ఏపీలోని కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన ప్రయివేటు ట్రావెల్ బస్సు ప్రమాదంలో ఇరవైమంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదానికి బైకర్ కారణమని చెబుతున్నా, నిబంధనలు పాటించని ప్రయివేటు బస్సుల యాజమాన్యాలు కూడా కారణమే. ప్రభుత్వాల అసమర్థత, నిర్లక్ష్యం కూడా ఇందులో భాగమే. విమానాలు, స్కూల్ బస్సులు ప్రమాదానికి గురైనప్పుడు, ట్రావెల్స్ బస్సులు అగ్నికీలల్లో ఆహుతి అయినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే సంబంధించిన శాఖలు ఆగమేఘాలపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ, కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారి పోయింది.. ఇది ఏమాత్రం శ్రేయోష్కరం కాదని గ్రహించాలి.ముఖ్యంగా ప్రయివేటు ట్రావెల్స్‌పై నిఘా, తనిఖీలు నామమాత్రంగా జరగడం వల్లనే పలువురు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.. అసలు ట్రావెల్స్ బస్సులు అన్ని, సంబంధించిన శాఖ ఆడిటింగ్ చేస్తుందా!? ఎన్ని బస్సులు మంచి కండిషన్‌లో ఉన్నాయి.ఎన్ని బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, కిట్, హేమర్, అగ్నిమాపక పరికరాలు ఉన్నాయి? నిపుణులైన డ్రైవర్ తదితర రక్షణ పరికరాలు ఉన్నాయో తనిఖీ జరిగిందా?లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదు చేశారు, చర్యలేం తీసుకున్నారు, శ్వేత పత్రం విడుదల చేయాలి.
నిబంధనలు పాటించని బస్సులు వివరాలు, ఏమి చర్యలు తీసుకున్నార , ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు, స్టేటస్ వంటి అంశాలు ప్రతీ సంవత్సరం ప్రజలకు తెలిసేవిధంగా ప్రభుత్వం, సంబంధించిన శాఖలు ”డాక్యుమెంట్” రిలీజు చేయాలి.. ”పబ్లిక్ డొమైన్”లో పెడితే, ప్రయాణికులు అవగాహన చేసుకొని, మంచి ప్రమాణాలు పాటిస్తున్న బస్సులు ఎక్కి తమ గమ్యాలను సురిక్షితంగా చేరుకోవడానికి వీలు కలుగుతుంది.. ముఖ్యంగా పండుగ సమయాల్లో, పండుగ రద్దీ సమయాల్లో రకరకాల బస్సులు ఆ మాటకు వస్తే కండిషన్ లేని బస్సులను కూడా నామమాత్రంగా మరమ్మతులు చేసి రంగులు పూసి, స్లీపర్, సెమీ స్లీపర్, లగ్జరీ వంటి పేర్లతో నడుపుతూ, అధికారుల కండ్లు గప్పి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నడుపుతూ ప్రయివేటు యాజమాన్యాలు అధిక మొత్తంలో ఆదాయం సంపాదించడం జరుగుతుంది… దీనికి ప్రధాన కారణం ఎక్కువ శాతం ఈ ప్రయివేటు ట్రావెల్స్ రాజకీయ నాయకులకు, వారి బంధువులకు, ధనికులు భూస్వాములు సంపన్నులు కార్పోరేట్ వర్గాలకు చెందినవారివే. దీంతో నిబంధనలు బేఖాతరు చేస్తూ ఏండ్లతరబడి నడుపుతున్నవి.అదే సమయంలో ప్రజలు, ప్రయాణికులు తమ తమ అవసరార్థం డబ్బులు చెల్లించి ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి. సీజన్ బట్టి డబుల్ చార్జీలు వసూలు చేయడం ద్వారా జనం జేబులకు చిల్లే పడుతుంది. ప్రజల్లో కూడా అవగాహన పెరగాలి.
ప్రభుత్వాలు కూడా ప్రజల అవసరతలు తీర్చాలి కదా!? విద్యా, వైద్యం, రవాణా సౌకర్యాలు వంటివి ప్రజలకు నాణ్యమైన రీతిలో అందించాలి. దురదృష్టవశాత్తూ మన దేశంలో ఇటువంటి పబ్లిక్ ఫెసిలిటీస్ అన్నియు దాదాపు డెబ్బయి శాతం ప్రయివేటీకరించబడ్డాయి. ఇక దీంతో ప్రయివేటు పాఠశాలలు, ఆసుపత్రులు, ట్రావెల్స్ పేద మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. దీనికి తోడు కనీసం నియంత్రించే వ్యవస్థ, తనిఖీ అధికారులు అవసరాలకు అనుగుణంగా లేకపోవడం కూడా రవాణారంగంపై ప్రభావం చూపుతున్నది. ఏ శాఖలో చూసిన ఖాళీ పోస్టులే. సిబ్బంది కొరత, సౌకర్యాలులేమి, ఉన్న సిబ్బందిపై ఒత్తిడి. ఇక ఏ రవాణా శాఖ కార్యాలయంలో చూసినా ప్రయివేటు సిబ్బందిదే హవా. ఆయా కార్యాలయాలకు వద్దకు వెళ్లితే, ఆ చుట్టుపక్కల ఉండే ప్రయివేటు వ్యక్తుల హడావుడి అంతా ఇంతా కాదు. దీనికి ప్రధాన కారణం, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ సిబ్బంది, కార్యాలయాలు లేకపోవడమే.ఇకనైనా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అవసరత మేరకు రవాణా కార్యాలయాలు, సిబ్బంది, తనిఖీ అధికారులు, ఫైర్ సేఫ్టీ అథారిటీ, నిఘా సంస్థలు, పోలీసు పెట్రోలింగ్ వాహనాలు సమకూర్చాలి. కనీసం ప్రజల కనీస సౌకర్యాలు అవసరతలు తీర్చే వ్యవస్థలపై దృష్టి సారించాలి.ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ నియమనిబంధనలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ప్రమాదాలు బారిన పడకుండా చూసుకోవాలి.ముఖ్యంగా ప్రభుత్వాలు నియమనిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలి. మరణించిన సమయాల్లో క్షతగాత్రులకు నష్టపరిహారం చెల్లించడంతో చేతులు దులుపుకోరాదు. పోయిన ప్రాణాలను తిరిగి తేలేం గనుక, ప్రాణం విలువైనదనే భావనతో అందరి శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వాలు, యంత్రాంగం పనిచేయాలి.
- ఐ.పి.రావు



