అది సైలెంట్ సినిమాల కాలం.
రంగు రంగుల గళ్ళ లుంగి, కాలర్ లేని జుబ్బా వేసుకుని ఉన్న ఒకతను సిద్ది అంబర్ బజారులోని ఆటస్థలం వద్దకు డబ్బా వంటి ఒక తోపుడు బండిని తీసుకురాగానే పది, పదిహేనేళ్ళ వయసున్న పిల్లలు ఉరుకుతూ వచ్చి చుట్టూ మూగారు. తలా అర్ధాణా (3పైసలు) వసూలు చేసిన అతను పిల్లలను బండికిరువైపులా ఉన్న కిటికీల్లోంచి మూడు అడుగులు వెడల్పున్న తెరపై సినిమాను తలపించే కదిలే బొమ్మలను చూపిస్తున్నాడు. 10 నిముషాల్లో ఆ ప్రదర్శన ముగిసింది. వారి తరువాత మరో ఆరు మంది పిల్లలు సినిమా ప్రేక్షకులైనారు.
సినీ చరిత్రలోనే అరుదైన సంఘటనగా పేర్కొనదగిన ఈ పుష్ కార్ట్ సినిమా లేదా సినిమా బండి ప్రదర్శన, భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ఈ విలక్షణ ప్రక్రియకు అద్యుడు, చివరికంటా నిలిచినవాడు మొహమూద్ మీయా మన హైదరాబాదీ.
హైదరాబాదులో సైలెంట్ సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు దాదాపుగా ఎవరికీ తెలియని సంగతి ఒకటుంది. అదే మహమూద్ మియా సినిమా బండి. ఇలాంటిది దేశంలో మరెక్కడా ఉన్నట్టు కనిపించదు.
ఈ మొహమూద్ మియా సినిమా బండికి 1910 ప్రాంతంలో బీజాలు పడినవి. మహమూద్ మియా 1904 ప్రాంతంలో జన్మించాడు. అతని తండ్రి సికిందరాబాదులోని సైనిక పటాలంలో గుర్రపు బండ్లను నడిపేవాడు. 1910లో లెఫ్టినెంట్ విలియమ్స్ అనే బ్రిటీష్ అధికారి కలకత్తా నుండి హైదరాబాదుకు బదిలీపై వచ్చాడు. అతను సికిందరాబాదులో ఓ పెద్ద బంగ్లాలో వుండేవాడు. మెహమూద్ మియా కుటుంబం హైదరాబాదు పాత నగరంలో ఉండేది. విలియమ్స్ మొహమూద్ మియా తండ్రిని బంగ్లా ఆవరణలో ఉన్న ఔట్‌హౌస్‌లో 24 గంటలు అందుబాటులో ఉండే ఒప్పందంతో డ్రైవరుగా కుదుర్చుకున్నాడు. వారి కుటుంబం అంతా సికిందరాబాదుకు మారింది. మోహమూద్ మియా తల్లి వారి ఇంట్లో పనికి కుదిరిపోగా చిన్నవాడైన మోహమూద్ తల్లి పనుల్లో సాయం చేస్తుండేవాడు.
లెఫ్టినెంట్ విలియమ్స్ భార్య సామాజిక సేవాదక్పథం కలిగి ఉండేది. పేద పిల్లల కోసం ఒక బడిని నడిపేది. మోహమూద్‌ను కూడా బడిలో చేర్చి చదువు నేర్పించాలని చాలా ప్రయత్నం చేసింది ఆమె. కానీ అతడు అందుకు ఆసక్తి చూపలేదు. దాంతో ఆమె తన వెంట తిప్పుకుంటూ మెల్లిమెల్లిగా తోట పని నేర్పింది.
ఆ రోజులలో హైదరాబాదులో కరెంటు ఉండేది కాదు. ఒకటి రెండు బంగ్లాల్లో మాత్రం జనరేటర్ల సాయంతో లైట్లు వెలిగించుకుడేవారు. మిగతా అంతా హరికెన్ లాంతర్లు వాడేవారు. ఇక లెఫ్టినెంట్ విలియమ్స్ ఇంట్లోని 8 ఎం.ఎం. ప్రొజెక్టర్‌తో తన ఇద్దరు పిల్లలకు చిన్న చిన్న సినిమాలు చూపేవాడు. అలా వారికి సినిమాలు చూపిస్తున్నప్పుడు మహమూద్ మియా జనరేటరు తిప్పేవాడు. తనేమో ఫిలిం రీలు నింపిన ఎం.ఎం. ప్రొజెక్టరును నడిపేవాడు. హుస్సేన్ సాగర్ తీరాన మింట్ కంపౌండ్ దగ్గరలో విద్యుత్ కేంద్రం ఏర్పడింది. బాగా ధనవంతులు తమ ఇళ్లకు కరెంట్ సరఫరా పెట్టించుకున్నారు. హైదరాబాదులో కరెంటు వెలుగులు తొలిసారిగా చూడగలిగినందుకు తనకు తాను అదష్టవంతుడిని అనుకునేవాడు మోహమూద్ మియా. విలియమ్స్ బంగ్లాకు కూడా కరెంటు వెలుగులు వచ్చాయి. ఆ తరువాత విలియమ్స్ 18 ఎం. ఎం. ప్రొజెక్షన్ పరికరాన్ని కొన్నాడు. ఇది కరెంటుతో తనంతట తాను పని చేసి తెరపై సినిమాను ప్రదర్శిస్తుంది. దాంతో ఇప్పటిదాకా నడిచిన ఎం.ఎం. ప్రొజెక్టను పాత సామాను గదిలో పెట్టేశారు. అదే మన మహమూద్ మెయా జీవితాన్ని మలుపు తప్పింది.
చూస్తుండగానే 15 ఏళ్ల కాలం గడిచిపోయింది.
విలియమ్స్ ప్రమోషన్ వచ్చి కెప్టెన్ అయ్యాడు. తరువాత కొద్ది రోజులకి ఇంగ్లాండ్‌కు బదిలీ అయింది. ఇంగ్లండుకు తిరిగి వెళుతూ వెంట తీసుకుపోలేని విలువైన వస్తువులను కొన్నింటిని అమ్మివేసి, మరికొన్నింటిని ఉచితంగానే అడిగిన వారికి ఇచ్చేశాడు. ఐతే సేవాగుణం ఉన్న ఆయన భార్య మెహమూద్ మియాను పిలిపించి ”చూడు బాబూ (అప్పటికి మనోడి వయసు 24 ఏండ్లు) నీకు ఇన్నేండ్లు చదువు చెప్పించి ప్రయోజకుడిని చేయాలనే నా ప్రయత్నం ఏది ఫలించలేదు. ఇంతకాలం మీరంతా మా కుటుంబంలో ఒకరుగా ఉన్నారు. కనుక నీ బతుకు తెరువునకు ఒక మార్గం చూశాన”ని, అప్పటికప్పుడు కొందరు పనివాళ్లను పిలిపించి ఒక బండిని తయారు చేయించింది. దానికి పాత సామాను గదిలో ఉన్న 8 ఎం.ఎం. ప్రొజెక్టర్ను అమర్చింది. ఈ బండిని వీధుల్లో తిప్పుతూ పిల్లలకు సినిమాలు చూపిస్తూ కుటుంబాన్ని పోషించుకొమ్మని చెప్పింది. అప్పటిదాకా తోటమాలిగా పని చేస్తును మొహమూద్ మియా ఆ పనిని వదిలిపెట్టి దొబ్బుడు బండిని జీవనాధారం చేసుకున్నాడు. అప్పటిదాకా తన వద్ద కారు నడుపుతున్న మొహమూద్ మియా తండ్రికి ఆ కారును బహుమతిగా ఇచ్చిన ఆ తెల్లదొర దంపతులు దేశం విడిచి వెళ్లారు. తండ్రి కారు నడుపుకుని, మొహమూద్ మియా సినిమా బండిని నడుపుకుంటూ కొత్త జీవితం ప్రారంభించారు.
అది మూకీ సినిమాల కాలం.
ఆ రోజులలో హైదరాబాదులో డేరాలతో కలిసి నాలుగు ఐదు పర్మినెంట్ థియేటర్లు మాత్రం ఉండేవి. తన సినిమా బండిని వీధి వీధినా తిప్పుతూ వేలాది మంది పిల్లలకు సినిమాలు చూపించాడు మెహమూద్ మియా. సిద్ధి అంబర్ బజార్ చౌరస్తా, ఛత్రి బేగం బజార్, విమెన్ వెల్ఫేర్ సెంటర్, బేగంబజార్ తదితర ప్రాంతాలలోని ఆట మైదానాలలో తన సినిమా బండిని ఎక్కువగా నిలిపేవాడు.
ఈ సినిమా బండి 5ఐ3 ఫీట్ల కొలతల్లో వుండేది. చుట్టూరా పైన కప్పివేయబడి ఒకవైపు స్క్రీనింగ్, దానికి అభిముఖంగా ప్రాజెక్టర్ డైనమోల సాయంతో తెరపై బొమ్మ పడే ఏర్పాటు చేయబడేది. 8 ఎం.ఎం. ఫిలిం లోడ్ చేయబడిన ప్రొజెక్టరు ఒక చేత్తో, డ్రైవోమోను ఒక చేత్తో ఏకకాలంలో తిప్పుతూ బొమ్మ తెరపై పడేలా చూసుకునే వాడు మొహమూయా. దీనికి ఇరువైపులా సినిమా చూపేలా కిటికి వంటి ద్వారాలు ఉండేవి. ఈ ద్వారాల గుండా ఆరుగురు ఒకేసారి సినిమాలు చూసే ఏర్పాటు ఉండేది.
