కవులు, రచయితలూ సమాజంలోని అసమానతలు, దోపిడి, దౌర్జన్యాలతో రాజీ పడరు. వాటిపై, వాటికి మూలమైన తాత్విక సిద్ధాంతాలపై అక్షర యుద్ధం ప్రకటిస్తారు. నూతన సిద్ధాంతాల అన్వేషణ సాగిస్తారు. సమానమైన, సమున్నతతో కూడిన ప్రగతికి, సమసమాజానికి ఏది అవసరమో రాతలతో పరివ్యాపింపజేస్తారు. ఇది అంత సులువుకాదు. గ్యాలరీలో కూర్చుని ఒక ప్రేక్షకుడిలా సమాజ చరిత్రను పరిశీలించాలి. అనుభవాల్ని పోగేసుకోవాలి. పీడితులై గాయాల్ని, బాధల్ని మోయాలి. అప్పుడే వారి అక్షరం నిప్పురవ్వై మండుతోంది. కన్నీళ్ల నుంచి కవిత్వం సముద్రమై ఎగిసిపడుతోంది. సంపాదించిన జ్ఞానం మనో నేత్రమై వర్తమానానికి సరికొత్త దారులు వేస్తోంది. కేశవకుమార్ నాలుగు దశాబ్దాల సమాజ గమనాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశోధించి సరిగ్గా ఇదే పని చేస్తున్నాడు. వీరి కవితా సంపుటి ‘ఎగిరేపళ్లెం నడిచేమంచం ఓ కూనిరాగం’ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇందులో సమాజంలోని రాళ్లు, రప్పలు, గుంతలను వెతికి, వాటిని పూడ్చేందుకు గతానికి, భవిష్యత్తుకు మధ్య అంబేద్కర్ తాత్విక వారధిని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు.
చిన్న గ్రామం నుంచి మొదలైన వీరి ప్రయాణం దేశరాజధానిలో ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ వరకు సాగింది. కానీ తను చిన్నప్పటి నుంచి అనుభవించిన అసమానతలు, దోపిడీ లేని సమాజం కోసం కన్న కలలు కల్లలయ్యాయంటూ ”ఎన్ని ఆశల సీతాకోక చిలుకలు/ ఎగరకుండానే నేల కరుచుకుని/ రాయకుండానే పూర్తైన వాక్యం” అని బాధపడుతున్నాడు.
యూరప్ నుంచి హేతువు, పారిశ్రామికాభివద్ధి, స్వేచ్ఛ అంటూ అరువొచ్చిన ఆధునికత ఇక్కడ అన్ని ఖాళీలను పూరించలేకపోయింది. సాంస్కతిక రొమాంటిసిజంగా గతాన్ని కీర్తించడానికి కూడా పూనుకొంది. వీటిని ఆకళింపు చేసుకున్న కేశవకుమార్ ఆధునిత నుంచి అత్యాధునికతవైపు ప్రయాణిస్తున్న వర్తమాన పోకడల్ని, వాటి డొల్లతనాన్ని పట్టుకున్నాడు. అందువల్లే ”బాధాతప్త ప్రపంచం/ తాత్విక ప్రపంచం/ ఆసుపత్రులు కట్టుకో/ ఆధునికుని సమాధానం/ స్వర్గానికి దారి తెలుసుకో…. …. రథచక్రాల కవిగానం/ తుపాకీ పట్టుకో/ విప్లవకారుడి వీరజ్ఞానం!” అని ఆధునిక కవిత్వతత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. నోస్టాల్జియాలోంచి మాట్లాడుతూ ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. ”ఎట్టయితేనేం, గోడకిసిరేసిన బంతిలా నా పల్లెలోకే/ ఆత్మగౌరవం అడ్డొచ్చి వదిలెల్లిన ఊర్లోకే ఆఖరికి!” అని భూస్వాములు గ్రామలు వదిలి నగరాలకు, విదేశాలకు వలసెళ్లి పోతుంటే, నేడు దళితులకు గ్రామాలే సరైన ఆవాసాలంటున్నాడు.
తన కవిత్వానికి, ఇంటికి బండగుర్తు అంబేద్కర్ బొమ్మే అని చెప్పుకుంటున్న కేశవకుమార్ కవిత్వంలో దళిత జీవితం, పోరాటాలతో పాటు దళితతాత్వికత కూడా కనిపిస్తుంది. కులం పేరుతో నేటికీ జరుగుతున్న కుల, మతపరమైన దాడులకు కారణం మనుధర్మశాస్త్రమేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నాడు. చెప్పడమే కాదు దానిని తగలబెట్టిన అంబేద్కర్ కు వారసుడిగా ”వర్ణధర్మనేరంలో/ మనువు నోటి మీద/ మండుతున్న ఇనుపకడ్డీ పెట్టిన/ అంటరాని అగ్రహశాస్త్రం” అని ప్రకటిస్తున్నాడు. కులం అనేది భారతదేశ అభివద్ధికే గొడ్డలి పెట్టని తేల్చి ”కులం కుండీలో పెరిగిన/ అనాగరికి మరగుజ్జు మాయావక్షం” అని కుల మూలాల్ని తెంచాలన్న అంబేద్కర్ ఆశయాల్ని గుర్తుచేస్తున్నాడు.
మతం మత్తు అని ఎందరు చెప్పినా, ఎన్ని ప్రత్యక్ష రుజువులు ఉన్నా, అనుభవాలు ఎన్ని నేర్పినా మారని ప్రజల ఆలోచనల్ని ఎండగడతూ ”లాక్ డౌన్ లో దేవుడు/ కరోనాలో కాలం చేసిన పూజారి/ దేవుడికి పూజారికీ గడ్డుకాలమే/ జనాలకి బతుకు జ్ఞానోదయం/ దెయ్యాలే ఇక నిత్యనిజంలా!” అని కరోనా వాస్తవాల్ని ఉదహరిస్తున్నాడు. ఒకవైపు టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తూ, శాస్త్రీయజ్ఞానాన్ని వెదజల్లుతుంటే మనం మాత్రం పాలవర్గాల ఉచ్చులో పడుతున్నామంటున్నాడు. ”మారని సామాజిక ఆచరణని/ సనాతన ధర్మాన్ని/ రాజదండాన్ని/ బానిసల మెడపై/ నిత్యం మెరిసే కత్తిని/ నేను మోనార్క్‌ని!” అంటూ ఇంకా అనధికారికంగా, అధికారికంగా, మానసికంగా, భౌతికంగా మనల్ని నిర్దేశిస్తున్న మనుధర్మంపై పోరాటం చేసుస్తున్నాడు.
”పుస్తకాల్లో మెరిసే అక్షరాల్ని చెరిపేయండి/ ప్రశ్నలు చొరబడకుండా/ యూనివర్శిటీల చుట్టూ గోడలు కట్టండి” అంటూ విమర్శిస్తున్నాడు. సామాజిక సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి, వాటినే ఓట్లుగా మార్చుకుంటుందని చెప్తూ ”మతం పాలకుల పెట్టుబడి/ కులం సహజ అక్రమ సంపాదన/ దేవుడు సామాజిక వ్యాపార ముడిసరుకు/ ప్రజల అజ్ఞానం అదనపు సాంకేతిక వనరు” అని ప్రభుత్వ రహస్య ఎజెండాను బద్దలు కొడుతున్నాడు.
ప్రపంచీకరణ.. మనిషికి మనిషికి మధ్య యంత్రం అనుసంధానం. రియల్ కు, రీల్ కు మధ్య అభేదం. నిముషం కూడా మొబైల్ లేకుండా గడవని కాలం. నిజానికి, అబద్దానికి మధ్య ఎ.ఐ. మంత్రజాలం. దీనినే ఈ కవి ”మనమిప్పుడు స్మార్ట్ ఫోనులం/ ఫేసుబుక్లో లైక్ చేసే గ్రాఫిక్సులం/ వాట్సాప్లో తిరిగే గాసిప్పులం/ ఇన్ స్టాలో ఊరేగే చాటింపులం/ ఫిల్లర్స్‌తో పెయింట్ చేసిన మొఖాలతో/ అసలు రంగు కనిపించని ఫేక్ ఐడీలం” అంటున్నాడు.
