- – ఎస్ టి యు ములుగు జిల్లా శాఖ డిమాండ్
నవతెలంగాణ – గోవిందరావుపేట - ప్రజా ప్రతినిధుల మాదిరిగానే ఉపాధ్యాయ, ఉద్యోగులకు కూడా పెన్షన్ అమలు చేయాలి. ఎమ్మెల్యే ఎంపీలకు ఎన్నిసార్లు ఎన్నికైతే అన్ని పెన్షన్లు ఉన్నప్పుడు 35 సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఎందుకు పెన్షన్ ఇవ్వకూడదు? దానికి అనుగుణంగా చట్టాల రూపకల్పన జరగాలి. నూతన పెన్షన్ రద్దు పైన నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం జడ్పిహెచ్ఎస్ చల్వాయి పాఠశాలలో బోజన విరామ సమయంలో సిపిఎస్ రద్దు చేస్తూ ఓ పి ఎస్ అమలు చేయాలని కోరుతూ నల్లబ్యాడ్జి లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ టి యు ములుగు జిల్లా అధ్యక్షులు శిరుప సతీష్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్2004 తరువాత నియమించబడిన ఉపాధ్యాయులు, ఉద్యోగులందరిపై అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) పూర్తిగా ఉద్యోగులకు అన్యాయం చేస్తోంది. భవిష్యత్ లో పెన్షన్ హక్కులు లేకుండా రిటైర్ కావాల్సిన పరిస్థితి మాకొస్తోంది. ఇది జీవన భద్రతను కోల్పోయేలా చేస్తుంది. అందుకే పాత పెన్షన్ పద్ధతి (ఓ పి ఎస్) ను తక్షణమే అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాం” అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ టి యు ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ళ మధుసూదన్ మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ జీతం నుంచి తమ పెన్షన్ కోసం 10% వంతు కోత చేసుకుంటూ ఉంటున్న వారికి అందుకు తగిన ప్రయోజనాలు లేవు. షేర్ల మార్కెట్ ఆధారంగా వచ్చే సిపిఎస్ రాబడులు భవిష్యత్ లో రిటైర్మెంట్ అనంతరం భద్రత కలిగించే స్థాయిలో లేవు. ఇది పూర్తిగా అనిశ్చిత పరిస్థితిని కలిగిస్తోంది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు భవిష్యత్తు భద్రత కోసం సిపిఎస్ రద్దు తప్ప మరే మార్గం లేదు” అన్నారు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సిపిఎస్ రద్దు చేయుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు శ్యామ్ సుందర్ రెడ్డి,ఉపాధ్యాయులు రవీందర్,సుమన్, స్రవంత్,సులోచన, రజిత , పావని, లక్ష్మీ, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.