మనం 78వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రజలంతా ఆనందించాల్సిన సందర్భం. అయితే స్వాతంత్య్ర దినోత్సవం అంటే పండుగలా జరుపుకోవటం, మిఠాయిలు పంచుకోవటం, ఆనాటి గొప్ప ఘటనలు, త్యాగాలు తలచుకోవటం, పొగుడుకోవటం మాత్రమే సరిపోదు. ఆ స్వాతంత్య్రోద్యమ స్పూర్తి ఏమిటి? నాటి ఆకాంక్షలేమిటి? నేడు వాటి సాధనకు ముందుకు నడుస్తున్నామా? లేక తిరోగమనం వైపు సాగుతూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నామా? అనేది ఒకసారి సమీక్షించుకోవటం సబబుగా ఉంటుంది.
ఇటీవల బీజేపీ నేతలు కొందరు రాజ్యాంగం నుండి సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలను తొలగించాలని చర్చ లేవనెత్తారు. దానిపై వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు, ప్రజల నుండి వచ్చిన వ్యతిరేకతను గమనించి కేంద్ర న్యాయశాఖ మంత్రి ‘అది మా ప్రభుత్వ వైఖరికాదు. బయట జరిగే చర్చలకు ప్రభుత్వానికి సంబంధం లేదు’ అని ప్రకటించి విడగొటు ్టకోవటానికి ప్రయత్నించారు. బీజేపీకి ఒక అవకాశవాద సౌకర్యం ఉంది. ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు అనేకం రకరకాల రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంటాయి. మరోవైపు ప్రజల నాడిని గమనించి బీజేపీ మాత్రం తన వైఖరులను మార్చి,మార్చి ప్రకటిస్తూ నాటకమాడుతుంటుంది. ఈ పదాలు రాజ్యాంగం నుండి తొలగించాలనే వారు చేస్తున్న ఒక చిల్లర వాదన ఏమిటంటే ఆ పదాలు రాజ్యాంగం ఒరిజినల్‌గా ప్రకటించినపుడు లేవు అనేది. పదాలు ఎప్పుడు చేరాయనేది కాదు, మన స్వాతంత్య్రోద్యమ సూర్తి ఏమిటి? అ స్పూర్తి సారాంశంగా రూపొందిన రాజ్యాంగం యొక్క ఆధుని కతను ఎలా అర్థం చేసుకోవాలి? స్థలాభావం రీత్యా కొన్ని అంశాలను చర్చిద్దాం. ముందుగా 1. స్వాతంత్య్రం 2.లౌకికత్వం 3. సోషలిస్టు భావన గురించి తెలుసుకోవాలి.
స్వాతంత్య్రం డిమాండ్ నేపథ్యం
మనం రెండువందల సంవత్సరాలుగా బ్రిటిష్ వలసపాలనలో ఉన్నాం.పరాయి పాలన నుండి విముక్తి కోరుకోవటం స్వాతంత్య్రం. రాజకీయంగానే కాక, ఆర్ధిక దోపిడీ నుండి కూడా విముక్తి జరగాలి. ఆనాటి పోరాటంలో కాంగ్రెస్‌తో సహా వివిధ రాజకీయ పార్టీలు రాజకీయ స్వేచ్చకోసం పోట్లాడాయి తప్ప ఆర్థిక దోపిడీ నుండి విముక్తి కోరుకోలేదు. ఇంకా చెప్పాలంటే రాజకీయ స్వేచ్ఛను కూడా చాలా కాలంవరకూ కోరుకోలేదు. మీరే పరిపాలించుకోండి, కాకపోతే మాకూ దోపిడీలో వాటా ఉండాలి, అనే భారతీయ పెట్టుబడిదార్ల వేడుకోళ్లుగానే విజ్ఞప్తులుండేవి. ‘మీ పాలన మాకొద్దు, మాకు స్వాతంత్య్రం కావాలి’ అని ఎవరు డిమాండు పెట్టారు? ఆ డిమాండు మొదటగా పెట్టింది కమ్యూనిస్టులు. అప్పుడు కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్‌తో కలిసి పనిజేశారు. 1921లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో మౌలానా హజ్రత్ మొహానీ, స్వామీ కుమారనంద అనే ఇద్దరు కమ్యూనిస్టులు ‘సంపూర్ణ స్వాతంత్య్రం డిమాండ్ చేయాలని’ తీర్మానం పెట్టారు. మహాత్మాగాంధీ దానికి ఒప్పు కోకపోవటం వల్ల అది వీగిపోయింది. 1927లో మాస్కోలో జరిగిన కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ 6వ మహాసభలో భారత ప్రతినిధులు (ఎం.ఎన్.రారు తదితరులు) చొరవతో ‘భారత స్వాతంత్య్రం అంటే పూర్తి స్థాయి స్వరాజ్యం తప్ప డొమి నియన్ స్టేటస్ కాదు’ అని స్పష్టంగా తీర్మానించారు. దీని ప్రభావం మన ఉద్యమంపై తీవ్రంగా పడింది. ఈ ఆలోచనలను దేశంలోని కమ్యూనిస్టు విప్లవకారులేగాక, కాంగ్రెస్‌లోని అభ్యుదయ వాదులు జవహర్‌లాల్ నెహ్రూ, సుభాస్ చంద్రబోస్, ఇతర వామపక్ష వాదులు బలపర్చారు. 1928లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ మహాసభలోనూ వీరంతా ఆ తీర్మానాన్ని ముందుకు తెచ్చారు. కానీ గాంధీ, మోతీలాల్ నెహ్రూ వ్యతిరేకతతో అది వీగిపోయింది. చివరకు తర్వాత ఏడాది 1929లో జరిగిన లాహోర్ కాంగ్రెస్ మహాసభలో మాత్రమే ‘సంపూర్ణ స్వాతంత్య్రం’ డిమాండ్‌తో తీర్మానాన్ని కాంగ్రెస్ ఆమోదించింది. ఆ తర్వాత స్వాతంత్రోద్యమ దశ, దిశ మారింది. ఉధృత పోరాటాలతో బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమికొట్టగలిగాం. ఆ పోరాటం మొత్తానికి లౌకికవాదం, ఆర్థిక దోపిడీనుండి విముక్తి ఆకాంక్షలు పునాది రాళ్లుగా ఉన్నాయి. ఆ ఆకాంక్షలు రాజ్యాంగ సారాంశంలోనే ఉన్నాయి. ఆ సారాంశాన్ని వ్యక్తం చేయటానికి పదాలు కూడా చేర్చారు. వాటిని విస్మరించటమంటే మన స్వాతంత్రోద్యమాన్ని మనం అవమానించుకున్నట్టే అవుతుంది.
సెక్యులరిజం అంటే ?
దేశంలో మతాలు ఉండకూడదనో లేక అన్ని మతాలను ప్రభుత్వం సమానస్థాయిలో చూడాలనో చెప్పటం సెక్యులరిజం కాదు. మతాలకతీతంగా రాజ్యం(ప్రభుత్వం) ఉండటం, రాజకీయాలు, విద్య ఉండటం సెక్యులరిజం. భారత స్వాతంత్య్ర సాధనలో అది కీలకంగా పనిజేసింది. ముందే చెప్పినట్లుగా సంపూర్థ స్వాతంత్య్ర తీర్మానం మొదట ప్రతిపాదించిన ఇద్దరు కమ్యూనిస్టులు (ఒక స్వామి, ఒక మౌలానా) చెరొక మతానికి చెందినవారు. అలా అన్ని మతాలు, జాతులు కలిసి చేసిన ఐక్య పోరాటమే స్వాతంత్య్రోద్యమ పోరాటం. ఎడ్వర్డ్ లౌడ్ అనే బ్రిటిష్ చరిత్ర కారుడు 1857లో జరిగిన మొదటి స్వాంత్య్రపోరాటం గురించి రాస్తూ ఇలా అన్నాడు.. ”ఒక వేళ శిశుహత్యలు చేసే రాజపుత్రులు, మత దురభిమానులైన బ్రాహ్మణులు, పందులను తినేవాళ్లు, పందులను అసహ్యించుకునేవాళ్లు, ఆవులను తినేవాళ్లు, ఆవులను పూజించేవాళ్లు వీళ్లంతా ఒక్కటైతే మాత్రం ఇండియాలో బ్రిటిష్ పాలనకు భవిష్యత్తు ఉండదు” అని పేర్కొన్నాడు. ఇందులో భారతీయులను చులకన చేసే పదాలుండ వచ్చేమోగానీ, అనేక మతాలు, జాతులు, ఆహార అలవాట్లున్న, సంప్రదాయాలున్న భారతీయులు ఆ వైవిధ్యాలనుండి ఐక్యత సాధిస్తే బ్రిటిష్ పాలకు జరిగే ప్రమాదం గురించి సరిగ్గా ఊహించాడు. నిజంగా జరిగింది అదే. ఆ ఐక్యతే మనకు స్వాతంత్య్రాన్ని సాధించింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత 47దాకా ఐదేండ్లపాటు బ్రిటిష్‌వాళ్ల విభజించి పాలించే కుట్రబుద్ది వల్ల ఇండియా, పాకిస్థాన్‌గా విడిపోవాల్సి స్థితి, దాని వల్ల ఘోరమైన మత మారణహోమాలు జరిగాయి. అనేక భాషలు, విభిన్న సంస్కృతులున్న వివిధ ప్రాంతాల ప్రజలను విడగొట్టి పాలించే ‘ప్రెసిడెన్సీ’ల బదులు భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలనే ఉద్యమాలు దేశవ్యాప్తంగా సాగాయి. కమ్యూనిస్టులు నాయకత్వం వహించిన విశాలాంధ్ర, ఐక్య కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ వగైరా ఉద్యమాలన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ నేపథ్యంలోనే మన రాజ్యాంగ రచయితలు లౌకికవాదాన్ని, ఫెడరల్ వ్యవస్థను ప్రతిపాదించారు. దానినుండే ‘భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు భావన’ కూడా ముందుకు వచ్చింది. రాజ్యాంగంలో రాతల ద్వారా మన భావాలు ఏర్పడలేదు. మన వైవిధ్య భారతాన్ని ఐక్యంగా ముందుకు నడపాలంటే ఏ విధానాలు అవసరం అనే అనుభవాలనుండి ఆ రాజ్యాంగ రాతలు వచ్చాయి. దానివెనక ఉద్యమాలు, త్యాగాలున్నాయి. కానీ ఇప్పుడేం జరుగుతోంది. మతోన్మాదంతో, కేంద్రీకృత అధికారాలతో ఒకే దేశం, ఒకే భాష, ఒకే ఎన్నిక, ఒకే చట్టం వగైరా నినాదాలతో దేశ ఐక్యతకు భంగం కలిగించే హానికర చర్యలు ఆరెస్సెస్, బీజేపీలు చేస్తున్నాయి. కాశ్మీర్‌లో, మణిపూర్‌లో ఇంకా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, పౌరసత్వ చట్టాల సవరణ ప్రయత్నాలు, నేడు బీహార్ నుండి మొదలైన ఓటర్లను తొలగించే పద్ధతి ఈ సూర్తికి పూర్తి విరుద్ధంగా సాగుతున్నవి కాదా?
సోషలిజం అంటే?
