నవతెలంగాణ-హైదరాబాద్
డీఎస్సీ-2003 నోటిఫికేషన్ కింద భర్తీ అయిన టీచర్లకు పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. 2003 నోటిఫికేషన్ ప్రకారం నియమితులైన తమకు పాత పెన్షన్ విధానం కాకుండా కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని అమలు చేయడం చెల్లదన్న పిటిషనర్ల వాదనను ఆమోదించింది. ఈ మేరకు జస్టిస్ నగేష్ భీమపాక మంగళవారం తీర్పు చెప్పారు. నోటిఫికేషన్ జారీ, ఆపై నియామక ప్రక్రియ పూర్తి వివరాలను పరిగణనలోకి తీసుకుని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న పిటిషనర్ల వాదనను ఆమోదిస్తున్నట్టు తెలిపారు. పిటిషనర్ల లాయర్లు వాదిస్తూ, 2003 కింద నోటిఫికేషన్ కింద నియమితులైన పిటినర్లకు 2004 ఆగస్టు 31వరకు అమల్లో ఉన్న పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనీ, అలా చేయకుండా 2004 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని అమలు చేయడం చెల్లదని చెప్పారు. 2003 నాటికి ముందున్న టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి 2003లో నోటిఫికేషన్ వెలువడిందనీ, ఈ ఎంపిక ప్రక్రియ 2004 జూన్ నాటికి పూర్తయ్యిందని తెలిపారు. అయితే, పాలనాపర ఆలస్యంతో 2005 నవంబర్‌లో నియామక ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. దీని ఫలితంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని అమలు చేశారనీ, దీంతో డీఎస్సీ-2003 నోటిఫికేషన్ కింద నియమితులైన వాళ్లకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. వాదనల తర్వాత హైకోర్టు.. పాలనాపరమైన కారణంగా జాప్యం చేయడం వల్ల జూన్‌లో నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ నియామకాలు జాప్యం అయ్యాయని గుర్తించింది. పిటిషనర్లు నష్టపోవడానికి వీల్లేదని, డీఎస్సీ-2003 నోటిఫికేషన్ కింద నియమితులైన వాళ్లకు పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.
కోర్టు టైం వేస్ట్ చేస్తారా? వ్యర్థ పిటిషన్లు వేస్తే భారీ జరిమానా విధిస్తాం : హైకోర్టు
కోర్టు సమయాన్ని వృథా అయ్యే తరహాలో పిటిషన్ వేసిన పిటిషనర్‌పై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వ్యర్థ పిటిషన్లు వేస్తే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మృతి చెందిన వ్యక్తి పేరుపై భవనానికి ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని కోరుతూ రెరాకు ఫిర్యాదు చేసి, హైకోర్టులో రెండు పిటిషన్లు వేయడాన్ని తప్పుబట్టింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్‌లోని పలు సర్వే నెంబర్లల్లోని భూమిలో హైరైజ్ భవనాల నిర్మాణ అనుమతులపై శ్రీజయవర్ధన్ అనే వ్యక్తి రెండో పిటిషన్ వేయడాన్ని చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ శామ్‌కోషితో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. 2019లో కేంద్రం పర్యావరణ, ఇతర అనుమతులు లభించాయని పిటిషనర్ వాదన. దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదిస్తూ.. పిటిషనర్ రెరాకు ఫిర్యాదు చేశారని, గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారని, ఇప్పుడు రెండో పిటిషన్ వేశారని బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో పిటిషనర్ తీరును హైకోర్టు తప్పుపట్టింది. పిటిషన్ వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరడంతో హెచ్చరిస్తూ అనుమతి మంజూరు చేసింది.
2003 డీఎస్సీ టీచర్లకు ఓల్డ్ పెన్షన్లు : హైకోర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES