Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఒకటి కాదు.. మూడు..?

ఒకటి కాదు.. మూడు..?

- Advertisement -

జీహెచ్‌ఎంసీతోపాటు కొత్తగా మల్కాజిగిరి, సైబరాబాద్‌
విభజన పనుల్లో అధికార యంత్రాంగం
అధికారులు, కార్యాలయాల విభజన పూర్తయ్యాక తుది గెజిట్‌?
మల్కాజిగిరితో పోల్చితే ఆ కార్పొరేషన్‌కే డిమాండ్‌ ఫుల్‌
పోస్టింగ్‌ల కోసం జోరుగా పైరవీలు


నవతెలంగాణ-సిటీబ్యూరో
మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) ఇకపై మూడు సంస్థలుగా విడిపోనుంది. జీహెచ్‌ఎంసీని మూడు మహానగర పాలక సంస్థలుగా విభజించే దిశగా రంగం సిద్ధమైంది. అధికారికంగా మూడు కార్పొరేషన్లుగా ప్రకటించకపోయినా, ఆ దిశగా అధికారులు, సిబ్బంది విభజన ప్రక్రియను మొదలు పెట్టారు. వచ్చే నెల 10 వరకు ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఉండటంతో.. అప్పటిలోపు సిబ్బంది, ఇతరాత్రా విభజన ప్రక్రియను పూర్తి చేయాలనే స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుంచి అందడంతో దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలను వేగవంతం చేసింది. అధికారులు, సిబ్బంది, కార్యాలయాల కార్యకలాపాల విభజన ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వం నుంచి తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడనుంది. తర్వాత పూర్తిస్థాయిలో స్వతంత్ర కార్పొరేషన్‌లుగా చట్టబద్ధత పొందుతాయి.

కొత్త అధ్యాయానికి నాంది
జీహెచ్‌ఎంసీ పరిధిలోకి కొత్తగా 20 పురపాలికలు, 7 మున్సిపల్‌ కార్పొరేషన్లు కలిపి మొత్తం 27 పట్టణ స్థానిక సంస్థలను (యూఎల్‌బీలు) విలీనం చేయడంతో ప్రభుత్వం గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలనలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ విలీనంతో జీహెచ్‌ఎంసీ 300 కార్పొరేషన్లు, 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి 2,053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 12 జోన్లు, 60 సర్కిళ్లు ఉన్నాయి. జనాభా 1.34 కోట్లకు పైగా ఉండటంతో, విస్తీర్ణం.. జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అవతరించిందని ప్రచారం జోరందుకుంది.

అంతా ఒకే కార్పొరేషన్‌గా ఉండనుందని అంతా భావించారు. అయితే, ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు విస్తరించిన జీహెచ్‌ఎంసీని హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్దమవుతోంది. అందులో భాగంగానే ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బందిని మూడు కార్పొరేషన్‌లకు విభజన ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే జోన్లకు జోనల్‌ కమిషనర్లను ప్రభుత్వం నియమించగా, 60 సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా జోన్‌లకు పరిపాలన, ఆర్థిక, టౌన్‌ ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌ విభాగాలకు అధికారులు, సిబ్బంది బదిలీలు చేస్తున్నారు.

అక్కడి నుంచే నిర్మాణ అనుమతులు
నూతన గ్రేటర్‌ కార్పొరేషన్‌ల పరిధిలో టౌన్‌ ప్లానింగ్‌ వ్యవహారాల నిర్వహణను డైరెక్టర్‌ హోదాలోని ఇద్దరు సీనియర్‌ అధికారులకు అప్పగించారు. ఇకపై ఆయా జోన్‌ల పరిధిలోని భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు సంబంధిత అధికారుల ద్వారానే కమిషనర్‌ అనుమతికి వెళ్లనున్నాయి. జీహెచ్‌ఎంసీ చట్టం-1955లోని సెక్షన్‌ 119 ప్రకారం ఆస్తి పన్ను అంచనాలు, సవరణలు, మ్యుటేషన్‌లు, మినహాయింపులు వంటి సేవలకు సంబంధించిన అధికారాలను నిర్దిష్ట పరిమితులు, షరతులతో జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

భారీ బదిలీలు
విలీనంతో 300 డివిజన్ల పరిధిలో సుమారు 20 శాతం సిబ్బంది కొరత ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీలో భారీగా ఇంజినీర్ల బదిలీలు చేపట్టారు. ఏఈ, ఏఈఈ, డీిఈ, డీఈఈలతోపాటు క్వాలిటీ కంట్రోల్‌ సెల్‌ ఇంజినీర్లను 12 జోన్‌లలో అవసరమైన ప్రాజెక్టులు, నిర్వహణ విభాగాల్లో నియమించారు. ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్‌ (పరిపాలన)గా ఉన్న కె.వేణుగోపాల్‌ను మల్కాజిగిరి, ఎల్‌.బీ.నగర్‌, ఉప్పల్‌ జోన్‌లకు జాయింట్‌ కమిషనర్‌ (అడ్మినిస్ట్రేషన్‌, ఫైనాన్స్‌)గా బదిలీ చేశారు. గీతారాధికను కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ జోన్‌లకు జాయింట్‌ కమిషనర్‌గా నియమించారు. ముఖ్యంగా టౌన్‌ ప్లానింగ్‌, పారిశుధ్య విభాగాల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 1,500 మంది ఉద్యోగులు అవసరమని అంచనా వేసిన అధికారులు, ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు సమాచారం.

సైబరాబాద్‌ కార్పొరేషన్‌ కావాలి..!
మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌ కంటే సైబరాబాద్‌ కార్పొరేషన్‌ అభివృద్ధిలో పరుగులు పెట్టడం, భూముల ధరలు ఆకాశానంటడంతో ఈ కార్పొరేషన్‌కు డిమాండ్‌ పెరిగింది. దానికితోడు సైబరాబాద్‌ కార్పొరేషన్‌లో మణికొండ, శేరిలింగంపల్లి, తెల్లాపూర్‌, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, బాచుపల్లి, కూకట్‌పల్లి లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా (బహుల అంతస్తుల) నిర్మాణాలు సాగుతున్నాయి. దాంతో కొన్నాళ్లపాటు ఇక్కడ పోస్టింగ్‌ చేస్తే నాలుగు రాళ్లు(డబ్బులు) వెనకేసుకోవచ్చని కొందరు అధికారులు, సిబ్బంది భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా కొందరు సైబరాబాద్‌ కార్పొరేషన్‌లో పోస్టింగ్‌ కావాలంటూ పైరవీలు మొదలైనట్టు తెలిసింది. ఇంకొందరు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తోంది. మరికొందరు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సైతం కలిసి వినతిపత్రాలు ఇచ్చినట్టు సమాచారం. ఇదిలావుండగా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌ మాత్రం ఎలాంటి పైరవీలూ నడవవని చెబుతున్నారు. ప్రస్తుతం జరిగే బదిలీలన్నీ ఆయా అధికారుల పనితీరు, అర్హత, అనుభవాలను బట్టి పోస్టింగ్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు.

మూడు ప్రధాన కార్పొరేషన్లు విభజనలో
-హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) : శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, చార్మినార్‌, ఖైరతాబాద్‌, గోల్కొండ, సికింద్రాబాద్‌ జోన్‌లు.
-సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీసీఎంసీ) : కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ జోన్‌లు.
-మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీఎంఎంసీ) : మల్కాజిగిరి, ఎల్‌.బీ.నగర్‌, ఉప్పల్‌ జోన్‌లు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -