Sunday, December 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇక జనంలోకి కేసీఆర్‌

ఇక జనంలోకి కేసీఆర్‌

- Advertisement -

రేవంత్‌రెడ్డితో ప్రజలే ఫుట్‌బాల్‌ ఆడతారు
బీజేపీ నేతలతో సీఎంకు లోపాయికారీ ఒప్పందాలు
దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి
2028లో మేం అధికారంలోకి రావడం ఖాయం : మీడియాతో చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌కు ఇచ్చిన గడువు ముగిసిందనీ, ఇక జనంలోకి కేసీఆర్‌ వస్తారనీ, పోరాటం చేస్తారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎవరితోనైనా ఫుట్‌బాల్‌ ఆడుకోవచ్చు కానీ, ఆయనతో ప్రజలు ‘ఫుట్‌బాల్‌’ ఆడుకోవడం ఖాయమని అన్నారు. ఆయన మాదిరిగా కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం తమ సంస్కృతి కాదనీ, అది కేసీఆర్‌ తమకు నేర్పలేదని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి, తీరా పంచాయతీ ఎన్నికల సమయంలో వాటిని 17 శాతానికి తగ్గించి కాంగ్రెస్‌ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డికి లోపాయికారీ ఒప్పందాలున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ‘ఏటీఎం’గా మారిందని ఆరోపించారు.

దమ్ముంటే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడి కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పథకాల పేర్లు మార్చడమే కాంగ్రెస్‌ పనిగా పెట్టుకుందని విమర్శించారు. హైదరాబాద్‌ నగరాన్ని మూడు ముక్కలు చేయాలనే రేవంత్‌రెడ్డి ఆలోచన అశాస్త్రీయమనీ, వార్డుల విభజన ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జరుగుతోందని అన్నారు. తాను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న హయాంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌, పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని గుర్తు చేశారు. కానీ రేవంత్‌రెడ్డివి అన్ని ఓటములేనని ఎద్దేవా చేశారు. ముమ్మాటికీ రేవంత్‌రెడ్డి, రాహుల్‌ గాంధీలు ‘ఐరన్‌ లెగ్‌’లు అని విమర్శించారు.

ఉపాధి హామీ చట్టానికి చేసిన సవరణల వల్ల గ్రామీణ పేదలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఆ చట్టానికి మహాత్మాగాంధీ పేరును తీసేయడాన్ని తప్పుపట్టారు. ఆ చట్టానికి తూట్లు పొడిచేలా నిబంధనలను మార్చిందనీ, కేంద్రం తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ‘హనీమూన్‌ పీరియడ్‌’ ముగిసిందనీ, ఇక కేసీఆర్‌ నేరుగా ప్రజల్లోకి వస్తారని కేటీఆర్‌ ప్రకటించారు. ఆదివారం జరిగే రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామన్నారు. 2028లో బీఆర్‌ఎస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. రేవంత్‌రెడ్డి పాలనకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే సూచిక అని అన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతుందన్నారు.

పల్లెలపై పగబట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం : కేటీఆర్‌
పల్లెలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం పగబట్టిందని కేటీఆర్‌ విమర్శించారు. ప్రభుత్వ చాతగానితనానికి యూరియా యాప్‌ ఒక నిదర్శనమని అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తాండూరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం మొబైల్‌ అప్లికేషన్‌ విధానం రైతు వ్యతిరేకమని విమర్శించారు. యూరియా యాప్‌ ఓ నాటకమనీ, రైతుల వరుసలను దాచే కుట్ర ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అసలు సమస్యపై దృష్టిసారించాలని కోరారు. కాంగ్రెస్‌కు ప్రణాళిక లేకపోవడం వల్లే యూరియా కష్టాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, గంగుల కమలాకర్‌, వి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, పైలట్‌ రోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -