డాక్టర్. పాతూరి అన్నపూర్ణ… చిన్నతనం నుండే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. తెలుగు భాష పట్ల అభిలాషతో సాహిత్యాన్ని విస్కృతంగా అధ్యయనం చేశారు. పాఠశాల స్థాయి నుండే సాహిత్య రచన మొదలుపెట్టారు. సమాజ మార్పును కోరుకుంటూ, స్త్రీ సమస్యలను ప్రశ్నిస్తూ ఎన్నో పుస్తకాలు ముద్రించారు. ఒక పక్క ఉపాధ్యాయినిగా పని చేస్తూనే మరో పక్క సాహిత్యానికి విశేష సేవలందిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
అన్నపూర్ణ.. పాతూరి నరసింహారావు, మాణిక్యమ్మల దంపతులకు నాలుగో సంతానంగా బొబ్బిలి నగరంలో పుట్టారు. ఈమె బాల్యమంతా తాతా, నాయనమ్మల వద్దనే జరిగింది. వీరి తాత బొబ్బిలి రాజా వారి ఆస్థానంలో సివిల్ ఇంజనీర్. ఆ కారణంగా అన్నపూర్ణ అక్కడ జన్మించారు. ఆయన పదవీ విరమణ తర్వాత బాపట్లకు మకాం మార్చారు. అన్నపూర్ణ ప్రాథమిక విద్యాభ్యాసమంతా బాపట్ల మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. తాత గారికి ముద్దుల మనవరాలు అన్నపూర్ణ. ఐదో తరగతి నుండి ఆయన అన్నపూర్ణతో చందమామ, బాలమిత్రలోని కథలు బాగా చదివించేవారు. పెద్దబాలశిక్ష ప్రతిరోజు వల్లె వేయించేవారు. నాయనమ్మ కూడా సుమతి, వేమన, దాశరధి, కుమారి శతకాలు, చిన్నచిన్న నీతి కథలు చదివించేవారు.
స్కూల్ విద్యార్థిగా…
ఒకవైపు పాఠశాలలో ఉపాధ్యాయులు ఇష్టపడే శిష్యురాలుగా మరోవైపు ఇంట్లో ఇస్తున్న ప్రోత్సాహం వల్ల అన్నపూర్ణకు చిన్నతనంలోనే తెలుగు భాషపై మక్కువ ఏర్పడింది. అంతేకాదు మంచి పట్టు కూడా వచ్చింది. భవిష్యత్తులో ఆమె ఎన్నో పుస్తకాలు రాసేందుకు, సాహిత్య కార్యక్రమాలు చేసేందుకు ఈ శిక్షణ ఎంతగానే ఉపయోగపడింది. ఆరేడు తరగతులు బాపట్లలో పూర్తి చేసి తాత, నాయనమ్మలతో కలిసి నెల్లూరులో ఉండే తల్లితండ్రుల వద్దకు వచ్చేశారు. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. అన్నపూర్ణకు కూచిపూడి నృత్యంలో కూడా ప్రవేశం ఉన్నది. బాపట్లలో ఉన్నప్పుడు వేదాంతం సత్యనారాయణ శిష్యుల వద్ద నృత్యం నేర్చుకున్నారు. నెల్లూరుకు వచ్చాక దాన్ని కొనసాగించలేకపోయారు. కానీ నృత్యం పట్ల ఆసక్తి మాత్రం ఉండేది. పాఠశాల కార్యక్రమాలలో నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు.
ఉపాధ్యాయినిగా…
పదవ తరగతిలో ఆమె ‘వసంత రుతువు’ కవిత పాఠశాల మ్యాగజైన్లో అచ్చయింది. అది చదివిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతో మెచ్చుకున్నారు. తర్వాత నెల్లూరులోనే ఇంటర్, బి.ఏ డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లో ఆమె కల్చరల్ సెక్రటరీగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డిగ్రీ తర్వాత చతుర్వేదుల శ్యామక్రిష్ణతో వివాహం కావడంతో హైదరాబాదుకు వచ్చేశారు. భర్త బ్యాంకు ఉద్యోగి. వీరికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి స్రవంతి, అబ్బాయి తారక రామ్. వీరు 1980 నుండి 1990 వరకు హైదరాబాదులో ఉన్నారు. ఓ స్కూల్‌లో ఉపాధ్యాయినిగా పనిచేశారు. అప్పటినుండి ఆమె దృష్టి సాహిత్యం వైపు మళ్ళింది. దానికి కారణం ఆంధ్ర ప్రభలో ‘ఒక అమ్మ కథ’ అనే కథ అచ్చయింది. ఆ తర్వాత ఆంధ్రభూమిలో మొదటిసారిగా ఆమె కవితలు వచ్చాయి. ఆ కవితలపై ప్రశంసలు కురిపిస్తూ ఎందరో ఉత్తరాలు కూడా రాశారు. ఇదే ఆమెకు సాహిత్యంపై మక్కువ కలగడానికి కారణం అయింది. తర్వాత ఎన్నో పత్రికలలో కథలు, కవితలు, వ్యాసాలు రాయడం ప్రారంభించారు.
కలం ఆమె బలం
1990 తర్వాత వీరి కుటుంబం నెల్లూరుకు మారింది. అక్కడ కూడా ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా చేరారు. 1992లో ఆమెను ప్రభుత్వ ఉద్యోగం వరించింది. నెల్లూరు జిల్లా పల్లెపాడు గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా మొదలైన ఆమె జీవితం ఎన్నో విజయాలను సాధించింది. ‘కలం ఆమె బలం’, ‘అక్షరం ఆమె ఆయుధం’గా ముందుకు దూసుకు వెళ్లారు. 1992లో నెల్లూరు జిల్లా రచయితల సంఘంలో సభ్యురాలయ్యారు. 2006లో నెల్లూరు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఎందరో గొప్ప గొప్ప సాహితీవేత్తలను నెల్లూరుకి ఆహ్వానించారు. ఎన్నో సాహిత్య ఉపన్యాసాలు విని సాహిత్యంపై మంచి పట్టు సంపాదించారు.
తల్లి ప్రోత్సాహం
2003లో ఆమె మొదటి పుస్తకం ‘అడవి ఉరేసుకుంది’ కవితా సంపుటి అచ్చులోకి వచ్చింది. ఇక్కడ ఆమె తల్లి మాణిక్యమ్మ గురించి రెండు మాటలు చెప్పక తప్పదు. అన్నపూర్ణ సాహిత్య రంగంలో ముందుకు వెళ్లేందుకు తల్లి ప్రోత్సాహం ఎంతో ఉంది. నెల్లూరులో జరిగితే ప్రతి సాహిత్య కార్యక్రమానికి ఆమె హాజరయ్యేవారు. కూతుర్ని అందరూ మెచ్చుకుంటుంటే చాలా సంతోషించేవారు. అందుకే అన్నపూర్ణ తన తల్లి మరణానంతరం 2013 నుండి ‘పాతూరి మాణిక్యమ్మ రాష్ట్ర స్థాయి స్మారక సాహిత్య పురస్కారం’ ద్వారా ఉత్తమ కవితా, కథా సంపుటులకు నగదు పురస్కారాలు ప్రారంభించారు. ఈ పురస్కారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారికి కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ అవార్డు ద్వారా ఎందరో యువ కవులు స్ఫూర్తి పొందారు.
అచ్చయిన పుస్తకాలు
అన్నపూర్ణ రాసిన అడవి ఉరేసుకుంది, నిశ్శబ్దాన్ని వెతక్కు, మనసు తడి, నడిచొచ్చిన దారంతా అనే కవితా సంపుటులు, పెన్నా తీరాన నానీలు, హృదయ అక్షరాలు అనే నానీల సంపుటులను అచ్చులోకి తెచ్చారు. అంతేకాదు వీరి సంపాదకత్వంలో ‘మనసు చెప్పిన కథలు’, ‘కాలుతున్న కాలం(కరోనా పై కథలు)’, ‘మేం అడగాలా జిల్లాలకు మహిళల పేర్లు పెట్టమని’ అనే కవితా సంకలనాలు అచ్చులోకి వచ్చాయి. దాదాపు 50కి పైగా కథలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. కొన్ని కథలకి జాతీయ స్థాయిలో బహుమతులు వచ్చాయి. ఆన్లైన్‌లో ఆమె కథలు వేరే వారు కూడా చదువుతున్నారు. ఆమె కృషిని మెచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం అందించింది. నెల్లూరు జిల్లా సాంస్కృతిక మండలి నిర్వహణలో ఉగాది పండగ రోజున కవి సమ్మేళనం దాదాపు ఏడెనిమిదేండ్ల పాటు నిర్వహించిన తీరు కూడా వీరికి పేరు ప్రఘ్యాతులను తెచ్చిపెట్టింది. ఆల్ ఇండియా రేడియో ద్వారా కూడా కవితలు, కథలు చదువుతున్నారు. 2011 నుండి అన్నపూర్ణ నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా పుస్తకాలను కూడా తీసుకొస్తున్నారు. స్త్రీల సమస్యలపై పోరాటాలు సైతం చేస్తున్నారు.
సాహిత్య సేవ చేస్తూనే ఉంటా
నా కుటుంబం ముఖ్యంగా మావారు నాకు చాలా సహకరిస్తారు. ఆయనకు సాహిత్య పట్ల పెద్దగా ఆసక్తి లేకపోయినా నన్ను మాత్రం అడ్డుకోరు. మా పిల్లలు కూడా అంతే. ఉద్యోగం, కుటుంబం, సాహిత్యం అన్నీ ముఖ్యమైనవే. దేన్నీ నిర్లక్ష్యం చెయ్యకూడదు. అందుకే దేని టైమ్ దానికి కేటాయించుకుని పని చేస్తుంటాను. అన్నిటికి కారణం నా మనసు. అది ఆలోచిస్తూనే ఉంటుంది. మనం ఏం చేయాలన్నా మన ఆరోగ్యం చాలా ముఖ్యం. సాహితీసేవ ఇంకా చేయగలననే నమ్మకం ఉంది. సమాజానికి పనికొచ్చే విధంగా మన రచనలు ఉండాలి. యువతరాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. పుస్తక పఠనం నేర్పాలి. ఇతరులు రాసిన పుస్తకాలు చదవడం, వీలైతే మంచి రచనలు చెయ్యడం నాలక్ష్యం. పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు భాషమీద, సాహిత్యం మీద చైతన్యం, అభిలాష కల్పించాలని నా కోరిక.
అచ్యుతని రాజశ్రీ