సోషలిజం అంటే సోవియట్ సోషలిజమా? చైనా సోషలిజమా? మరొకటా అనే రూపాల గురించి, పరిపాలనా విధానాల గురించి ఇక్కడ చర్చ అవసరం లేదు. కానీ మనం స్వాతంత్య్రం కోరుకున్నది దేనికోసం? ఒక తెల్లవాడు పోయి మన నల్లవాడు పాలిస్తే స్వాతంత్య్రం వచ్చినట్టా? ఆనాడు ప్రధానంగా కోరుకున్నది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన వనరులను, సంపదలనను దోచుకుంటున్నారు. ఆ దోపిడీ నుండి విముక్తి కావాలని మన సంపదలను మనమే అనుభవించాలని కోరుకున్నాం. అంటే అందరికీ తిండి, ఇల్లు, విద్య, వైద్యం, కనీస సౌకర్యాలు అందుబాటులోకి రావాలని, రైతులు, కూలీలు, వృత్తిదారులు, కార్మికులు, మహిళలు, దళితులు, గిరిజన తదితర సమస్త వర్గాలు, తరగతుల ప్రజలు సంతోషంగా జీవించే పరిస్థితులు రావాలని కోరుకున్నాం. ఈ సమాన అవకాశాల సాధనే సోషలిజానికి సాధారణ అర్థం. నేడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ సాధారణ అర్థంలోనే తాము అధికారంలోకి వస్తే ఈ సౌకర్యాలన్నీ ప్రజలకందిస్తామని చెబుతున్నారు. స్వాతంత్రోద్యమంలో ఈ అన్ని తరగతుల ప్రజలు ఈ ఆకాంక్షలతో ఉవ్వెత్తున పాల్గొన్నారు కాబట్టే మనం విజయం సాధించగలిగాం. ఈ శక్తులను స్వాతంత్రోద్యమంలో సమీకరించటంలో కమ్యూనిస్టులు ముఖ్యపాత్ర వహించారు. బ్రిటిష్ వలసదోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, రైతులు విస్తృత పోరాటాలు నిర్వహించారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) బలమైన కార్మిక పోరాటాలు, సమ్మెలు నిర్వహించింది, బెంగాల్‌లో తెబాగా ఉద్యమం, కేరళలో పున్నప్రవాయలార్ ఉద్యమం వివిధ సామంత వ్యతిరేక రైతు పోరాటాలు కమ్యూనిస్టుల నాయకత్వంలో విస్తృతంగా జరిగాయి. మఖ్యంగా తెలంగాణాలో సాగిన రైతాంగ సాయుధ పోరాటం (1946-51) ప్రపంచ ఖ్యాతిగాంచిన రైతాంగ తిరుగుబాటుగా చరిత్రలో నిలిచింది. అంతేగాక సాంస్కృతిక చైతన్యం కల్పించటంలో కమ్యూనిస్టుల కృషి ఉద్యమంలో గొప్పపాత్ర వహించింది. పత్రికలు, కరపత్రాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వలసవాదం, వర్గపోరాటం, సామ్యవాదం గురించిన అవగాహనను ప్రజల్లో పెంచింది. మహాత్మాగాంధీ కూడా ఈ శ్రామికశక్తులను స్వతంత్రపోరాటంలో సమీకిరించటానికున్న ప్రాధాన్యతను గుర్తించి అందుకనుగుణమైన నినాదాలు, పిలుపులు వివిధ సందర్భాల్లో ఇచ్చారు. ఆనాటి సోవియట్ అక్టోబర్ విప్లవం ప్రభావంతోనే ప్రపంచ వ్యాప్తంగా వలసల విముక్తి జరిగింది. సోషలిస్టు ఉద్యమమే నరహంతక హిట్లర్‌ను మట్టిగరిపించింది. ఆ స్ఫూర్తితోనే ప్రపంచ వ్యాప్తంగా సంక్షేమ రాజ్యాలు ఏర్పాడ్డాయి., కానీ నేడు జరుగుతున్నదేమిటి? నయా ఉదారవాద విధానాలతో సంక్షేమాన్ని అటకెక్కించారు. అస మానతలు అడ్డగోలుగా పెరిగాయి. పెరిగిన సంపదంతా కొద్దిమంది కుబేరుల చేతుల్లో పోగుబడుతోంది.
అందువల్ల ప్రజలందరి త్యాగాలతో మనం సాధించుకున్న స్వాతంత్య్రం పూర్తి అర్థంలో ప్రజల అనుభవంలోకి రాకపోగా ఉన్న కొద్దిపాటి స్వేచ్ఛలు కూడా బీజేపీ మతోన్మాద, నిరంకుశ పాలనలో హరించుకుపోతున్నాయి. రాజ్యాంగానికి రక్షణ లేకు ండా పోతున్నది. అందువల్ల మన స్వాతంత్య్ర వెలుగులను రాహు,కేతువులుగా కబళిస్తున్న మతోన్మాదం, నయా ఉదారవాదం అనే జంట సర్పాలను సంహరించటం, రాజ్యాంగ రక్షణకు ఉద్యమించటం ఈ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తులందరి కర్తవ్యం కావాలి.
తమ్మినేని వీరభద్రం
మన స్వాతంత్య్రం – నాటి ఆకాంక్షలు, నేటి దుస్థితి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES