Sunday, November 16, 2025
E-PAPER
Homeజాతీయంభారత బొమ్మలకూ ఆర్డర్లు తగ్గాయ్

భారత బొమ్మలకూ ఆర్డర్లు తగ్గాయ్

- Advertisement -

అమెరికా సుంకాల దెబ్బ
ఎగుమతిదారులపై తీవ్ర ప్రభావం


న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై విధించిన అధిక సుంకాలు దేశ బొమ్మల తయారీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సుంకాలు పెరగడం వల్ల అమెరికా నుంచి వచ్చే ఆర్డర్‌లలో 50 శాతం వరకు తగ్గుదల నమోదయ్యింది. ట్రంప్‌ విధించిన 50 శాతం సుంకాలతో అమెరికాకు ఎగుమతి అయ్యే బొమ్మల పరిశ్రమతో పాటు, వస్త్రాలు, తోలు, రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు వంటి ఇతర శ్రమాధారిత రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోన్న విషయం తెలిసిందే. భారత్‌పై అధిక టారిఫ్‌లతో మన పరిశ్రమ బొమ్మల ధరలు యూఎస్‌లో ప్రియమయ్యాయి. చౌకగా లభించే చైనా, వియత్నాం వంటి ఇతర పోటీదారుల వైపు దిగుమతిదారులు మళ్లుతున్నారు. దీని ఫలితంగా భారత్‌కు ఆర్డర్లు భారీగా తగ్గాయి. అధిక సుంకాల కారణంగా, అమెరికా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులు తమ పోటీతత్వాన్ని కోల్పోయాయి. ఎగుమతిదారులు పోటీలో నిలబడటానికి ధరలను తగ్గించడం లేదా డిజైన్లను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోవాలని.. కానీ ఇది వ్యయంతో కూడుకున్నదని ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఎగుమతి మార్కెట్లను వైవిధ్యపరచడం, దేశీయ తయారీని ప్రోత్సహించడం వంటి చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి.ఒకప్పుడు భారత బొమ్మలకు అమెరికాలో మంచి డిమాండ్‌ ఉండేది. చౌకగా లభించడంతో ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీ పడగలిగేవి. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారిందని టారు అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా గవర్నింగ్‌ బాడీ సభ్యుడు అమితాబ్‌ ఖర్బంద పేర్కొన్నారు. క్రిస్మస్‌ పండగ కోసం సాధారణంగా అక్టోబర్‌-నవంబర్‌ మధ్య వచ్చే ఆర్డర్లు ఈ ఏడాది సగం మేర తగ్గాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు కాలంలో 64.5 మిలియన్‌ డాలర్ల బొమ్మల ఎగుమతులు జరిగాయి. గతేడాది మొత్తం ఎగుమతుల్లో 78 శాతం చేరుకున్నప్పటికీ.. ఇకపై గడ్డుకాలమేనని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ట్రంప్‌ అధిక సుంకాలకు ముందు భారీగా ఎగుమతులు జరగడంతో కొంత ఉపశమనం లభించిందని పేర్కొన్నాయి. ఆగస్టు 1 నాటికి భారత్‌పై 25 శాతంగా ఉన్న సుంకాలను.. ఆగస్టు 27 నాటికి టారిఫ్‌లను 50 శాతానికి పెంచుతూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -