నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు సుపరిపాలన అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు సరియైన రీతిలో ప్రజలకు చేరే విధంగా అధికారులు పారదర్శకతతో,బాధ్యతగా విధులు నిర్వహించి నియమ నిబంధనలు పాటిస్తూ అర్హులైన వారిని మాత్రమే గుర్తించాలని కలెక్టర్ సూచించారు.
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ క్షేత్రస్థాయిలో అధికారులు విధి నిర్వహణలో ఏమైనా తప్పు చేసిన, లబ్ధిదారుల ఎంపికలో ఏమైనా అవకతవకలు జరిగిన లోతుగా విచారించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అధికారులు భాద్యతతో నిజాయితీగా,నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మంచిగా సేవ చేయాలని కోరారు.
విజిలెన్స్ అవగాహన వారోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 27 నుండి నవంబర్ 2 వరకు నిర్వహించబడుతుందని తెలిపారు.విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ టో ల్ ప్రీ నెంబర్ 14432 గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. తదుపరి విజిలెన్స్ పోస్టర్ ను ఆవిష్కరించి అధికారులచే ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కె సీతారామరావు,విజిలెన్స్ అధికారులు దశరథ,రాంబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.



