ప్రజారోగ్య పరిరక్షకులు పారిశుధ్య కార్మికులు
ఎండైనా, వానైనా పని ఆగదు
వేతనాలు మాత్రం అరకొరే..
కష్టానికి గుర్తింపూ లేదు- సమాజంలో చిన్నచూపు
సర్కారు హామీలన్నీ నీటిమూటలే!
అరిగోసలో అణగారిన వర్గాల జీవితాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
‘సఫాయి కార్మికులు కాదు…సిపాయిలు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే రక్షకులు. మనమైతే ఆ పని చేయగలమా? చెత్తను చూసి ముక్కుమూసుకుని పోతాం. వారిని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాలదే’ ఇవి మున్సిపల్, పంచాయతీ కార్మికుల అణగారిన జీవితాల గురించి పొద్దునలేస్తే పాలకులు చెప్పే మాటల కోటలు. కానీ వాస్తవం మరోలా ఉన్నది. రోజూ తెల్లవారక ముందే లేచి ఊరంతా శుభ్రం చేస్తారు. చెత్త బుట్టల దగ్గరే భోజనం, దుర్వాసన మధ్యే జీవితం. ఎండైనా, వర్షమైనా ఒక్క రోజు సెలవు లేదు. అలాంటి వాళ్లే మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ వర్కర్లు. పొద్దున లేవగానే రోడ్లు అద్దంలా చేయడంలో వారి శ్రమ అసాధారణం. వారి వెనకున్న కష్టాలు మాత్రం పాలకులకు కనిపించడం లేదు. మున్సిపల్ కార్పొరేషన్లలో పని చేసే సానిటేషన్ వర్కర్లతో నెలకు రూ. 12వేల నుంచి రూ. 15 వేలతో పని చేయిస్తున్నారు.
గ్రామాల్లోనైతే పరిస్థితి మరింత దీనస్థితిలో ఉన్నది. చాలా చోట్ల రూ. ఏడువేల నుంచి రూ. 8వేల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. పదిహేనేండ్లుగా పని చేస్తున్నా ఉద్యోగ భద్రత లేదు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పేరిట తమను ఏ రోజైనా తీసేస్తారేమోనన్న భయం వెంటాడుతున్నది. పట్టణాల్లో జనాభాతోపాటు చెత్త, చెదారం పెరుగుతోంది. అదే సంఖ్యలో కార్మికుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. 40-50 ఇండ్ల నుంచి చెత్త సేకరించాల్సిన కార్మి కులు…150 నుంచి 200 ఇండ్ల నుంచి సేకరించాల్సి వస్తోంది. మాస్కులు, గ్లౌవ్స్ లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, చర్మవ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి.
చాలామంది వర్షంలో రోడ్లపై డ్రైన్స్ శుభ్రం చేస్తూ గాయపడినా, చికిత్సకు సాయం అందడం లేదు. గ్రామ పంచాయతీ ల్లో చెత్త సేకరణకు సరైన వాహనాలు ఉండవు. చాలా చోట్ల వాళ్లే సైకిళ్లతో, ఆటోలతో చెత్త తీసుకెళ్తారు. బండ్లపై చెత్త ఎక్కించి తీసుకెళ్తూ దుర్వాసనతో రోజంతా బాధపడుతున్నారు. డంపింగ్ యార్డు లేకపోవడంతో ఎక్కడ పడితే అక్క డే పారేయాల్సి వస్తోంది. దాంతో గ్రామాల్లో ఘర్షణ లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు వాగ్దానాలు అమలు కావడం లేదు. సానిటేషన్ కార్మికులకు కనీస వేతనం ఇస్తామని, సేఫ్టీ కిట్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ అవి కార్యరూపం దాల్చడం లేదు. కానీ వారంత కోరుకునేది గౌరవంతో పాటు ఉద్యోగ భద్రత కావాలని అడుగుతున్నారు.
