ఉప్పునుంతల మండలంలో మహిళల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి
నవతెలంగాణ – ఉప్పునుంతల
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నప్పటికీ, స్థానిక స్థాయిలో అధికారులు ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమవుతున్నారని మండల ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మండలంలోని మహిళా సమైక్య ఆఫీసులో పని చేస్తున్న ఏరియా ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం) సహా సీసీలు విధులను నిర్లక్ష్యంగా నిర్వర్తిస్తున్నారని మహిళలతో పాటు వివిధ గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.
కొత్తగా చేరిన వారి పట్ల కూడా విధులపై ఎలాంటి మార్గదర్శకత లేకుండా, సమాచారం ఇవ్వకుండా వ్యవహరించడం, సోమవారం ఉదయం 11 గంటలు కావస్తున్న కాలి కుర్చీలు దర్శనమిస్తూ సమయపాలన లేకుండా పని చేయడం అన్నీ అధికారుల హిస్టారీతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. మండల సమైక్య ఆఫీసులో ఒక ఏపీఎం, నలుగురు సీసీలు ఉన్నప్పటికీ వీరు గ్రామాల్లో కనిపించరని, ఆఫీసు కూడా తరచూ ఖాళీగా ఉంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నా, కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల పథకాలు మహిళలకు చేరడం లేదని మండలస్థాయి మహిళలు వాపోతున్నారు.
జిల్లా స్థాయి అధికారులు దీనిపై సీరియస్‌గా స్పందించి, విధుల్లో నిబంధనలను పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మహిళా సంక్షేమం కోసం పని చేయాల్సినవారే బాధ్యతల పట్ల అలసత్వం చూపడం బాధాకరమని, ఉన్నతాధికారుల స్పందించి మండలం సమైక్యపట్ల చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.