– పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలో ఆర్డీఐకు గ్రీన్‌సిగల్
– రూ.లక్ష కోట్లతో నిర్వహణ
– క్రీడల్లోనూ ప్రయివేటు భాగస్వామ్యం
– కేంద్ర మంత్రివర్గం ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ రంగంలో ప్రయి వేటు రంగాన్ని ప్రోత్సహించ డమే లక్ష్యంగా రీసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నో వేషన్ (ఆర్డీఐ) పథకానికి కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగల్ ఇచ్చింది. రూ.లక్ష కోట్లతో ఈ పథకానికి ఆమోదం తెలిపింది. మంగళవారం నాడిక్కడ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో రూ.3 లక్షల కోట్లకుపైగా విలువచేసే ఉపాధి కల్పన, ఆవిష్కరణ, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు, పలు పథకాలకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం నేషనల్ మీడియా సెంటర్ (ఎన్‌ఎంసీ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రివర్గ సమావేశ వివరాలను వెల్లడించారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ (ఆర్డీఐ) పథకానికి మంత్రివర్గం ఆమోద తెలిపిందన్నారు.
ఇజ్రాయిల్, యూఎస్, సింగపూర్, జర్మనీ వంటి దేశాల్లో విజయవంత మైన గ్లోబల్ మోడల్స్‌ను అధ్యయనం చేసి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఎన్‌ఆర్‌ఎఫ్) రూపొందించిన అంతర్జాతీయ రోడ్‌మ్యాప్ ఆధారంగా ఆర్డీఐ పథకం ఉంటుందన్నారు. నిధుల విషయంలో ప్రయివేటు రంగం ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేందుకు దీన్ని డిజైన్ చేసినట్టు తెలి పారు. ఈ పథకం కింద ఆర్డీఐలో ప్రయివేటు రంగ పెట్టుబడులను ప్రోత్స హించేందుకు తక్కువ వడ్డీ, వడ్డీరహిత దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ అందించను న్నట్టు పేర్కొన్నారు. ఈ పథకం దేశంలో బలమైన ఆవిష్కరణలకు మంచి వాతావరణాన్ని నిర్మించేందుకు ఉద్దేశించిందని చెప్పారు. పరిశోధన ఆలోచన లను స్పష్టమైన ఉత్పత్తులుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
క్రీడల్లోనూ ఇక ప్రయివేట్ భాగస్వామ్యం
క్రీడల్లోనూ ప్రయివేట్ భాగస్వామ్యాన్ని పెంచే జాతీయ క్రీడా విధానం-2025కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యాలు (పీపీపీ), కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)తో ప్రయివేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించనున్నారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం క్రీడారంగంలో సాధిస్తున్న వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ పాలసీ తయారు చేసినట్టు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసి వారిలో ప్రతిభను పెంపొందించడం, కోచింగ్ అవకాశాలు మెరుగుపరచడం, దేశంలోని క్రీడా సదుపాయాలను బలోపేతం చేయడం ఈ పాలసీ లక్ష్యమని పేర్కొన్నారు. క్రీడల్లో యువ అథ్లెట్లు ప్రపంచ వేదికపై పోటీపడి విజయం సాధించేందుకు క్రీడా పాలసీ అవకాశం కల్పిస్తుందన్నారు. 2036 ఒలింపిక్ క్రీడలతో సహా అంతర్జాతీయ క్రీడల్లో రాణించడానికి ఇండియా బలమైన పోటీదారుగా ఉండేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుందని అన్నారు.
‘ఈఎల్‌ఐ’ కింద యజమానులకు ప్రోత్సాహకాలు
తయారీ రంగంలో ఉపాధిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (ఈఎల్‌ఐ)కి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. రూ.99,446 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఇది మ్యాన్యుఫ్యాక్చరింగ్-డ్రైవెన్ ఎకానమీకి కీలక గ్రోత్ ఇంజన్ అని గత బడ్జెట్‌లో వైష్ణవ్ ప్రకటించారు. ఇందులో రెండు భాగాలున్నాయని చెప్పారు. కొత్తగా ఉద్యోగ అవకాశాలను సృష్టించే యజమానులకు ప్రోత్సాహకాలు ఉంటాయని, దీర్ఘకాలిక శ్రామికశక్తిని కొనసాగించే వ్యాపారులకు ప్రతిఫలం ఇవ్వడంతో స్థిరమైన ఉపాధికి మద్దతు ఇస్తుందని అన్నారు. ఈ పథకం కింద మొదటిసారి ఉద్యోగులు ఒక నెల వేతనం (రూ. 15,000 వరకు) పొందుతారు.
అదనపు ఉపాధిని సృష్టించేందుకు యజమానులకు రెండేండ్ల వరకు ప్రోత్సాహకాలు అందిస్తారు. తయారీ రంగానికి మరో రెండేండ్ల పాటు పొడిగించిన ప్రయోజనాలు ఉంటాయి. 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలను సులభతరం చేయడానికి ప్రధానమంత్రి ఐదు పథకాల ప్యాకేజీలో భాగంగా 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ఈఎల్‌ఐ పథకాన్ని ప్రకటించారని అన్నారు. దీని మొత్తం బడ్జెట్ రూ. 2 లక్షల కోట్ల ఉంటుందన్నారు. రూ.99,446 కోట్ల వ్యయంతో ఈఎల్‌ఐ పథకం దేశంలో రెండేండ్ల కాలంలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. వీరిలో 1.92 కోట్ల మంది లబ్దిదారులు తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి ప్రవేశిస్తారని, ఈ పథకం ప్రయోజనాలు 2025 ఆగస్టు 1 నుంచి 2027 జులై 31 మధ్య వచ్చిన ఉద్యోగాలకు వర్తిస్తాయని అన్నారు.
రూ.1,853 కోట్లతో నాలుగు లేన్ల నేషనల్ హైవే
దక్షిణ భారతదేశంలో మౌలిక సదుపాయాలకు పెద్ద ప్రోత్సాహకంగా, తమిళనాడులోని జాతీయ రహదారిలోని పరమకుడి-రామనాథపురం సెక్షన్‌ను నాలుగు లేన్లుగా మార్చడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 46.7 కిలోమీటర్ల రోడ్డును రూ.1,853 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే పంబన్ వంతెన దగ్గర డబుల్ లైన్ రహదారి ఉందని.. ధనుష్కోడి వరకు సముద్ర తీరానికి సంబంధించిన డీపీఆర్ కూడా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని అన్నారు. రామనాథపురం ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందన్నారు.