Tuesday, December 16, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపేరుకే కాదు…ఉపాధికీ ఎసరు

పేరుకే కాదు…ఉపాధికీ ఎసరు

- Advertisement -

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) పేరును మోడీ ప్రభుత్వం ‘పూజ్య బాపూ గ్రామీణ రోజ్‌ యోజన (పీబీజీఆర్‌వై)గా మార్చేసింది. ఇప్పటికే పెట్టిన ఈ ప్రతిపాదన అర్థరహితమని విపక్షాలు, బుద్దిజీవులు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తుండగానే… కనీసం చర్చకు ఆస్కారమివ్వకుండా చేసింది. ఆ రెండు పేర్లతో కాకుండా ‘వికసిత్‌ భారత్‌-గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ గ్రామీణ్‌ (విబి-జిరామ్‌జి)-2025’ అనే బిల్లును పార్లమెంట్‌ చడీచప్పుడు లేకుండా ఆమోదించుకుంది. ఏ పథకానికైనా పేరేదన్నది ముఖ్యం కాదు. దాని అమలు తీరు ఎలా ఉందనదే ప్రధానం. కొద్దిరోజులుగా కేంద్రం పాలనను పక్కన పెట్టి పేర్ల మార్పునకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనబడుతోంది. కార్మిక చట్టాలను లేబర్‌ కోడ్‌లుగా మార్చింది. ఉపాధి హమీ చట్టాన్ని స్కీమ్‌గా మార్చింది. చట్టం అంటే తప్పక అమలు చేయాలి. పథకం అన్నా రంటే అది ప్రభుత్వదయగా మారుతుంది. పని దినాలను 100 నుంచి 125కు పెంచడం మంచిదే కాని, అసలు చట్టాన్నే ఎత్తివేసిన తర్వాత పనిదినాలను పెంచితే మాత్రం ప్రయోజనమేమిటి?

యుపిఏ తొలి ప్రభుత్వ కాలంలో వామపక్షాల సంపూర్ణ మద్దతుతో రూపొందించబడిన ఎంజీఎన్‌ ఆర్‌ఈజీఎస్‌ చట్టం వంద రోజులు ఉపాధి కల్పించి.. పల్లెప్రాంత పేదల జీవన ప్రమాణాలను మెరుగు పరచడం కోసం ఎన్నో ఏండ్లుగా అమలవుతోంది. ఇప్పుడీ కార్యక్రమానికి హడావిడిగా పేరు మార్చాల్సిన అవసరమేంటో తెలియడం లేదు. గ్రామీణ పేదలకు కనీస జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన చట్టం కాస్తా బీజేపీ పాలనలో దాని లక్ష్యం నీరుగారుతోందనే వాదనలున్నాయి. ఈ పథకం పేదల జీవనోపాధి వనరులను బలోపేతం చేయాలనే దాని ప్రధాన లక్ష్యాన్ని సాధించడంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ స్టాండింగ్‌ కమిటీ ఇటీవల విడుదల చేసిన నివేదిక అందుకు సంబంధించిన కీలక అంశాలను లేవనెత్తింది. వేతనాల రేట్లు స్తబ్దుగా ఉండటం, తగినంత బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడం వంటి పలు అంశాలను ఈ నివేదిక ఎత్తిచూపింది. వాటిపై దృష్టి పెట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం దాని ఊసే లేకుండా దీని పేరును మార్చిపడేయడం వల్ల ఉపయోగమేమీ లేకపోగా, దాని అమలుపై మరిన్ని అనుమానాలను రెకెత్తిస్తోంది.

మహాత్మాగాంధీ అన్నా, పూజ్య బాపూ అన్న ఒక్కటే. కాకపోతే గాంధీ అనే పదాన్ని తొలగిస్తే, మోడీ ‘ఇగో’ సంతృప్తి పడుతుంది అనుకు న్నారంతా…తీరా చూస్తే ‘గాంధీ లేడు’…’బాపు లేడు’…’రామ్‌జీ’ వచ్చాడు. కొత్తపేరుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ ‘రామ్‌జీ’ కచ్చితంగా శ్రీ రాముడైతే కాదు… మహాత్ముడిని హత్య చేసిన నాథూరాం పేరే అయి ఉంటుంది. ఇది జాతిపితకు… ఈ దేశానికి అవమానం. క్రమంగా ఈ దేశ చరిత్ర నుంచి ‘గాంధీ’ని చెరిపేసే దుష్టత్వం. అంతేకాదు క్రమంగా ‘నాథూరాం గాడ్సే’ పేరుతోనే కొత్త పథకాలు వస్తాయనడంలో సందేహమే లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వంద రోజుల వేతన ఉపాధిని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, పని పూర్తయిన పదిహేను రోజుల్లోపే డబ్బులు జమ చేయాలన్న వాదనపై సర్కారు నుంచి ఉలుకుపలుకూలేదు.

ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా, వ్యవసాయ కూలీల కనీస వేతనానికి సమానంగా ఉపాధి హామీ వేతనాలను పెంచాలన్న డిమాండ్‌ పైనా స్పందన లేదు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన మెటీరియల్‌, వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌ లేకపోలేదు. యాప్‌ ఆధారిత హాజరు, ఆధార్‌ తప్పనిసరి చేయడం వల్ల మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని సరళతరం చేయాలని కోరుతున్నా… సర్కారుకు పట్టడం లేదు. కానీ, సామాజిక తనిఖీల పేరుతో, సాంకేతిక సమస్యను అడ్డం పెట్టుకుని స్థానిక నేతలు, అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. మరోవైపు బడ్జెట్‌ కోతలు అతిపెద్ద నేరం. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ బడ్జెటు తగ్గిస్తోందని, దీనివల్ల గ్రామీణ పేదలకు నష్టం జరుగుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఎంత వాస్తవమో ఈ పదేండ్ల బడ్జెట్‌ గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది.

ప్రభుత్వం ఇలాంటి వాటిపై దృష్టిపెట్టాల్సిన సోయి మరిచి…పేర్లు, ఊర్లు మార్చుకుంటూ కూర్చుంది. చాలా రాష్ట్రాల్లో నోటిఫైడ్‌ వేతనం రూ.300 వరకు ఉన్నప్పటికీ, పని కొలతల పేరుతో సగటున కూలీలకు రూ.213 వరకు అందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే వ్యవసాయం గిట్టుబాటుకాక, చాలామంది రైతులు కూలీలుగా మారిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. పనుల్లేక పట్టణాలకు వలసబాట పట్టిన జనం సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. వీటిని గాలికొదిలేసి, పథకం పేరు మార్చడంపై దృష్టి పెట్టడం విచారకరం. పేరు మార్పుకంటే, దానికి నిధులు పెంచడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేతప్ప పథకాల పేర్లు మారిస్తే, పెరుగుతున్న పేదరికం రేటు తగ్గదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -