– ఈనెల 1 నుంచి అమల్లోకి…
– అసంఘటిత రంగాన్ని విస్మరించిన కేంద్రం
– నిరుద్యోగాన్ని తగ్గించే విధానం ఇది కాదంటున్న ట్రేడ్ యూనియన్లు
– 2025 ఆగస్టు 1 నుంచి, 2027 జులై 31 వచ్చే ఉద్యోగాలకే వర్తింపు
– ఈపీఎఫ్‌ఓకు అదనపు బాధ్యతలు
భారత్‌లో ఉద్యోగాలు లేకపోవటంతో లక్షలాది మంది యువతీ, యువకులు ఖాళీగా ఉంటున్నారు. ఫలితంగా నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యపూరిత చర్యలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.99,446 కోట్లతో ఎంప్లాయిమెంట్-లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్‌ఐ) స్కీంకు జూన్ 1న కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఆ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది.
పీఎల్‌ఐ తరహాలోనే ఈఎల్‌ఐ
ఈఎల్‌ఐ స్కీం కూడా గతంలో రూ.1.46 లక్షల కోట్లతో తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీం లాంటిదే. రూ.76వేల కోట్ల విలువైన మూలధన వ్యయం ప్రోత్సాహక పథకం (క్యాపెక్స్) ఆధారంగా దీన్ని రూపొందించారు. ఈ పథకాలు కూడా ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతోనే ప్రారంభించారు. కానీ ఆ లక్ష్యాలు నెరవేరలేదు. ప్రజాధనం ప్రయివేటు సంస్థలకు తరలివెళ్లింది. ఈ మార్గంలోనే ఈఎల్‌ఐ స్కీం కూడా వెళ్లే ప్రమాదమున్నదని ట్రేడ్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
న్యూఢిల్లీ : వచ్చే రెండేండ్లలో 3.5కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించట మే ఈ పథకం లక్ష్యం. ఇంత భారీ లక్ష్యంతో అధిక మొత్తంలో నిధులతో ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం తీరుపై కార్మిక సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కేవలం ఉద్యోగ కల్పన పేరుతో యాజమాన్యాలకు ఆర్థికంగా లబ్దిని చేకూర్చేందుకే ఇది దోహదం చేస్తుం దనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌ఓ)ను లింక్ చేసినవారికే ఈ పథకాన్ని వర్తింపచేయాలనే షరతును ట్రేడ్ యూనియన్లు ఆక్షేపిస్తున్నాయి. అసంఘటిత రంగంలోని ఉద్యోగులు, కార్మికులను విస్మరించటం సరికాదని హెచ్చరిస్తున్నాయి.
నోడల్ ఏజెన్సీగా ఈపీఎఫ్‌ఓ
ఈఎల్‌ఐ స్కీం ద్వారా ఉద్యోగాల కల్పించాలనేది లక్ష్యం. దీనికోసం కంపెనీలకు లేబర్ కాస్ట్‌లను (ఇన్సెంటి వ్‌లు) చెల్లిస్తారు. పై తేదీల మధ్య ఉద్యోగాలు సాధించి, రూ.లక్షలోపు వేతన ం తీసుకొనే వారికి ఈపీఎఫ్‌ఓలో రిజిస్టర్ చేసి, నెలకు రూ. వెయ్యి నుంచి రూ.3వేల వరకు రెండేండ్లపాటు బ్యాంకు ఖాతాలకు జమచేస్తారు. సదరు ఉద్యోగి కచ్చితంగా 12 నెలలు పాటు కొనసాగేలా చూడాల్సిన బాధ్యత కంపెనీలదే. ఆలోపు ఉద్యోగం మానేస్తే, ఈపీఎఫ్‌ఓకు ఆ సొమ్మును యాజమాన్యం తిరిగి చెల్లించా లని షరతు పెట్టారు. ఉద్యోగికి ఇచ్చే జీతం ఆధారంగా ఇన్సెంటివ్ ఉంటుంది. అయితే ఈ పథకంలో ఈపీఎఫ్‌ఓను నోడల్ ఏజెన్సీగా ప్రకటించడంపై పలు అభ్యంత రాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులు, ఉద్యోగుల రిటైర్మెంట్ సేవింగ్స్ వ్యవహారా లను చూసే ఈపీఎఫ్‌ఓ స్వరూపాన్ని మారుస్తున్నారని కార్మిక సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కార్మికుల ప్రయోజనాలను కాపాడే సంస్థ యాజమాన్యాలకు మూలధనాన్ని అందించే సంస్థగా మారుతుందని చెప్తున్నారు.
