– జడేజా, సుందర్, గిల్ శతకాలు
– చేతులెత్తేసిన ఇంగ్లాండ్ బౌలర్లు
– డ్రాగా ముగిసిన మాంచెస్టర్ టెస్టు
తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ లోటు. రెండో ఇన్నింగ్స్ తొలి ఐదు బంతుల్లోనే రెండు వికెట్ల పతనం. మరో ఐదు సెషన్ల సమయం ఉండటంతో మాంచెస్టర్‌లో టీమ్ ఇండియా ఓటమి లాంఛనమే అనిపించింది. కానీ టెస్టు క్రికెట్ అంటేనే సహనం, పోరాటం అని భారత్ మరోసారి నిరూపించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (103) సహా స్పిన్ ఆల్‌రౌండర్లు జడేజా (107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్) అజేయ సెంచరీలతో మెరిశారు. తొలి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్.. తర్వాతి 142 ఓవర్లలో మరో రెండు వికెట్లు మాత్రమే తీయగలిగింది. ఒత్తిడిలో పరాక్రమం పర్వం చూపించిన భారత్ మాంచెస్టర్ టెస్టును డ్రా చేసుకుంది.
నవతెలంగాణ-మాంచెస్టర్
‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీ అంచనాలను మించి సాగుతోంది. లీడ్స్, లార్డ్స్ టెస్టుల్లో విజయం పక్కా అనుకున్న దశలో భారత్ అనూహ్యంగా ఓటమి చెందగా.. మాంచెస్టర్‌లో ఓటమి తథ్యమనుకున్న తరుణంలో టీమ్ ఇండియా డ్రా చేసుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (103, 238 బంతుల్లో 12 ఫోర్లు), రవీంద్ర జడేజా (107 నాటౌట్, 185 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్, 206 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో కదం తొక్కారు. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ లోటుతో రెండోసారి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. 143 ఓవర్లలో 4 వికెట్లకు 425 పరుగులు చేసింది. ఆఖరు రోజు ఆటలో మరో 10 ఓవర్లు మిగిలి ఉండగా ఇరు జట్లు డ్రాకు అంగీకరించారు. దీంతో ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన మాంచెస్టర్ టెస్టు ఊహించని మలుపులు తిరుగుతూ డ్రాగా ముగిసింది. ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు శతకంతో మెరిసిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ముందంజలో కొనసాగుతుంది. టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో ఆఖరు టెస్టు ఈ నెల 31 నుంచి లండన్‌లోని ది ఓవల్ మైదానంలో జరుగుతుంది.
వీరోచిత పోరాటం
రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లోనే 2 వికెట్లు చేజార్చుకున్న టీమ్ ఇండియా ఓటమి కూరల్లోకి కూరుకుంది. నాల్గో రోజు మరిన్ని వికెట్లపై కన్నేసిన ఇంగ్లాండ్‌ను కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (103), ఓపెనర్ కెఎల్ రాహుల్ (90, 230 బంతుల్లో 8 ఫోర్లు) నిలువరించారు. గిల్, రాహుల్ మూడో వికెట్‌కు 70 ఓవర్లలో 188 పరుగులు జోడించారు. శతకం ముంగిట రాహుల్, సెంచరీ తర్వాత గిల్ నిష్క్రమించటంతో ఇంగ్లాండ్ శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ స్పిన్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచిత పోరాట పటిమ ప్రదర్శించారు. సుందర్, జడేజా ఐదో వికెట్‌కు అజేయంగా 334 బంతుల్లో 203 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్ లోటు అధిగమించి.. భారత్‌ను 114 పరుగుల ముందంజలో నిలిపారు. వాషింగ్టన్ సుందర్ కెరీర్ తొలి టెస్టు సెంచరీ సాధించగా.. సిరీస్‌లో వరుస అర్థ సెంచరీల తర్వాత జడేజా సైతం శతక సంబురం చేసుకున్నాడు. మరో 10 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఫలితం తేలే అవకాశం లేకపోవటంతో ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి.
‘డ్రా’ హైడ్రామా
మరో 15 ఓవర్ల ఆట (చివరి గంట) మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డ్రా ప్రతిపాదన చేశాడు. కానీ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ డ్రాకు అంగీకరించలేదు. క్రీజులో ఒత్తిడిని ఎదుర్కొంటూ.. నాణ్యమైన ఇంగ్లాండ్ బౌలింగ్‌ను చిత్తు చేసిన ఆల్‌రౌండర్లు సెంచరీ ముంగిట ‘చేతులు కలిపేందుకు’ నిరాకరించారు. ఇంగ్లాండ్ ప్రధాన బౌలర్లు నీరసించటంతో స్టోక్స్ అసహనం వ్యక్తం చేశాడు. 138 ఓవర్ల వద్ద స్టోక్స్ డ్రా ప్రతిపాదన తీసుకురాగా.. ఆ తర్వాత వరుసగా ఐదు ఓవర్లను జో రూట్, హ్యారీ బ్రూక్‌కు అందించాడు. ఐదు ఓవర్లలో శతకాలు పూర్తి చేసిన జడేజా, సుందర్‌లు.. ఇంగ్లాండ్ డ్రా ప్రతిపాదనకు సమ్మతించారు.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : 358/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 669/10
భారత్ రెండో ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (సి) రూట్ (బి) వోక్స్ 0, రాహుల్ (ఎల్బీ) స్టోక్స్ 90, సాయి సుదర్శన్ (సి) బ్రూక్ (బి) వోక్స్ 0, శుభ్‌మన్ గిల్ (సి) స్మిత్ (బి) ఆర్చర్ 103, వాషింగ్టన్ సుందర్ నాటౌట్ 101, రవీంద్ర జడేజా నాటౌట్ 107, ఎక్స్‌ట్రాలు : 24,
మొత్తం : (143 ఓవర్లలో 4 వికెట్లకు) 425.
వికెట్ల పతనం : 1-0, 2-0, 3-188, 4-222.
బౌలింగ్ : క్రిస్ వోక్స్ 23-4-67-2, జోఫ్రా ఆర్చర్ 23-3-78-1, బ్రైడన్ కార్స్ 17-3-44-0, లియాం డాసన్ 47-11-95-0, జో రూట్ 19-2-68-0, బెన్ స్టోక్స్ 11-2-33-1, హ్యారీ బ్రూక్ 3-0-24-0.
పరాక్రమ పర్వం
- Advertisement -
- Advertisement -