వామపక్ష పార్టీల నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయిల్ దాడికి పాల్పడి ఈనెల ఏడో తేదీ నాటికి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇజ్రాయిల్ దాష్టీకాలను ఖండిస్తూ, పాలస్తీనాకు సంఘీభావంగా హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ ర్యాలీలో వామపక్ష పార్టీలు, ప్రజాస్వామ్య, లౌకిక, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్ధలు పెద్దఎత్తున పాల్గొం టాయని తెలిపాయి. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్న ఈ ర్యాలీలో ప్రజలు, ప్రజాతంత్రవాదులు భారీసంఖ్యలో పాల్గొని జయ ప్రదం చేయాలని విజ్ఞప్తి చేశాయి. మంగళవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షతన వామపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డీజీ నరసింహరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, నాయకులు రమ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జెవి చలపతిరావు, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర నాయకులు భరత్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.పాలస్తీనాపై ఇజ్రాయిల్ జాతి హత్యాకాండను కొనసాగిస్తున్నదని విమర్శించారు. ఎడతెరపి లేకుండా గాజా భూభాగం మీద బాంబులు కురిపిస్తూనే ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యాహుల మధ్య జరిగిన చర్చలో గాజా నుంచి పాలస్తీనియన్లను తరిమేసి ఆ భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే లక్ష్యం స్పష్టంగా కనపడుతున్నదని పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌కు బేషరతుగా అమెరికా అండదం డలు అందిస్తూ సహకరిస్తున్నదని వివరించారు. గాజాలోకి మానవతా సాయం ప్రవేశించకుండా నిరోధిస్తూ ఆ ప్రాంత ప్రజానీకాన్ని ఆకలితో మాడ్చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. క్షుద్భాదకు తాళలేక పిల్లలు, పెద్దలు మరణి స్తున్న వార్తలు కలిచి వేస్తున్నాయని తెలిపారు. గాజాలో క్షామ పరిస్థితులు నెలకొన్నాయంటూ ఐక్యరాజ్యసమితి ప్రకటిం చిందని గుర్తు చేశారు. గాజాలో నెలకొన్న దుర్భర పరిస్థితులు, ఇజ్రాయిల్ దాష్టీకాలను గురించి వార్తలు అందిస్తున్న జర్నలిస్టులను పథకం ప్రకారం ఇజ్రాయిల్ సేనలు హతమా రుస్తున్నాయని విమర్శించారు.
ఆఖరుకి ఆస్పత్రులను కూడా బాంబు దాడులతో ధ్వంసం చేస్తున్నదని తెలిపారు. గాజా భూభాగం శిథిలాల కుప్పలా మారిందని పేర్కొన్నారు. ఇజ్రాయిల్ పచ్చి క్రూర రాజ్యంలా వ్యవహరి స్తున్నదనీ, దానికి ఈ దాడులే నిరూపిస్తున్నాయని తెలిపారు. అంతర్జా తీయ న్యాయసూత్రాలు, రాయబార ప్రమాణాలను ఇజ్రా యిల్ అతిక్రమిస్తున్నదని విమర్శించారు. ఇజ్రాయిల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. పాలస్తీనాకు సంఘీభా వంగా చేస్తున్న కార్యక్రమంతోపాటు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లకు నిరసనగా చేపట్టా ల్సిన కార్యక్రమంపైనా చర్చించామని తెలిపారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొన్నారు.