మూగచిత్రాల కాలంలో (1928) తన దొబ్బుడు సినిమా ప్రారంభించాడు కనుక అతను ప్రదర్శించినవన్నీ సైలెంట్ సినిమాలే. కొన్నిటికి టైటిల్స్ ఉండేవి. ఈ సినిమా షో చూడటానికి మోహమూద్ పిల్లలకు, పెద్దలకు ఒకే రుసుము అర్దాణా వసూలు చేసేవాడు. అప్పట్లో నిజాం కాలంలో ఉస్మానియా సిక్కా చెలామణిలో ఉండేది. తనకు ఆరుగురు ప్రేక్షకులు వచ్చే వరకు ఆగి ప్రదర్శన మొదలు పెట్టేవాడు మొహమూద్. సినిమా థియేటరుకు వెళ్ళి సినిమాలు చూడలేని పేదవాడు ఈ దొబ్బుడు బండి సినిమాను చూడటానికి ఆసక్తి చూపేవారు.
తర్వాత. ఒక 25 సంవత్సరాల పాటు విజయవంతంగా మహమూద్ మియా బండి నడిచింది. 1931లో సినిమాలకు మాటలు వచ్చినవి. క్రమంగా హైదరాబాదు నగరంలో సినిమా థియేటర్ల నిర్మాణం పెరిగింది. మరోవైపు 1948 తరువాత హైదరాబాదు ప్రాంతానికి ఇతర ప్రాంతాల వారి వలసలు పెరిగినవి. నగరంలో చౌకధర దుకాణాలు వెలిసి ప్రజలకు సరుకులు అందుబాటులోకి వచ్చినవి. దాంతో పేదవాడైన మోహమూద్ మియాకు ప్రేక్షకులు క్రమంగా దూరమయ్యారు. పైగా అర్ధాణా నుండి అణాకి తన రేటు పెంచి ఉన్నాడు. 1950ల మధ్య నాటికి సినిమా బండికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వచ్చింది. 1957 నాటికి ఈ సినిమా బండి వద్దకు వచ్చే వారు పూర్తిగా తగ్గిపోయారు. అలా దాదాపు 30 ఏళ్ల పాటు (1928- 1957) హైదరాబాదు పేద ప్రజలకు తన సినిమా బండితో వినోదాన్ని పంచిన మహమూద్ మియా మళ్లీ బతుకుతెరువుకు కొత్త దారి చూసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఇది గమనించిన తన ఎదురింటి యజమాని ఒకచోట చౌకీదారు ఉద్యోగం చూసి పెట్టడంతో మహమూద్ మియా మళ్లీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు. ఇది జరిగింది 1958లో. ఆ తర్వాత మహమ్మద్ మియా సినిమా అభిమానులు ఎవరికి కనిపించలేదు.
పుష్ కార్ట్ సినిమాగా మెహమూద్ మియా సినిమా బండి కాలాన్ని హైదరాబాదులో సినిమా చరిత్రకు తొలిరోజులుగా చెప్పుకొనవచ్చు. దీనితో 1908లో మూసీ వరదల చిత్రీకరణ తరువాత 1910లో ప్రజల కోసం కాకపోయినా నాలుగు గోడల మధ్య మూగ చిత్రాల ప్రదర్శన జరిగినట్లు మనకు రూఢ అవుతున్నది. హైదరాబాదులో మూకీల కాలంలో ప్రదర్శన రంగంలో ఒక విభిన్నమైన ప్రక్రియతో తెలంగాణ చరిత్రలో మొహమూద్ మియా సినిమా బండిది చెరగని స్థానం.
ఆ సినిమా బండిని నేను చూశాను
1950 తర్వాత నేను ఇంటర్ పాసై ఉద్యోగం కోసం హైదరాబాదులో ఉంటున్న రోజులవి. ఆబిడ్స్ దాటి ఎస్. బి.హెచ్. సందులో 50 ఏళ్లు పైబడిన ఒక వ్యక్తి ఇప్పుడు మనం చూస్తున్న అరటిపండ్ల బండి సైజు లో ఒక చక్రాల బండికి చుట్టూరా తెరలు కట్టి చిన్న చిన్న సినిమా బొమ్మలతో పిల్లలకు మాన్యువల్ ఫిలిం షో లు చూపుతూ ఉండటం నేను చూశాను. -కె.డాగోజిరావు(90),
రిటైర్డ్ హిందీ లెక్చరర్, మహబూబునగర్
రిఫరెన్స్ కర్టసీ: పసుపులేటి కమలాకర్
.(వ్యాసకర్త తెలంగాణ సినీ చరిత్రకారుడు)
మూకీ యుగంలో మన పుష్ కార్ట్ సినిమా
- Advertisement -
- Advertisement -