పరకాల కేంద్రంగా కుటీర పరిశ్రమగా సాగుతున్న దందా….
నవతెలంగాణ – పరకాల
పరకాల కేంద్రంగా పశువుల కొవ్వుతో గుట్టుచప్పుడు కాకుండా నూనె తయారు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కుటీర పరిశ్రమగా సాగుతున్న ఈ దందా గోమాంస విక్రయం దారుల ఇంటింటికి సాగుతున్నట్లు కొందరు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
పరకాలలో ఈ దందా కొన్నేళ్లుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పరకాల లోని కొంతమంది మాంసం విక్రయదారులు గోవుల నుంచి తీసిన కొవ్వును ఆయిల్ తయారీకి ఉపయోగిస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ మేరకు నవ తెలంగాణ పత్రిక శుక్రవారం జరిపిన క్షేత్రస్థాయి సర్వేలో పరకాల మాదారం కాలనీలోని ఓ ఇంట్లో ఆయిల్ తయారీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొవ్వును ప్రత్యేక కడాయిలో పొయ్యి మీద ఉడిపిస్తూ తద్వారా ఏర్పడే ఆయిల్ ను రేకు పీపాలో నింపి విలువ చేయగా బయట నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నట్లు ఆయిల్ తయారీ నిర్వహకులు తెలపడం గమనార్హం.
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై స్థానికంగా కలకలం రేగుతోంది. ఈ ఆయిల్ ను పరకాల కేంద్రంగానే విక్రయిస్తున్నారా…? బయటికి తరలిస్తున్నారా…? ప్రజలు తినే ఆయిల్ కు
వినియోగిస్తున్నారా…? అనే చర్చలు పరకాలలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పరకాల కేంద్రంగా ఇంత బహిరంగంగా దందా జరుగుతుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులకి కానరావడం లేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి ఈ ఆయిల్ ను ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు. దీనికోసం ఉపయోగిస్తున్నారని దానిపై సముద్ర విచారణ జరిపించి తయారీదారుల పట్ల కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
పశువులకు కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తున్న వారిపై కట్టే చర్యలు తీసుకోవాలి: సీపీఐ(ఎం) మండల కార్యదర్శి: బొచ్చు కళ్యాణ్
పశువుల కొవ్వుతో గుట్టు చప్పుడు కాకుండా ఆయిల్ తయారు చేస్తున్న తయారీదారుల పట్ల పోలీసులు కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఆయిళ్ల తయారీ వంట నూనెలకు వినియోగిస్తున్నారా…? అనే దానిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. మండలంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ కురవడంతోనే ఇలాంటి వ్యవహారాలు వెలుగులకు వస్తున్నాయి. అనేక ఫుడ్ స్టాలలో నాణ్యత లేని ఆయిల్ ను వినియోగిస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు ఉండడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా పరకాల కేంద్రంగా ఫుడ్ సేఫ్టీ తనిఖీలు జరిగిన దాఖలాలు కానరావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరకాల కేంద్రంగా జరుగుతున్న అక్రమ ఆయిల్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.