నోటిఫికేషన్ తర్వాత ఎందుకు సవాల్ చేస్తున్నారు
ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక జోక్యం చేసుకోలేం
కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్‌కు ఆదేశం
తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ గురువారం వెనుకబడిన కుల సంఘాలు వేర్వేరుగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ మేరకు శుక్రవారం వారి పిటిషన్లపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సర్కార్ విడుదల చేసిన జీవో నెం.46పై ఈ దశలో తాము స్టే ఇవ్వలేమని స్పష్టం చేశారు. సబ్ క్యాటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలు రద్దు చేయాలనీ కోరుకుంటున్నారా? పిటీషనర్‌కు హైకోర్టు ప్రశ్న వేసింది. నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ తరఫు అడ్వకేట్ తన వాదనలు వినిపించారు.
42 శాతం రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మేమే చెప్పాం కదా? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో 2009లో ఇదే తరహా పరిస్థితి వచ్చినప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను రద్దు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్తు చేశారు. ఈ దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.”మేమే ఎన్నికలు నిర్వహించమని ఆదేశించి.. మేమే స్టే ఎలా ఇస్తాం’ అంటూ ప్రశ్నించింది. డెడికేటెడ్ కమిషన్ రిపోర్డ్‌ను బహిర్గతం చేసి కాపీ ఇవ్వాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. సబ్ క్యాటగిరి రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 6 వారాలోపు కౌంటర్ దాఖలు చేయాలన్న కోర్టు.. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది.
సొంత మొబైల్స్‌తో పోలీసుల చలాన్లు : హౌంశాఖకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల చలాన్ల పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేసిన విధానంపై హైకోర్టు సీరియస్ అయింది. మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీసి చలాన్ వేస్తున్నారని పిటిషనర్ రాఘవేంద్ర చారి పేర్కొన్నారు. పోలీసులు సొంత మొబైల్ ఫోన్ల ద్వారా తనకు మూడు చలాన్లు వేసినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో రాష్ట్ర హౌంశాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ట్రాఫిక్ చలాన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ-చలానా వ్యవస్థలో ట్రాఫిక్ ఉల్లంఘనలను పేర్కొంటూ చలానా జారీ అయ్యే వ్యవస్థను అభివద్ధి చేయాల్సి ఉందనీ, ఆ మేరకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను డిసెంబరు 9వ తేదీకి వాయిదా వేసింది.



