– కేసీఆర్, హరీశ్‌పై సీఎం వ్యాఖ్యలు
– నిపుణుల సూచనలు తీసుకుని ‘కాళేశ్వరం’ పునరుద్ధరణ చర్యలు : ఎల్లంపల్లి డ్యామ్ సందర్శనలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ – గోదావరిఖని
నిపుణులు, ఇంజినీర్ల సూచనలు, సలహాలు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టు పునరుద్ధరణ, మరమ్మతు అవకాశాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం గురువారం పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా గోలివాడ పంప్ హౌస్ వద్ద ఉన్న హెలిపాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యే మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ స్వాగతం పలికారు. అనంతరం అంతర్గాంలోని శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టును భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్‌రాజ్ ఠాకూర్‌తో కలిసి సీఎం పరిశీలించారు.
ప్రాజెక్టుకు వస్తున్న వరద, ప్రస్తుతం ఉన్న నీటి నిలువ, దిగువకు వదులుతున్న వరద వివరాలను తెలుసుకున్నారు. గోదావరి జలాలను ఎక్కడికి తరలించాలన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణవాయువు లాంటిదన్నారు. కూలిపోయిన ప్రాజెక్టుకు నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టి ఎల్లంపల్లి దశాబ్ధాలుగా నిలబడిందని చెప్పారు. ”అతి తెలివి తేటలతో మామ, అల్లుడు.. ఒకరు స్వాతిముత్యం.. మరొకరు ఆణిముత్యం అనుకుంటారు. మేడారం, అన్నారం, సుందిళ్ల.. మూడు బ్యారేజీలను ఒకే రకమైన సాంకేతిక వైఫల్యాలతో నిర్మించారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి అన్నారంలో పోయాలి. అక్కడ నుంచి సుందిళ్ల, శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. మూడు బ్యారేజీల డిజైన్‌లో, నిర్మాణం, నిర్వహణలో లోపం ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయి. మేం 80వేల పుస్తకాలు చదవలేదు. 80వేల పుస్తకాలు చదివిన మేధావిని సలహా అడుగుతున్నాం.. ఏం చేద్దాం..” అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, వరద ముగిసే సమయానికి ప్రాజెక్టు నీటినిల్వ పూర్తిస్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు సీఎం సూచించారు. వారివెంట ఇరిగేషన్ సీఈ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాస్‌గుప్తా, అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణు, ఆర్డీఓ గంగయ్య తదితరులు ఉన్నారు.
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ధర్మపురి గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్లు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వాగులు, వంకలు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే అవాస్తవ పోస్టులను నమ్మొద్దని, అధికారిక ప్రకటనలనే నమ్మాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఒకరు స్వాతిముత్యం.. మరొకరు ఆణిముత్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES