సర్పంచ్ పదవులకు లక్షల్లో వేలంపాట
మహబూబ్‌నగర్ జిల్లా టంకర గ్రామ సర్పంచ్ పదవికి రూ.కోటి
నవతెలంగాణ-విలేకరులు
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచి పదవులు దక్కించుకోవడం కోసం పలువురు నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో సర్పంచ్ పదవి కోసం ఆశావహులు బహిరంగంగానే వేలంపాటలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత గ్రామస్తులు సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఏకగ్రీవం పేరుతో డబ్బులు చెల్లించి సర్పంచి పదవిని దక్కించుకున్నారు. హన్వాడ మండలం టంకర గ్రామంలో ఓ వ్యక్తి సర్పంచ్ పదవికి కోటి రూపాయలు చెల్లించి పదవి ఏకగ్రీవం చేసుకున్నట్టు సమాచారం.
గద్వాల మండలం చింతలకుంట గ్రామ సర్పంచి పదవికి రూ.38.50 లక్షలు, గొర్లఖాన్ దొడ్డి రూ.57 లక్షలు, కొండపల్లిలో రూ.62 లక్షలు, కురువపల్లిలో రూ.45 లక్షలు, కొత్తపాలెంలో రూ.26.50 లక్షలు, ముచ్చోనిపల్లిలో రూ.14.09 లక్షలు, ఉముత్యాల తండాలో రూ.12 లక్షలు పెట్టి సర్పంచుల పదవిని కైవసం చేసుకున్నట్టు తెలిసింది. అరగిద్ద రూ.31 లక్షలు, మిట్టదొడ్డి రూ.50 లక్షలకు సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలం రంగాపురం గ్రామ సర్పంచ్ పదవిని రూ.15 లక్షలకు ఓ వ్యక్తి దక్కించుకున్నట్టు సమాచారం. ఈ డబ్బులను గ్రామ దేవాలయ అభివృద్ధికి వినియోగించనున్నట్టు తెలిపారు.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగుగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి గ్రామస్తులు వేలంపాట నిర్వహించారు. వచ్చిన డబ్బులను ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణానికి వెచ్చించాలని తీర్మానం చేశారు. దాంతో గ్రామ పెద్దల సమక్షంలో శుక్రవారం వేలం నిర్వహించగా ఏడుగురు పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి రూ.20లక్షలకు వేలంపాటలో సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నాడు. అదే పార్టీకి నాలుగు వార్డులు ఏకగ్రీవంగా, బీఆర్‌ఎస్ పార్టీకి మూడు వార్డులు, బీజేపీకి ఒక వార్డు ఏకగ్రీవంగా ప్రకటించేందుకు గ్రామస్తులు ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. దాంతో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ప్రచారం జరుగుతోంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామ పంచాయతీ ఎస్టీకి రిజర్వ్ చేయగా, ఓ అభ్యర్థి రూ. 8.30 లక్షలకు సర్పంచ్ పదవిని కొనుగోలు చేసినట్టు సమాచారం.
వేలానికి పంచాయతీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



