ఇద్దరికీ చోటు పక్కా
టీమిండియా బౌలింగ్ కోచ్ డోస్చెట్
కోల్‌కతా : 14నుంచి ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే తొలిటెస్ట్‌లో చోటుకోసం రిషబ్ పంత్, ధృవ్ జురెల్ నెట్స్‌లో చెమటోడ్చి సాధన చేస్తున్నారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో భారత ఫీల్డింగ్ కోచ్ ర్యాన్ డోస్చెట్ మాట్లాడుతూ.. వీరిద్దరూ తొలిటెస్ట్ బరిలో దిగడం ఖాయమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో రిషబ్ పంత్ గాయపడి దీర్ఘకాలం తర్వాత జాతీయ జట్టులో చోటుకోసం ఎదురు చూస్తున్నాడని, దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన మ్యాచ్‌లో ధృవ్ జురెల్ సత్తా చాటాడని, ఈ క్రమంలో వీరిద్దరికీ చోటు దక్కకపోతే తాను ఆశ్చర్యానికి గురవుతానని తెలిపాడు.
ఇటీవల కాలంలో జరిగిన ఐదు ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచుల్లో ధృవ్ జురెల్ నాలుగు సెంచరీలతో రాణించాడని, దక్షిణాఫ్రికా-ఎపైనా రెండు శతకాలు బాదాడని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న జురెల్‌ను బెంచ్‌కే పరిమితం చేయాలని తాను కోరుకోవడం లేదని విలేకరుల అడిగిన ప్రశ్నకు సమాధానంగా డోస్చెట్ తెలిపాడు. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో అతడు బ్యాటర్ కోటాలో చోటు దక్కించుకోవడం ఖాయమని ప్లేయింగ్ ఎలెవెన్‌లో అతని పేరు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 22ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడని, కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌల్ చేశాడని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
విజయ్ హజారే బరిలో రోహిత్
విజయ్ హజారే వన్డే టోర్నీ బరిలో టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగుతాడని ముంబయి చీఫ్ సెలెక్టర్ సూచన ప్రాయంగా తెలిపాడు. డిసెంబర్ 24 నుంచి జనవరి 8 వరకు జరిగే ఈ టోర్నీలో రోహిత్ శర్మ పాల్గొంటాడని, ఈ ఏడాది ప్రారంభంలో బిసిసిఐ ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడకుండా ఉన్న పక్షంలో తప్పనిసరిగా దేశవాళీ లీగ్‌లలో తప్పనిసరిగా ఆడాలని నిబంధనను విధించడమే ఇందుకు ప్రధాన కారణం. దేశవాళీ లీగ్‌లలో ఆడేందుకు రోహిత్ శర్మ ముంబయిలోని శరద్ పవార్ ఇండోర్ అకాడమీలో బుధవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు సమాచారం.
డిసెంబర్ 3 నుంచి 9 వరకు జరగనున్న దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్, జనవరి 11న ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్ మధ్య దేశీయ క్యాలెండర్‌లో ఈ మ్యాచ్ ఏకైక వన్డే. రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉంటానని ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కి తెలియజేసినట్లు సమాచారం. ఇక విరాట్ కోహ్లి కూడా దేశవాళీ లీగ్‌లలో ఆడాల్సి ఉంది. ప్రసుతం కోహ్లీ లండన్‌లో ఉన్నాడు. అతడు కూడా దేశీయ సర్క్యూట్‌లో ఆడాలని బోర్డు ఆదేశించింది. ఇద్దరు గత సీజన్‌లో ఇద్దరూ ఒక్కో రంజీ మ్యాచ్‌లో ఆడారు. జనవరిలో కోహ్లీ 12ఏళ్ల తర్వాత ఢిల్లీ తరఫున, రోహిత్ 10ఏళ్ల తర్వాత ముంబయి తరఫున ఆడారు. అలాగే ఈ నెల 26న ప్రారంభం కానున్న ముష్తాక్ అలీ టి20 టోర్నీలో రోహిత్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
2027 ప్రపంచ కప్ కోసం..
ట్రయల్స్‌లో కోహ్లీ, రోహిత్ పేర్లు పరిశీలనలో లేవని సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. ఇద్దరు ఆటగాళ్లు ట్రోఫీల్లోనే కాదని.. పరుగులలో కూడా భారత క్రికెట్ కోసం చాలా చేశారన్నారు. రాబోయే ప్రపంచకప్ (2027) వరకు ఇంకా చాలా దూరం ఉందని.. వారు ఓ ఫార్మాట్‌లో ఆడుతూ సుదీర్ఘ విరామం తర్వాత దేశీయ మ్యాచ్‌లు ఆడుతూ ఉంటే వారి ప్రదర్శనను అంచనా వేస్తూనే ఉంటామన్నారు. 2027 నాటికి అనేక మార్పులు సాధ్యమేనని, అది కోహ్లీ, రోహిత్‌పై మాత్రమే ఆధారపడి ఉండదని, అప్పటికి చాలా మంది యువ ఆటగాళ్ల పరిస్థితి కూడా మారవచ్చని అగార్కర్ స్పష్టం చేశాడు. దేశీయ క్రికెట్‌లో పాల్గొనడం వల్ల ఆటగాళ్ల ఫిట్‌నెస్, టెక్నిక్‌ను పరీక్షిస్తుందని.. కోహ్లీ, రోహిత్‌కు, దేశీయ క్రికెట్‌కు తిరిగి కేవలం లాంఛనప్రాయం కాకుండా.. ఇది వారి ఫామ్, భవిష్యత్తుకు కీలకంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నాడు.