రిజిస్టర్డ్ కంపెనీలకే…
ఈ పథకం రిజిస్టర్డ్ కంపెనీలకు వర్తిస్తుంది. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, అసంఘటిత రంగంలోని సంస్థలను మినహాయించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి చిన్న చిన్న సంస్థలే అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తాయి. వాటిని ఈ స్కీం పరిధిలోకి తేలేదు. అలాగే 20 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఈ స్కీం వర్తించకపోవటం పట్ల కార్మిక సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
లక్ష్యాలు చేరని పీఎల్‌ఐ, క్యాపెక్స్ స్కీంలు
పీఎల్‌ఐ స్కీమ్‌ను 2020లో ప్రారంభించారు. మొత్తం 14 తయారీ రంగాల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించడం కోసం ఈ స్కీంను తెచ్చారు. ఆ తర్వాత దాన్ని 17 రంగాలకు విస్తరించారు. 60 లక్షల ఉద్యోగాలను సృష్టించటం, జీడీపీలో ఉత్పత్తి రంగం వాటాను 15.4 శాతం నుంచి 25 శాతానికి పెంచాలనేది పీఎల్‌ఐ స్కీం లక్ష్యం. అయితే ఐదేండ్లలో ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే సృష్టించారు. జీడీపీలో ఆ రంగం వాటా 14.2 శాతానికి పడిపోయింది. క్యాపెక్స్ స్కీం కూడా ఇలాగే విఫలం అయ్యింది. ఈ స్కీం ద్వారా బడా కంపెనీలు, కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీ రూపంలో పెద్దఎత్తున నిధులు మళ్ళించారనే అనుమానాలు ఉన్నాయి. గుజరాత్‌లోని సన్సద్ ఇండిస్టీయల్ హబ్‌కు రూ.3.25 కోట్లను ఈ పథకంలో భాగంగా తరలించారని కార్మిక సంఘాలు ఉదహరిస్తున్నాయి. భారత్‌తో పాటు విదేశాలకు చెందిన ఇతర కంపెనీలు, సంస్థలకు ఈ స్కీం కింద పెద్ద ఎత్తున నిధులు అందినట్టు తెలిసింది. ఈ పథకాలు ఉద్యోగాలను సృష్టించటం కంటే దేశ, విదేశాలకు చెందిన బడా కంపెనీలకు ఆర్థికవనరుగా మారాయి. ఈ సొమ్మంతా దేశ ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నవే కావడం గమనార్హం!
సామాజిక భద్రతకు విఘాతం
తపన్‌సేన్, సీఐటీయూ జనరల్ సెక్రెటరీ
ఈ పథకం తప్పుతోవపడుతుంది. ఇది ప్రజాధనాన్ని యాజమాన్యాలకు తరలించే చర్య. పీఎల్‌ఐ, క్యాపెక్స్ కింద గతంలో లభించిన ఉద్యోగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కేంద్రం ఇప్పటి వరకు కార్మిక సంఘాలకు ఇవ్వలేదు. ఈఎల్‌ఐతో యాజమాన్యాలకు సబ్సిడీ అందుతుంది, అదే సమయంలో సామాజిక భద్రతను నీరుగారుస్తుంది.