ఐదుగురు సైనికుల మృతి
ట్రంప్‌తో నెతన్యాహూ మంతనాలు
గాజాను ఖాళీ చేయించే ప్రతిపాదనపై చర్చ
గాజా/వాషింగ్టన్ : ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరుగుతుండగానే మరోవైపు గాజాపై ఇజ్రాయిల్ దళాల దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తర ప్రాంతంలో మంగళవారం జరిగిన పేలుడులో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా 14 మంది గాయపడ్డారు. కాగా వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూతో చర్చలు జరిపారు. పాలస్తీనా ప్రజలను గాజా నుండి బలవంతంగా ఖాళీ చేయించి, పొరుగు దేశాలకు తరలించేందుకు ఉద్దేశించిన వివాదాస్పద ప్రతిపాదనపై వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఇదిలావుండగా ఎమనలో హౌతీలు ఎర్ర సముద్రంలో మరో నౌకను ధ్వంసం చేశారు. అందులోని గ్రెనేడ్లను లక్ష్యంగా చేసుకొని హౌతీలు దాడి జరిపారు.ట్రంప్, నెతన్యాహూ మధ్య శ్వేతసౌధంలోని బ్లూ రూమ్‌లో విందు సమావేశం జరిగింది. పాలస్తీనాకు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు అమెరికా, ఇజ్రాయిల్ ఇతర దేశాలతో కలిసి పని చేస్తున్నాయని నెతన్యాహూ చెప్పారు. గాజాలో నివసిస్తున్న వారు పొరుగు దేశాలకు తరలిపోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ‘గాజాలోనే ఉండాలని అనుకుంటే ఉండొచ్చు. కానీ వారు బయటకు వెళ్లాలనుకుంటే వెళ్లే అవకాశం కల్పించాలి. అది జైలులా ఉండకూడదు. ఓ బహిరంగ ప్రదేశంలా ఉండాలి. ప్రజలకు స్వేచ్ఛగా అవకాశం కల్పించాలి’ అని చెప్పుకొచ్చారు. ట్రంప్‌తో సమావేశం సందర్భంగా నెతన్యాహూ ఆయనకు ఓ లేఖ అందజేశారు. ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నానని అందులో నెతన్యాహూ తెలియజేశారు. దీనిపై నెతన్యాహూకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అణు కార్యక్రమంపై చర్చించేందుకు ఇరాన్ అధికారులు తమను సంప్రదిస్తున్నారని ట్రంప్ చెప్పారు. కాగా విడుదల చేసిన ఆరుగురు పాలస్తీనా బందీలను ఇజ్రాయిల్ చంపేసిందని హమాస్ సీనియర్ నేత అబ్దుల్ కరీం హనిని తెలిపారు. గడచిన 24 గంటల కాలంలో గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడులలో 49 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా 262 మంది గాయపడ్డారు. మృతులలో సహాయం కోసం శిబిరాల వద్దకు వచ్చిన ఎనిమిది మంది అన్నార్తులు కూడా ఉన్నారు. సెంట్రల్ గాజాలోని అల్-అఖ్సా ఆస్పత్రిలో తీవ్రమైన ఇంధన కొరత ఏర్పడింది. దీని ప్రభావం అనేక వార్డులపై పడుతోంది.
గాజాపై కొనసాగుతున్న దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES