– ముసాయిదా ఓటర్ల జాబితాపై ఇసి సమాచారం
– నేటితో ముగియనున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ
– ఆగస్టు 1న జాబితా ప్రచురణ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న బీహార్‌లోని ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. శుక్రవారంతో ఈ ప్రక్రియ ముగియనుంది. అయినా ఇంకా అవసరమైన పత్రాలు సమర్పించని వారు సుమారు ఏడు లక్షల మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ గురువారం వెల్లడించిన సమాచారం ప్రకారం 91.32 శాత మంది (7.21 కోట్ల మంది) ఓటర్లు ఇప్పటి వరకూ గణన ఫారంలు సమర్పించారు. వీటిని స్వీకరించి డిజిటలైజ్ చేసినట్లు ఇసి తెలిపింది. వీరు పేర్లన్నంటినీ కూడా ఆగస్టు 1న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చనున్నారు. ఈ ఏడాది జనవరి ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 7,89,69,844 మంది ఓటర్లు ఉన్నారు. ఈ జాబితాను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రకారం సవరణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇసి సమాచారం ప్రకారమే వీరిలో 7.21 కోట్ల మంది ఫారంలు సమర్పించారు. 21.6 మంది మరణించిన ఓటర్లు కాగా, మరో 31.5 లక్ష మంది ఓటర్లు రాష్ట్రం నుంచి శాశ్వతంగా వలస వెళ్లారు. ఏడు లక్షమంది ఓటర్లు గణన ఫారంలు సమర్పించలేదు. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు నమోదు చేసుకున్న ఓటర్లు ఏడు లక్షల మంది, గుర్తించలేని ఓటర్లు లక్ష మంది ఉన్నారని ఇసి తన సమాచారంలో వెల్లడించింది. దీని ప్రకారం ఆగస్టు 1న ప్రచురించే ఈ జాబితాలో ఈ 61 మంది పేర్లను తొలగించనున్నారు. ఎస్‌ఐఆర్ మార్గదర్శకాల ప్రకారం నూతన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాత ఈ జాబితా కాపీని రాష్ట్రంలోని 12 ప్రధాన రాజకీయపార్టీలకు అందిస్తారు. అలాగే ఇసిఐ అధికారిక వైబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే బూత్‌స్థాయి ఓటర్ల జాబితాను, ఫారాలు నింపని ఓటర్లు, మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల జాబితాను ఈ నెల 20న అన్ని రాజకీయ పార్టీలతో ఇసి పంచుకుంది. వీటిపై అభ్యంతరాలు తెలపాలని కోరింది.అలాగే, ముసాయిదా జాబితాపై కూడా అభ్యంతరాలను ఏ ఓటరైనా, లేదా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సెప్టెంబర్ 1 వరకూ ఫిర్యాదు చేయవచ్చనని ఇసి చెబుతోంది. కాబట్టి ముసాయిదా జాబితాను ఆగస్టు 1న విడుదల చేసినా జాబితాలో ఓటర్లను చేర్చడం, తొలగించడం సెప్టెంబరు 1 వరకూ కొనసాగుతుందని ఇసి తెలిపింది. కాగా, ఎస్‌ఐఆర్‌పై వస్తున్న విమర్శలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ మాట్లాడుతూ మరణించిన వారి పేర్లు, ఇతర ప్రదేశాల నుంచి వారి పేర్లు జాబితాలో చేర్చాలా అని ప్రశ్నించారు.
బీహార్‌లో 61 లక్షలకు పైగా ఓటర్లు అవుట్ !
- Advertisement -
- Advertisement -