మరోవైపు ఏకీకత ప్రపంచంలో అగ్రరాజ్య జిమ్ముక్కులను రట్టు చేస్తూ ”గ్లోబల్ మార్కెట్లో అన్నీ వినిమయమై/ప్రపంచీకరణే ఏక్ హీ రాస్తాగా!?” అంటున్నాడు. ఇంకా నీళ్ల యుద్ధాల వెనుక, భూ దందాల వెనుక ఉన్నది గ్లోబలైజేషనేనని ఆనవాళ్లునూ చూపిస్తాడు. గ్లోబల్ బీభత్సంలో/ బీటలు బారుతున్న లోకల్ జీవితం అని వాపోతున్నాడు.
కేశవకుమార్‌కు, అతని కవిత్వానికి నిర్ధిష్టమైన లక్ష్యం ఉంది. సమాజం పట్ల బాధ్యతా ఉంది. అందుకే తాత్వికుడిగా, పరిశీలకుడిగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, అంబేద్కరిస్టుగా ఈ కవిత్వంలో కనిపిస్తున్నాడు. వినిపిస్తున్నాడు. ప్రవచిస్తున్నాడు. ప్రవాహమై నినదిస్తున్నాడు. దళితుడిగా సమాజాన్ని, స్వానుభవంతో కొలుస్తున్నాడు. ”వెలేసిన అక్షరాల్లోంచి వేడిని పుట్టించాలి/ నేనో ఆత్మగౌరవ భాషనై/ మట్టి మాట్లాడుతున్నట్టుగానే/ జనంలోకి ప్రవహించాలి నేనిప్పుడు!” అని తన భాషే తన ఆత్మగౌరవ నినాదమని చాటుతున్నాడు.
కేశవకుమార్ కవిత్వంలో సున్నితమైన వ్యంగ్యం ఉవ్వెత్తున లేస్తుంది. ఒక్కోసారి పదాలతో, మరోసారి వాక్యాలతో సూదుల్లా గుచ్చి, ఆలోచనల్లో ముంచెత్తి కవిత్వాన్ని పదునెక్కిస్తుంది. ”విశ్వగురువులో…/ మాకు యే మోక్షమొద్దుగనీ/ నరకంలోనైనా స్వేచ్ఛగా నిద్రపోనీ!”, ”చరిత్రని కూలుస్తూ స్వమతాన్ని/ కొలుస్తూ సాగుతున్న సమరభేరి/ జయహో జేసీబీ! రిమ్ జిమ్ రోబో!!” అంటూ నిందాస్థుతిని అద్భుతంగా ప్రకటిస్తున్నాడు. ఇక ”కొత్త వాక్యాల్ని తోడు తీసుకెళ్లాలి”, ”విరగబడి పండిన కన్నీళ్లు”, ”వేదనా యంత్రం”, ”దుఃఖదేహాల భక్తి పరవశం”, ”వసంతపక్షి”, ”రోబోరాజు”, ”వెలుగుచొక్కా” లాంటి ఎన్నో రూపకాలు వస్తాశ్రితమై, అనుభూతితో కూడిన అనుభవాన్ని పంచుతున్నాయి.
గత, వర్తమానాల సామాజిక సంక్షోభాల్ని, వాటి కారణాలను, పరిష్కరాలాను గట్టిగా పట్టుకున్నాడు కేశవకుమార్. పోరాటం మరచిన నేటి మరమనిషికి మనిషితత్వాన్ని బోధిస్తున్నాడు. ప్రత్యామ్నాయ సాంస్కతిక, రాజకీయ చరిత్రను కల కంటున్నాడు. ”నువ్వేమో నాగరికతవి, నేనేమో నాగలిని/నువ్వు కవిత్వానివి, నేను నులవబడ్డ గొంతుకని!” అంటూ చరిత్రకు చేతులిచ్చి స్వేచ్ఛాభవిష్యత్తు కోసం పోరాటగీతాన్ని ఆలపిస్తున్నాడు.
– డా|| ఎ. రవీంద్రబాబు, 8008636981
అసందర్భకాలంలో సందర్భస్వేచ్ఛాగానం
- Advertisement -
- Advertisement -