గాల్లో దీపాలు
రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వివిధ రకాల పనులు చేసే కార్మికులు 64వేల మంది ఉన్నారు. ప్రజారోగ్యం, పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యంతోపాటు కరోనా, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధుల నుంచి ప్రజలను కాపాడుతూ నిరంతరం శ్రమిస్తున్నారు. వారి బతుకులు మాత్రం గాల్లో దీపంలా తయారయ్యాయి. బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.60ని విడుదల చేసి కేటగిరీల వారీగా వేతనాలను రూ.15,600లు, రూ.19,600లు, రూ.22,750లుగా నిర్ణయించింది. ఆర్థిక శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం మున్సిపన్ సిబ్బందికి కేటగిరీల వారిగా వేతనాలు అమలు చేయకుండా జీవో నెం.4 విడుదల చేసి గంపగుత్తగా అందరికీ ఒకే వేతనాన్ని వర్తింపజేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మున్సిపాల్టీలలో పనిచేస్తున్న పబ్లిక్, నాన్‌పబ్లిక్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు మున్సిపల్ కార్మికులకు ఎన్నో హామీలిచ్చింది.
కానీ వాటిని అమలు చేయలేదు. మున్సిపల్ కార్మికుల్లో అత్యధికంగా దళిత, గిరిజన, బలహీనవర్గాలకు చెందిన నిరుపేదలు ఉన్నారు. 2వ పీఆర్‌సీలో మినిమం బేసిక్ రూ.26,000 నిర్ణయించింది. కేటగిరీల వారీగా వేతనాలను చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మున్సిపల్ కార్మికులకు మొదటి ప్రాధాన్యతనిచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వున్నది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్‌ఎంఐఎస్) ఆన్‌లైన్‌లో పోర్టల్లో ప్రస్తుతం మున్సిపాల్టీల్లో పని చేస్తున్న కార్మికులందరికీ అవకాశం కల్పించకుండా 60 ఏండ్లు వయస్సు పైబడిన, అనారోగ్యంపాలైన, సాధారణంగా లేదా ప్రమాదంలో మరణించిన మున్సిపల్ కార్మికుల స్థానంలో ఇప్పటికే పని చేస్తున్న వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. కానీ దాన్ని అమలు చేయకుండా 4, 5 నెలల వేతనాలు చెల్లించకుండా తొలగిస్తున్నారు. ఇది అన్యాయం.
పట్టించునేవారేరి?
రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయితీల్లో సుమారు 6వేల మంది గ్రామ పంచాయితీ ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం, పల్లె పకృతి వనాలు, వైకుంఠధామాలు, డ్రైవర్లు, ఆఫీసు నిర్వహణ తదితర పనుల్లో వివిధ కేటగిరీల వారీగా పనులు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజలకు సేవలందిస్తున్నారు. గ్రామ పంచాయితీ కార్మికులను పర్మినెంట్ చేయాల్సి ఉంది. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలి. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్నారు. వాటిని పరిష్కరిస్తామంటూ రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు కావడం లేదు. పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రీన్ ఛానల్ ద్వారా 2025 జనవరి నుంచి నేరుగా ప్రభుత్వమే కార్మికుల అకౌంట్లలో వేతనాలు చెల్లిస్తామని ప్రకటించింది. పది నెలలు గడుస్తున్నప్పటికీ సీఎం హామీ అమలుకు నోచుకోలేదు. దీంతో కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పీఆర్‌సీ ఇవ్వాలి
మున్సిపల్ వర్కర్లకు 2వ పీఆర్‌సీ నిర్ణయం మేరకు వేతనాలు చెల్లించాలి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలంటూ రాజ్యాంగంలో పేర్కొంది. అయినా దాన్ని పాటించకుండా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్దతిలో నియామకాలు చేస్తున్నారు. పైగా పీఆర్‌సీల్లో చెప్పిన విధంగా వేతనాలు ఇవ్వకపోగా, తగ్గిస్తూ వస్తుంది. శ్రమకు తగిన వేతనాలను కూడా ఇవ్వడం లేదు. ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌తో 8వేల మంది రోడ్డునపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలి. అదే విధంగా గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. ఈ విధానం వల్ల కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు కలగడం లేదు. పాత విధానాన్ని కొనసాగించాలి.
-పాలడుగు సుధాకర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ముని.్సపల్ వర్కర్స్ అండ్‌ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ)



