అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు : భారత్
ఢాకా : బంగ్లాదేశ్ యువ నేత, ఇంక్విలాబ్ మంచో సంస్థ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ అంత్యక్రియలు శనివారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఢాకాలో ఎలాంటి ఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆయన మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళుతున్న మార్గంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అంత్యక్రియలకు ముందుగా పార్లమెంటు భవనంలో హాదీ మృతదేహాన్ని ఉంచి ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమన్‌లతో పాటు సలహా మండలి సభ్యులు హాజరయ్యారు. ప్రార్థనలకు ముందు యూనస్ కొద్దిసేపు ప్రసంగించారు. బీఎన్‌పీ, ఎన్‌సీపీల తరపున కూడా కొందరు నేతలు హాజరయ్యారు. ప్రభుత్వం చేసిన ప్రకటనకు అనుగుణంగా ప్రజల సందర్శనార్ధం భౌతిక కాయాన్ని ఉంచలేదని, కొద్దిమందిని మాత్రమే చూసేందుకు అనుమతించామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రార్ధనా సమావేశాల్లో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు.
భారత హైకమిషన్ సూచన
ప్రస్తుతం దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అక్కడి భారతీయులకు భారత హై కమిషన్ సూచించింది. ప్రస్తుత పరిస్థితులపై భారత్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌లు ఫోన్లో మాట్లాడుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.



