Tuesday, December 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసామినేని హత్యకు నెలరోజులు-పరిణామాలు, ప్రచారాలు

సామినేని హత్యకు నెలరోజులు-పరిణామాలు, ప్రచారాలు

- Advertisement -

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) పార్టీ ఉమ్మడి రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు, ఉమ్మడి రాష్ట్ర రైతుసంఘం మాజీ అధ్యక్షులు, కార్యదర్శిగా పనిచేసిన సామినేని రామారావు హత్య జరిగి, నేటికి సరిగ్గా నెలరోజులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు నేరస్తులను అరెస్టు చేయలేదు. అరెస్టు చేయాలని కోరుతూ పోలీస్‌ కమిషనర్‌కు సీపీఐ(ఎం),అఖిలపక్షం తరపున విజ్ఞప్తి చేశాము. డీజీపీ, అడిషనల్‌ డీజీపీకి కూడా కూడా విజ్ఞాపనలు ఇచ్చాము. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో నిరసన ప్రదర్శనలు చేశాము. ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. చివరకు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ప్రశాంతంగా ధర్నా కూడా నిర్వహించాము. పార్టీ నాయకత్వంపై కేసులు పెట్టారు కానీ, నేరస్తుల అరెస్టు జరగలేదు. అరెస్టు చేయకపోగా, కాంగ్రెస్‌ స్థానిక నాయకత్వం, పోలీసు యంత్రాంగం తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టింది. దీనికి ఒకరిద్దరు కిరాయి రాతగాళ్లను ఎంచుకున్నది. అందులో ఒకతను సీపీఐ(ఎం)పై ఎప్పుడూ విషపురాతలు రాసే వన(o)జీవి వెంకటం. అతనికి పైసలు ముట్టజెప్పి సీపీఐ(ఎం)పై ఏ రాతలు రాయమన్నా రాస్తాడు. డబ్బుకోసం గడ్డి తినమన్నా నిస్సంకోచంగా తింటాడు.

ఇప్పుడే కాదు 2007 నుండీ సీపీఐ(ఎం)పై తప్పుడు వార్తలు రాయటం మొదలు పెట్టాడు. ఆనాడు కూడా ప్రజలకు వాస్తవాలు తెలియచేయటానికి నాటి ప్రజాశక్తి పత్రికలో నేనొక ఆర్టికల్‌ రాయాల్సి వచ్చింది. సామినేని రామారావు హత్యకేసును పక్కదారి పట్టించాలని చూసే కాంగ్రెస్‌ అధినాయకత్వానికి, పోలీసు యంత్రాంగానికి ఇతను, ఇతనికి తోడు మరొక కాకతీయం దొరికారు.
హత్యజరిగిన మరుక్షణం నుండి ఈ ప్లానును అధికార పార్టీ, పోలీసు యంత్రాంగం, కిరాయి రాతగాళ్లు అమలు చేయటం మొదలు పెట్టారు. కట్టుకథలు అల్లటం ప్రారంభించారు. వాస్తవాన్నీ, కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు, అది కొనసాగిస్తున్నారు. అందులో భాగమే హత్యజరిగిన మరునాడు కొన్ని పత్రికల్లో కాంగ్రెస్‌ నాయకుడు సామినేని రామారావు హత్య అని వార్త వచ్చింది. సీసీఐ(ఎం) నాయకుడిగా జిల్లా ప్రజలందరికీ తెలిసిన రామారావు రాజకీయాలు, పాత్రికేయులకు తెలియవా? అంతేకాదు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు, వ్యక్తిగత కక్షలతో హత్య జరిగిందని ప్రచారంలో పెట్టారు. రామారావుకు ఆస్తి వివాదాలు ఉన్నాయని ప్రచారం మొదలు పెట్టారు.

సీపీ దగ్గరకు వెళ్లినప్పుడు ఆయన స్వయంగా చెప్పింది ‘రామారావుకు ఆర్థిక వివాదాలున్నాయి. అందులో ఒక వివాద పరిష్కారంలో మీరుకూడా ఉన్నారు కదా?’ అని నన్నడిగారు. ‘ఎప్పుడు సార్‌’ అంటే ‘మూడు మాసాల కింద’ అన్నారు. ‘మూడు మాసాలు కాదు, ఆయనతో నా పరిచయం మూడు దశాబ్దాల నుండి. ఈ కాలం మొత్తంలో ఒక్కటంటే ఒక్క వివాద పరిష్కారంలో నేనున్నాని తెలిస్తే, మరీ విచారణ కొనసాగించండి, లేదంటే సరైన విచారణ చేయండి అన్నాము.’ దానికి సీపీ నుంచి సమాధానం లేదు. చివరకు రామారావు కుటుంబంలో ప్రేమ వ్యవహారాలతో హత్య జరిగిందని అత్యంత నీచమైన ప్రచార లీకులిచ్చారు. దానికి విచారణకు పూనుకున్నారు. రామారావు తన ఏకైక కుమారునికి కులాంతర వివాహం చేసిన ఆదర్శ నాయకుడు. అటువంటి నాయకుని హత్యపై, ఈ తప్పుడు విచారణ కొంతకాలం సాగదీసి, దాన్ని పొరపాటని భావించి ఊరుకున్నారు. చివరకిప్పుడు సీపీఐ(ఎం) పార్టీలో తేడాలే హత్యకు కారణమని ప్రచారం మొదలు పెట్టారు. ఇవన్నీ ఒక విలేకరో, ఒక పత్రికో రాసేవి కావు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి పెద్దవారు కూడా, వాస్తవాల్ని వక్రీకరించి ముద్రిస్తున్నారు.

వాస్తవంగా జరుగుతున్నదేమిటి?
ముందు కాంగ్రెస్‌ వారు చెపుతారు. పోలీసువారు నమ్ముతారు. దాన్నే విచారణ చేస్తారు. విచారణలోని పొంతన లేని అంశాలు కూడా, పొంతన ఉన్నట్లు కలిపి ఈ కిరాయి రాతగాళ్లకు చెపుతారు. వీళ్లు అవే వాస్తవాలన్న భ్రమ కల్పిస్తారు. చెప్పిన దానికి సంబంధం లేనివి కూడా కొన్ని కలిపి వార్తలు రాస్తారు. ఈ రాసిన దానిని మళ్లీ కాంగ్రెస్‌ వాళ్లే ప్రచారంలో పెడతారు. ఆశ్చర్యమేమిటంటే రామారావు భార్య ఇచ్చిన ఫిర్యాదులోని వ్యక్తు లను మాత్రం ఇంతవరకు విచారించలేదు. ఇది కాంగ్రెస్‌, పోలీసు, కిరాయి రాతగాళ్ల త్రయం చేస్తున్న దుర్మార్గ, పైశాచిక ప్రచారక్రీడ. ఇదేదో కోపంతో అంటున్న మాట కాదు. హత్య జరిగిన రోజునుండి జరుగుతున్న పరిణామాల వివరణ మాత్రమే. హత్య జరిగిన వెంటనే పోలీసు జాగిలాలొచ్చాయి, క్లూస్‌ టీంలొచ్చాయి, పోలీసు సీపీ కూడా వచ్చారు. సీపీఐ(ఎం) ఖండన కంటే ముందే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండన వచ్చింది. ఖండనతో పాటు నేరస్తులను వెంటాడి వేటాడి పట్టుకొంటామనే హామీ వచ్చింది. ఇదంతా ప్రజలకు కనపడటానికి చేసిన ఆర్భాటం. కానీ విచారణ మాత్రం దానికనుగుణంగా ఉండటం లేదు.

పోలీసు వారు ఇచ్చే వివరణ చూస్తే హాస్యాస్పదంగా ఉంటున్నది. పోలీసు జాగిలాలు, అక్కడ మాబ్‌ (జనం) ఉండేటప్పటికి గుర్తించలేక పోయాయంటున్నారు. ఎక్కడైనా ఒక ముఖ్య నాయకుని హత్య జరిగితే జనం గుమిగూడకుండా ఎలా ఉంటారు? గుమిగూడితే హంతకులను గుర్తించలేని విచారణ ఇదేం పద్ధతి. హత్యాస్థలం వద్దే పోలీసులు సూమోటో కంప్లయింట్‌ రిజిస్టర్‌ చేయడానికి తయారయ్యే అవకాశం ఉందని తెలిసి నేనూ, ఆ డివిజన్‌ కార్యదర్శి గోపాలరావు వెళ్లి సీపీకి ‘పిటిషన్‌ మేమే ఇస్తాము. మీరు సూమోటో రిజిస్టర్‌ చేయకండి సార్‌’ అని గోపాల్‌రావు అన్నాడు. సీపీకి విపరీతమైన కోపం వచ్చింది. ‘పిటిషన్‌ మీరెలా ఇస్తారని’ సీరియస్‌ అయ్యారు. ‘ఆయన మా పార్టీ నాయకుడు సార్‌ అందుకనే చెప్తున్నాము’ అంటే, ‘పొలిటికల్‌గా ఎంటర్‌ ఎలా అవుతారు? ఇది పొలిటికల్‌ మర్డర్‌ అంటే, మిమ్మల్ని వెంటనే అరెస్టు చేస్తాం సరైన ఆధారాలు చూపించకపోతే’ అని కోప్పడ్డారు. ‘ఎందుకు సీరియస్‌ అవుతారు, పొలిటికల్‌ మర్డర్‌ కాదని మీరెలా అంటారు ఆధారం లేకుండా’ అని మేము కూడా గట్టిగా మాట్లాడిన తర్వాత శాంతించారు.

విచారణలో నిర్లక్ష్యం
ఆ క్షణం నుండే ఈదుష్ప్రచార పరిణామాలు ప్రారంభమయ్యాయి. దానికనుగుణంగానే విచారణ జరుగు తున్నది. ఇప్పటివరకు చేసింది రామారావు పిల్లలు చదువుకొన్న కాలేజీల ప్రిన్సిపాల్స్‌ని, యాజమాన్యాలను విచారించటం. హత్యచేసిన వ్యక్తి వదిలివెళ్లిన చెప్పులపై రంగులున్నాయి కాబట్టి, తెల్దారుపల్లి గ్రామంలోని పెయింటర్స్‌ను కొందరిని మూడురోజులు విచారించారు. పెయింటర్స్‌ తెల్దారుపల్లిలోనే ఉంటారా? మరెక్కడా ఉండరా? వాళ్లల్లో ఒకరిని విపరీతంగా కొట్టి మరీ ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరకు ఏమీ తేలలేదని వదిలేశారు. ఈ మూడురోజుల్లో ఆ గ్రామ కాంగ్రెస్‌ నాయకత్వం తెల్దారుపల్లి వాళ్లే ఈ హత్య చేశారని ప్రచారం చేశారు. రామారావు ఫోన్‌లు తీసుకొని విచారించారు. ఫిర్యాదులోని నేరస్తుల పేర్లు రామారావు ఫోన్‌ తీసుకున్న కొన్ని రోజులకు మాత్రమే తీసుకొని మళ్లీ వెంటనే ఇచ్చారు. రామారావు ఫోన్‌ దీర్ఘకాలం ఉంచుకొన్నారు. పేరుకు ఐదు టీంలు వేశారట. టెక్నికల్‌ విచారణ అని ఒక టీంను కేటాయించారు. అక్కడ విచారించిన మిషన్‌లో లోపం ఉంది అని పది రోజుల తర్వాత నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు.

ఇంత ప్రాధాన్యత కలిగిన కేసులో పనికిరాని యంత్రంతో పది రోజుల విచారణ ఎలా చేస్తారు? కావాలని నిర్లక్ష్యంగా ఉండటం కాకపోతే. ఇంతవరకు రామారావు కుటుంబానికి గానీ, పార్టీ నాయకత్వానికి గానీ కనీస వివరాలు కూడా చెప్పట్లేదు. విచారణ గురించి వివరాలు తెలుసుకోవటానికి సీపీ దగ్గరకు పార్టీ నాయకత్వం వెళ్తే ‘మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకెందుకు చెపుతాం’ అంటున్నారు. కానీ కిరాయి రాతగాళ్లకు చెపుతున్నారు. వాళ్లు ప్రత్యక్షంగా రాతలో పేర్కొంటున్నారు. పోలీసు వారు ఇలా చెప్పారు, ఇలా విచారిస్తున్నారు అని. దాన్ని పోలీసువారు ఖండించరు. కిరాయి రాతగాళ్లు సీపీఐ(ఎం)లో విబేధాల వలన ఈ హత్య జరిగినట్లుగా పోలీసువారు పేర్కొంటున్నారని రాస్తున్నారు. ఇదంతా ప్లాను కాకపోతే మరేమిటి? చూడబోతే రానున్న రోజుల్లో దీన్ని ఒక ఆయేషా హత్య కేసులాగా, వివేకానందరెడ్డి హత్య కేసులాగా అసలు హంతకులను వదలేసి ఏ సంబంధం లేని వారిని ఇరికించే కుట్ర కనపడుతున్నది. అందుకే అభ్యుదయ, ప్రజాస్వామ్య, పౌర సమాజ నేతలకూ, ప్రజలనూ కోరుతున్నాం. న్యాయాన్ని, చట్టాన్ని కాపాడుకోవటానికి మేము చేస్తున్న ప్రయత్నాలకు, పోరాటాలకు మద్దతివ్వమని విజ్ఞప్తి చేస్తున్నాం.

పోతినేని సుదర్శన్‌రావు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -