఎం రేవంత్‌రెడ్డి కొత్త స్కీం తెచ్చారని ఎద్దేవా చేశారు. గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలతో విద్యార్థులు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం అందించలేని ఈ సీఎం అట్టర్‌ఫ్లాప్‌ అయ్యారని అన్నారు. ఇంటర్‌ విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందించలేదన్నారు. కళ్యాణలక్ష్మికి రూ.980 కోట్లు బకాయి ఉందని చెప్పారు. వృద్ధులకు రూ.నాలుగు వేల పెన్షన్‌ పెంపు ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.20 వేల కోట్లు దారిమళ్లాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టికి ఆ కూర్చీలో ఉండే అర్హత లేదన్నారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వలేని దుస్థితిలో ఉందని చెప్పారు. ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సీతో ఈనెల 13న సీఎం రేవంత్‌రెడ్డి ఆట వల్ల ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా?అని ప్రశ్నించారు. ఆరుగ్యారంటీలు, ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రేవంత్‌రెడ్డిని ప్రజలే ఫుట్‌బాల్‌ ఆడతారని హెచ్చరించారు. ప్రజలు గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు జి జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కెపి వివేకానంద, చింత ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌, కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -