నవతెలంగాణ-హైదరాబాద్: రోజుకు ఎన్ని గంటలు పని చేయాలనే విషయంపై ఇటీవల హాట్ టాఫిక్‌గా మారింది. సాధారణ ఉద్యోగం నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలకైనా, అదే విధంగా ప్రయివేటు, గవర్నమెంట్ సెక్టార్ అనే తేడా లేకుండా పని గంటలపై పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తంగా చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి కీర్తీసురేష్ కూడా తన తదుపరి చిత్రం ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆమె పని గంటల అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆరోగ్యం పరంగా చూసుకుంటే, రోజుకు 8 గంటల పని (9 టు 6) మాత్రమే సరైనది. ఎందుకంటే మనకు ఆహారంతో పాటు నిద్ర కూడా చాలా ముఖ్యమని కీర్తి సురేష్ తెలిపారు.
‘మహానటి’ సినిమా చేసే సమయంలో అదే టైంలో మరో 5 సినిమాలు కూడా చేశాను. అప్పుడు ఒక సినిమా షూటింగ్‌కు ఉదయం, మరొక దానికి రాత్రి సమయం ఇచ్చాను. నేను వర్క్ విషయంలో అంత డెడికేటెడ్‌గా ఉంటాను. అయితే సాధారణంగా సినిమా షూటింగ్‌లో ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి. అందరూ 9 టు 6 అని ఎందుకు అంటారంటే… మేము 9 గంటలకు సెట్‌లో రెడీగా ఉండాలంటే, ఉదయం 5 గంటలకు లేచి మేకప్, ఇతర పనులన్నీ మొదలుపెట్టాలి. సాయంత్రం 6 గంటలకు షూటింగ్ అయిపోయినా, ఇంటికి వెళ్లి సర్దుకుని పడుకునేసరికి రాత్రి 10 లేదా 11 అవుతుంది. సరైన నిద్ర ఉండదు. 9 టు 9 అంటే చాలా కష్టం. నటీనటులకే కాదు, సాంకేతిక నిపుణులకు కూడా ఇది వర్తిస్తుందన్నారు.
తమిళం, తెలుగులో 9 టు 6 (కొన్నిసార్లు 9 టు 9) ఉంది. కానీ మలయాళం, హిందీలో 12 గంటలు పని చేయాల్సి వస్తుంది. మలయాళంలో బ్రేక్స్ కూడా లేకుండా కంటిన్యూగా షెడ్యూల్స్ ఉంటాయి. ఇది చాలా కష్టం. దీని వల్ల కొందరు కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్ర పోతున్నారు. అంతకముందు రోజుకు 8 గంటల పని సముచితమని బాలీవుడ్ నటీ దీపికా పదుకొణె ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.



