ఈ రెండింటిలో మొదటిదానికి విరోధాభాస అనే తెలుగు పదబంధం వాడుకలో ఉంది. రెండవదాన్ని వ్యతిరేక పద సమ్మేళనం అనవచ్చు. తర్కం ప్రకారం పైకి పరస్పరం విరుద్ధమైనదిగా అసంబద్ధమైనదిగా కనిపించినా, వివేచించి చూస్తే అర్థవంతమైనదిగా లేక సరైన ఆధారం ఉన్నదిగా కనిపించేదాన్ని విరోధాభాస అంటాం.
అర్థం చేసుకునేందుకు మేధను కొంచెం శ్రమకు గురి చేసే ఈ సాహిత్య సాధనం (literary device) కొన్నిసార్లు బలమైన ప్రభావం కలుగజేస్తుంది. ఇది చమత్కారాన్ని వెలయించడంలో కూడా తోడ్పడుతుంది. నవ్య విమర్శ (New Criticism) సంప్రదాయానికి చెందిన క్లియాంత్ బ్రూక్స్ అనే విమర్శకుడు పారడాక్స్‌ను కవిత్వభాషకు మౌలికమైన, అనివార్యమైన అంశంగా వర్ణించాడు.
పదహారవ శతాబ్దంలో పుట్టిన ఆంగ్లేయ కవి, మేధావి, సైనికుడు జాన్ డన్ (John Donne) పూర్వం ఈ కవిత్వ సాధనాన్ని బాగా ఉపయోగించాడు. ఈయన Problems and Paradoxes అనే వచన గ్రంథాన్ని రాయడమే కాకుండా, తన కవిత్వంలో విరోధాభాసను తరచుగా పొందుపరచాడు. ”ఒక చిన్న కునుకు తర్వాత మనం మేల్కొంటాం/ ఇక మరణం ఉండదు/ మరణమా, నువ్వు మరణిస్తావు” అంటాడు.
సెయింట్ పాల్, సదల్, హాప్కిన్స్, మిల్టన్, టెన్నిసన్, టి.ఎస్. ఎలియట్ తదితరులు కూడా విరోధాభాసను ఎక్కువగా వాడారు. రాబర్ట్ బ్రౌనింగ్ ఒకచోట, ”తక్కువ అంటే ఎక్కువ,” అన్నాడు. ఆ కాలంలోని మరికొందరు కవులు ఉపయోగించిన కొన్ని విరోధాభాసలు: నేను జ్వలించి గడ్డకట్టుకుపోతాను, నీ నల్లని చొక్కాలు అధిక కాంతిని కలిగి ఉంటాయి, బలహీనంగా ఉన్నప్పుడు నేను బలంగా ఉంటాను.
ఆక్సిమోరాన్ కూడా విరోధాభాసే. కానీ అది చిన్నగా ఉంటుంది. అంటే పరస్పరం వ్యతిరేకమైన రెండు పదాలు కలిసిన సమాసం అన్న మాట. అసలు గ్రీకు భాషలో ఆక్సిమోరాన్ అన్న పదబంధమే ఒక ఆక్సిమోరాన్! ఆ భాషలో దాని అర్థం dull-sharp. ఇతర ఉదాహరణలు: హాయి గొలిపే బాధలు (pleasing pains), ప్రేమించే ద్వేషం (loving hate), చేదైన మాధుర్యం (bitter-sweet) చెవుడును తెప్పించే నిశ్శబ్దం (deafening silence) మొదలైనవి.
తెలుగు కవిత్వంలో విరోధాభాస విరివిగా కనిపిస్తుంది. ఉదాహరణలు చూడండి.
విభేదించే మిత్రులు, ఏకీభవించే శత్రువులు వున్నారు (రమణజీవి).
అదశ్యమే నా అసలు చిరునామా/ నేను లేకపోవటంలోనే నా ఉనికి వుంది (సతీష్ చందర్).
విషమే అమతం/ నావను ముంచేది నావికుడే (లాలస).
శ్వేతాశ్వానికి నల్లతోక! (పి. వేణుగోపాలస్వామి).
తెలుగు కవిత్వంలో ఆక్సిమోరాన్ విషయానికి వస్తే, మల్లవరపు విశ్వేశ్వరరావు గారు రచించిన కవిత్వ సంపుటి పేరు మధుకీల. మొదటి సగం హాయిని, రెండవ సగం బాధను సూచిస్తుండటం వలన దీన్ని ఆక్సిమోరాన్‌గా భావించవచ్చు. వడ్డెర చండీదాస్ రాసిన నవల పేరు హిమజ్వాల. ఇది ఆక్సిమోరాన్‌కు చక్కని ఉదాహరణ. ఇక కవితా పంక్తులను పరిశీలిద్దాం.
స్త్రీలు అనే తన కవితలో అయిల సైదాచారి స్త్రీని వర్ణిస్తూ ‘ఒంటికి సూర్య వస్త్రాన్ని చుట్టుకున్న చీకటితేజం’ అంటారు. ఇందులో చీకటితేజం ఆక్సిమోరాన్ కాగా, సూర్యవస్త్రం రూపకం (metaphor).
పసుపులేటి గీత, వేళ్లు అనే తన కవితలో ఒకచోట ‘సూది నూలు పోగుల్లోకి చొచ్చుకుపోయే మదుకాఠిన్యం’ అంటారు. బాణాల శ్రీనివాసరావు తన కవితలో ‘వలసపాలకుల చెదల్ని కాల్చే నీటినిప్పు తెలంగాణ’ అంటారు. నిజానికి ఈ కవిత శీర్షికే నీటినిప్పు. ఈ రెండు ఉదాహరణలలోని మదుకాఠిన్యం, నీటినిప్పులు ఆక్సిమోరాన్‌లు.
సాహిత్య సాధనాలను (literary devices), కవిత్వ సాధనాలను (poetic devices) సహజత్వంతో చేర్చడం ద్వారా కవులు, రచయితలు తమ రచనలను కొంతవరకు మెరుగుపరచవచ్చు. వీటిలో మొదటివి మొత్తం సాహిత్యానికి వర్తించేవి కాగా, రెండవ రకంవి కేవలం కవిత్వానికి సంబంధించినవి.
ఎలనాగ