హరీశ్‌రావు అసూయ, కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలి
హైదరాబాద్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాం
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి
కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం తర్వాత తమ బాధ్యత మరింత పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించామనీ, దానిలో భాగంగా మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, మూసీ పునరుజ్జీవం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, గోదావరి జలాల తరలింపు లాంటి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. శుక్రవారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్‌తో కలిసి సీఎం మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమపార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ విజయం కోసం కృషి చేసిన అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
ఈ గెలుపుతో తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగడం, ఓడితే కుంగిపోవడం కాంగ్రెస్‌కు తెలియదనీ, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాడటం, అధికారంలో ఉంటే సమస్యలను పరిష్కరించడమే కాంగ్రెస్ పార్టీకి తెలుసనీ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారనీ, పోలైన ఓట్లలో 51 శాతం కాంగ్రెస్‌కు, 38 శాతం బీఆర్‌ఎస్‌కు, 8 శాతం బీజేపీకి ఓటు వేశారని విశ్లేషించారు. తమ ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా గమనించి ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని సంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలతో ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ విషం చిమ్మిందనీ, అభివృద్ధిలో ప్రధాన ప్రతిపక్షం సహకరించకపోగా, ప్రతీ సందర్భంలోనూ అవహేళన చేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు.
హైడ్రా, మూసీ విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారనీ, ఆయన వల్లే రాష్ట్ర అభివృద్ధికి విఘాతం ఏర్పడుతున్నదని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తానే అభ్యర్థిగా మారి పనిచేస్తే 17 వేల ఓట్లు వచ్చాయనీ, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉందన్న విషయాన్ని గమనించాలని సూచించారు. ఈ ఫలితాల తర్వాత అయినా కేంద్రమంత్రి తన వ్యవహారశైలి మార్చుకోవాలని హితవు పలికారు. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం భూకంపం వచ్చే ముందు వచ్చే అలర్ట్ లాంటిదనీ, గమనించకుంటే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అభివృద్ధికి సహకరించాలనీ, ఆయన్ని రాష్ట్ర సచివాలయానికి సాదరంగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. కేంద్రం వద్ద పెండింగ్ అనుమతులు, నిధులపై చర్చిద్దామనీ, దీనికి సంబంధించి సమీక్ష నిర్వహించి, నివేదిక రూపంలో రాష్ట్ర ఎంపీలకు ఇవ్వాలని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆయన సూచించారు.
అసూయ, అహంకారం తగ్గించుకోండి
జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాతైనా బీఆర్‌ఎస్ నాయకులు టీ హరీశ్‌రావు అసూయను, ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అహంకారాన్ని తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనీ, ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల శాతంతో పోల్చితే, బీఆర్‌ఎస్, బీజేపీ రెండింటికీ కలిపినా అన్ని ఓట్లు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు వారి అసూయ, అహంకారాన్ని గమనిస్తున్నారనీ, సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేండ్లు ఉందనీ, వచ్చే రెండేండ్లు అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలనీ, సమస్యలు ఉంటే ప్రశ్నించి, ధర్నాలు చేయాలని సూచించారు. ‘మీ సోషల్ మీడియాలో మీరు చెప్పిందే రాస్తారు. అదే నిజమని మీరే భ్రమల్లోకి వెళితే ఎలా?’ అని ప్రశ్నించారు.
వ్యాపార దృక్పథంతో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు సమాచారం వ్యాప్తిచేస్తున్నాయనీ, కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తున్నా కొన్ని ఛానళ్లు బీఆర్‌ఎస్ హవా మొదలైందని వార్తలు వేశాయని వ్యంగ్యంగా అన్నారు. మీడియా చానల్స్ దయచేసి విశ్వసనీయతను కోల్పోవద్దనీ, తమపై ఏదైనా వ్యతిరేకత ఉంటే మరోరకంగా చూపించాలని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరుగుతూ వస్తోందని తెలిపారు. 2023 ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చాయనీ, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 41 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 51 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారని విశ్లేషించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరనీ, ఆయన ఆరోగ్యం కూడా సరిగా ఉన్నట్టు లేదన్నారు. ఆయనపై తనకు సానుభూతి మాత్రమే ఉందనీ, ఆయన గురించి ఏం మాట్లాడబోనని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు.
ఎక్స్‌లో పోస్ట్
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అఖండ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. పీసీసీ నాయకత్వ స్థాయి నుంచి కార్యకర్త వరకు అందరూ ఏకతాటిపై నిలిచి, ఐక్యంగా పని చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తి ఆపలేదని ఈ ఫలితాలు రుజువు చేశాయనీ, ఈ విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు.



