నవతెలంగాణ – హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్టార్ ప్లేయర్ ఆఖరిదైన ఐదో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో నారాయణ్ జగదీశన్‌ను ఎంపిక చేసింది. ఐదో టెస్టుకు దూరమైన పంత్.. జట్టు సభ్యులకు కీలక సందేశం ఇచ్చాడు. చివరి టెస్టులో గెలిచి దేశం కోసం అందిద్దామని అన్నాడు.”నా టీమ్‌కు ఒకేఒక్క సందేశం ఇస్తున్నా. గయ్స్… ఎట్టిపరిస్థితుల్లో మనం గెలుద్దాం.
దేశం కోసం చేద్దాం. వ్యక్తిగత లక్ష్యం గురించి ఆలోచించకుండా జట్టును గెలిపించేందుకు కృషి చేద్దాం. తోటి ఆటగాళ్లంతా ఇలాంటి సమయంలో అండగా నిలవడం బాగుంది. దేశం కోసం ఆడేటప్పుడు జట్టు ఒత్తిడిలో ఉన్నా సరే ప్రతిఒక్కరూ మద్దతు ఇస్తారు. అలాంటి భావోద్వేగాలను వివరించడం చాలా కష్టం. నా దేశం తరఫున ఆడటాన్ని ఎప్పుడూ గర్వంగానే భావిస్తుంటా” అని పంత్ చెప్పుకొచ్చాడు. కాగా, జులై 31 నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.