జాతీయ అవార్డులకు ఎంపికైన వారిని మన తెలుగు చిత్ర పరిశ్రమ సత్కరించక పోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, మన పరిశ్రమలో ఎవరి కుంపటి వారిదేనని నిర్మాత అల్లు అరవింద్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గురువారం సైమా (సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) బృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ’71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఈసారి మన తెలుగువారికి ఏడు అవార్డులు వచ్చాయి. ‘సైమా’ స్పందించి, జాతీయ అవార్డు విజేతలను సత్కరించడం అభినందనీయం. కానీ ఇన్ని జాతీయ అవార్డులు వచ్చినా మన తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం స్పందించలేదు. ఓ పండగలా జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న విజేతలను సత్కరించాలి’ అని అల్లుఅరవింద్ అన్నారు.
71వ జాతీయ చలన చిత్రపురస్కారాల్లో ఈ ఏడాది జాతీయ ప్రాంతీయ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన ‘భగవంత్‌కేసరి’, ‘బలగం’లోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు గీత రచయిత కాసర్ల శ్యామ్, ‘బేబీ’ చిత్రానికి సంబంధించి బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా దర్శకుడు సాయి రాజేష్‌కు, ‘ప్రేమిస్తున్నా’ పాటకు నేపథ్యగాయకుడిగా పివిఎన్‌ఎస్ రోహిత్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. అలాగే ‘హనుమాన్’ చిత్రానికి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోను, బెస్ట్ స్టంట్‌కొరియోగ్రఫీ విభాగాల్లో అవార్డులు లభించగా, ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సుకృతి వేణి (గాంధీతాత చెట్టు) ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. ఏకంగా ఏడు అవార్డులతో 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా విజయకేతనం ఎగురవేసింది.