జిల్లా కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని
నవతెలంగాణ – వనపర్తి
జిల్లాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం స్వేచ్ఛయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ డి సునీత, సాధారణ పరిశీలకులు మల్లయ్య బట్టు, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్యతో కలిసి వీసీ లో పాల్గొన్నారు. ఏకగ్రీవ స్థానాలలో ఉపసర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్ల పై వచ్చే ఫిర్యాదులు, తదితర అంశాల పట్ల ఎన్నికల కమిషనర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున సంబంధిత రిపోర్టులు టి- పోల్ నందు పెండింగ్ లేకుండా నమోదు చేయాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి వచ్చిన నామినేషన్ లలో వాలీడ్ నామినేషన్ వివరాలు అప్ డేట్ చేయాలని అన్నారు. ఏకగ్రీవంగా ఎంపికైన గ్రామ సర్పంచ్ స్థానాలకు ఫారం 10 ప్రకారం ఫలితాల ప్రకటన చేపట్టాలని అన్నారు. వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాలలో ఉప సర్పంచ్ ఎన్నిక నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని అన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత సంబంధిత గ్రామాలలో స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి చేయాలని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చిన ప్రతి దరఖాస్తు పరిశీలించి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని, ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలెటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని అన్నారు. బ్యాలెట్ పేపర్ నిబంధనల ప్రకారం ముద్రించాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఎటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరుగకుండా పక్కా నిఘా ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏకగ్రీవంగా ఎంపికైన 5 సర్పంచి ఏకగ్రీవమైనట్లు తెలియజేశారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలెటేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిపిఓ తరుణ్ చక్రవర్తి, డి ఎల్ పి ఓ రఘునాథ్, సి సెక్షన్ సూపర్డెంట్ మదన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.



