Wednesday, July 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసంపన్నులకే ప్రయోజనం

సంపన్నులకే ప్రయోజనం

- Advertisement -

అల్పాదాయ వర్గాలకు శరాఘాతమే
ట్రంప్‌ ‘అత్యద్భుత’ బిల్లుపై సెనెట్‌లో మొదలైన చర్చ
వాషింగ్టన్‌ :
దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకుంటున్న ‘అత్యద్భుత బిల్లు’పై అమెరికా సెనెట్‌లో విస్తృత చర్చ జరుగుతోంది. అగ్రరాజ్యం శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో ఆ లోపే బిల్లుకు ఆమోదం పొందాలని రిపబ్లికన్లు ఆశిస్తున్నారు. మార్పులు, చేర్పులతో కూడిన 940 పేజీల తాజా బిల్లుపై చర్చ ప్రారంభించడానికి సెనెట్‌ శనివారం 51-49 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఇద్దరు రిపబ్లికన్‌ సభ్యులు డెమొక్రాట్లతో కలిసి తీర్మానాన్ని వ్యతిరేకించినప్పటికీ స్వల్ప మెజారిటీతో చర్చను మొదలు పెట్టారు. సెనెట్‌లో రిపబ్లికన్లకు 53, డెమొక్రాట్లకు 47 స్థానాలు ఉన్నాయి. రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్న అమెరికా ప్రతినిధి సభ మే 22న బిల్లును 215-214 ఓట్లతో ఆమోదించింది. అయితే సెనెట్‌లో దానికి కొన్ని సవరణలు చేశారు. సెనెట్‌ ఆమోదం తర్వాత అది చట్టంగా మారాలంటే ఉభయ సభలు మళ్లీ దానిని ఆమోదించాల్సి ఉంటుంది.


‘రాజీ’ తప్పదు
సవరణలతో తన ముందుకు వచ్చిన బిల్లును సెనెట్‌ ఆమోదించిన పక్షంలో ఉభయ సభల సభ్యులు రాజీకి వచ్చి ఓ బిల్లును రూపొందిస్తారు. అప్పుడు ప్రతినిధి సభలోనూ, సెనెట్‌లోనూ దానిపై ఓటింగ్‌ జరుగుతుంది. ప్రతినిధి సభలో రిపబ్లికన్లకు 220 స్థానాలు, డెమొక్రాట్లకు 212 స్థానాలు ఉన్నాయి. బిల్లు ఉభయ సభలలో ఆమోదం పొందిన తర్వాత అధ్యక్షుడి వద్దకు వస్తుంది. ఆయన దానిపై సంతకం చేస్తే చట్టంగా మారుతుంది. అయితే చివరికి ఓడేదెవరు? గెలిచేదెవరు? అన్నదే ఇక్కడ ప్రశ్న. బిల్లును డెమొక్రాట్లతో పాటు కొంతమంది సంప్రదాయవాదులు కూడా వ్యతిరేకిస్తు న్నారు. ఒకవేళ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే ఎక్కువ ప్రయోజనం ఎవరు పొందుతారన్న దానిపై అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి.


వీరికి నష్టమే
బిల్లు ఆమోదం పొందితే ఫుడ్‌ స్టాంప్‌ పొందుతున్న వారు, మెడిక్‌ఎయిడ్‌ ప్రయోజనాలు అందుతున్న అల్పాదాయ వర్గాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తిదారులు నష్టపోతారు. అల్పాదాయ వర్గాలకు చెందిన వారు ఆహారం కొనుగోలు చేయడానికి ఫుడ్‌ స్టాంపులు ఉపయోగపడుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నెలకు 42.1 మిలియన్ల ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందారు. ఈ కార్యక్రమానికి కేటాయిస్తున్న నిధులలో కోత విధించాలని సెనెట్‌ ప్రతిపాదించింది. ఇక అల్పాదాయ వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తున్న ఆరోగ్య రక్షణ కార్యక్రమానికి ప్రభుత్వ ఆర్థిక మద్దతును 930 బిలియన్‌ డాలర్ల మేర తగ్గించాలని తాజా బిల్లు ప్రతిపాదించింది. ఈ ఏడాది మార్చి నాటికి మెడిక్‌ఎయిడ్‌ ఆరోగ్య బీమాలో అల్పాదాయ వర్గాలకు చెందిన 71 మిలియన్ల అమెరికన్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. బిల్లుకు ఆమోదం లభిస్తే ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రస్తుతం అందుతున్న పన్ను ప్రయోజనాలను వదలుకోవాల్సిందే.

ఈ ఏడాది చివరి నాటికి పన్ను ప్రయోజనాలను పూర్తిగా తొలగించాలని సెనెట్‌ బిల్లు ప్రతిపాదించింది. ఈ బిల్లుతో ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని టెస్లా కార్ల తయారీ కంపెనీ కూడా నష్టపోతుంది. ఎందుకంటే ఈ కంపెనీ ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. ఈ బిల్లును కొందరు కన్సర్వేటివ్‌లు వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే దేశం మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సెనెట్‌లో ప్రతిపాదించిన తాజా బిల్లు ప్రకారం 2025-2034 మధ్యకాలంలో రుణ భారం 3.3 ట్రిలియన్‌ డాలర్లు పెరుగుతుంది. ప్రస్తుతం అమెరికా అప్పులు 36 ట్రిలియన్‌ డాలర్లు. అమెరికా స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఇది 122 శాతంగా ఉంది.


వీరికే ప్రయోజనకరం
ట్రంప్‌ ప్రతిపాదించిన బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే అధిక ఆదాయం పొందుతున్న కుటుంబాలకే ఎక్కువ లబ్ది చేకూరుతుంది. ట్రంప్‌ తన మొదటి పదవీకాలంలో ప్రవేశపెట్టిన పన్ను కోతలను ఈ బిల్లు పొడిగిస్తోంది. ఇది అమెరికా ప్రజలకు లాభదాయకమని ట్రంప్‌ చెబుతున్నప్పటికీ కొందరికి మాత్రమే ప్రయోజనకరమని చెప్పవచ్చు. వార్షిక ఆదాయం 4,60,000 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న కుటుంబాలకు మొత్తం పన్ను కోతలలో మూడో వంతు చేరుతుంది. వార్షిక ఆదాయం 2,17,000 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న కుటుంబాలకు పన్ను కోతలలో 57 శాతం అందుతుంది.

సెనెట్‌ ముందున్న బిల్లు ప్రకారం… 2026లో ప్రతి కుటుంబానికీ సగటున 2,600 డాలర్ల చొప్పున పన్ను తగ్గుతుంది. అధిక ఆదాయం పొందుతున్న కుటుంబాలకే మరింతగా పన్ను ప్రయోజనాలు చేకూరుతాయని ట్యాక్స్‌ పాలసీ సెంటర్‌ విశ్లేషించింది. బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపితే అధిక ఆదాయం కలిగిన కుటుంబాలతో పాటు పిల్లలు ఉన్న కుటుంబాలు, సంప్రదాయ కార్ల తయారీదారులు, బహుమతులు (టిప్స్‌) పొందే కార్మికులు ప్రయోజనం పొందుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -