– అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రచారం నిజమా..? అబద్ధమా..?
– వాస్తవాలు వక్రీకరిస్తున్న మోడీ అనుకూల మీడియా
– స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ :సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌పై చేసిన దాడిని బీజేపీ తన రాజకీయ లబ్ది కోసం వాడుకుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. యుద్ధాన్ని తానే ఆపినట్టు చెబుతున్న అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రచారం వెనుక నిజముందా..? అబద్ధం ఉందా…? మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ(ఎం) కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో జరిగిన ప్రతి సంఘటననూ బీజేపీ రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్న తీరును తమ్మినేని ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్‌ను ఏ దేశమూ ప్రోత్సహించలేదని, ఉగ్రవాదాన్ని మాత్రమే ఖండించిందని అన్నారు. పహల్గాం దాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో ఎంతమందిని చంపారో కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతోందన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం వద్ద సరైన సమాధానం లేదన్నారు. యుద్ధంలో ఎన్ని విమానాలు కూలాయో చెప్పాలన్నారు. ప్రధాని మోడీ తన అనుకూల మీడియాతో ప్రపంచానికి అబద్ధాలు చెప్పిస్తున్న తీరును ఖండించారు. అంతర్జాతీయ చానళ్లు భారత ప్రభుత్వ మీడియాను అవహేళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ట్రంప్ మోడీకి మిత్రుడైనప్పటికీ 25 శాతం టారిఫ్ వేయడంలో వెనుకంజ వేయలేదన్నారు. ప్రస్తుతం బ్రిటన్‌తో జీరో టారిఫ్‌తో మోడీ చేసుకున్న ఒప్పందం భవిష్యత్‌లో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, వస్తువులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్‌లో ఓటర్ల తొలగింపుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పారు. ఈసీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరును సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిం దేనని అన్నారు. స్థానిక ఎన్నికలో ప్రస్తుతా నికైతే సీపీఐ(ఎం) ఒంటరిగా వెళ్లే ఆలోచనలో ఉందని, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఏపీలో కలిపిన 5 గ్రామాలను వెనక్కి రప్పించాలి: పోతినేని సుదర్శన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్‌రావు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, ఏపీలో కలిపిన 5 గ్రామాలను తిరిగి తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ సూచించారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలంకు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. అయోధ్య రామాలయ అభివృద్ధే కాదని, భద్రాద్రి దేవాలయాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని నిజమైన అర్హులకి కేటాయించాలని డిమాండ్ చేశారు. సీతారామ ప్రాజెక్ట్‌ను పాత డిజైన్ ప్రకారమే నిర్మించి భద్రాద్రి జిల్లా ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే.రమేష్, సీనియర్ నాయకులు ఎలమంచిలి రవికుమార్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎంబి.నర్సారెడ్డి, ఎం.జ్యోతి, అన్నవరపు సత్యనారాయణ, కారం పుల్లయ్య ఉన్నారు.
రాజకీయ లబ్దికి ఆపరేషన్ సిందూర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES