Friday, October 31, 2025
E-PAPER
Homeజాతీయంఅమ్మా నాన్నల గొడవలు..ఒత్తిడిలో పిల్లలు

అమ్మా నాన్నల గొడవలు..ఒత్తిడిలో పిల్లలు

- Advertisement -

మానసికంగా కుంగిపోతున్న యువత
భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావం
మారుతున్న సామాజిక పరిణామాలు
కుటుంబాలను హెచ్చరిస్తున్న సైకాలజిస్టులు

న్యూఢిల్లీ : ప్రతి కుటుంబంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. పిల్లలు పుట్టినప్పటి నుంచి పెద్దవారయ్యే వరకూ ప్రతి అంశంలోనూ వారు శ్రద్ధ వహిస్తారు. తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టే పిల్లల ప్రవర్తన ఉంటుందని సాధారణంగా అందరూ అంటుంటారు. మానసిక వైద్య నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. తల్లిదండ్రులు తరచూ గొడవపడటం వంటివి పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు. ఇవి వారిని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇండ్లలో పిల్లలు పెద్దవారయ్యాక కూడా తల్లిదండ్రుల ప్రవర్తనల్లో ఏమార్పులు రాకపోవడం, అదే తరహా గొడవలు, వాదోపవాదనలు యువతరం భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెప్తున్నారు. ఒక వయసు వచ్చి.. చదువు పూర్తయి ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధం కావటమో, ఉద్యోగాలు, వ్యాపారం వంటివి చేస్తున్న పిల్లలకు తల్లిదండ్రులు తగువులాడటం అనేది ఒక సమస్యగా పరిణమించింది.

అలాంటి సందర్భాల్లో గొడవలను ఆపాలని ప్రయత్నించినా.. తల్లిదండ్రులు వినకపోవడం, తిరిగి వారి(ఎదిగిన పిల్లలు)నే నిందించడం వంటివి చేస్తున్నారు. ఉద్యోగం, పెండ్లి, భవిష్యత్‌ వంటి అనేక బాధ్యతలు మీద పడుతున్న సమయంలో ఇలాంటివి దేశంలోని పలు కుటుంబాల్లోని యువతీ, యువకులకు ఇబ్బందికరంగా మారాయని మానసిక నిపుణులు అంటున్నారు. ఫలితంగా వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని చెప్తున్నారు. పిల్లలు పెద్దవారయ్యాక కూడా తల్లిదండ్రుల మధ్య గొడవలను చూసి పెరిగిన కారణంగా వారిలో కలిగే బాధ, ఆందోళన, దు:ఖం వంటివి తగ్గిపోవు. తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవల్లో పిల్లలు చిక్కుకుపోతున్నారు. ఇద్దరినీ సముదాయించాలని వారు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పంతాలకు పోవడం కారణంగా పిల్లలకూ ఏమి చేయాలో పాలుపోని పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఇలా పిల్లలే మధ్యవర్తులుగా మారుతున్న సందర్భాల్లో.. పక్షపాతం వహిస్తున్నా వంటూ తిరిగి తల్లిదండ్రులే పిల్లలను ఆరోపిస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. ”మా ఇంట్లో మా అమ్మ, నాన్న, నేను ముగ్గురం మాత్రమే ఉంటాం. ఈ దీపావళీ పండుగను మా అమ్మ, నాన్నలతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని అనుకు న్నాను. పండుగ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాతే మా అమ్మ, నాన్నల మధ్య ఒక వాదన జరిగింది. దీంతో దీపావళి పూజను అమ్మ వదిలి వెళ్లింది. నేను, నాన్న మాత్రమే పూజను కొనసాగించాం. ఇది నాకు కొత్తేమీ కాదు. ప్రతీ పండుగకు మా ఇంట్లో ఇలాగే జరుగుతుంది. నాకు 20 ఏండ్లు. ఇది నన్ను మానసికంగా, భావోద్వేగంగా తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ పరిస్థితిని ఇంకెవరైనా ఎదుర్కొం టున్నారా, లేదా నేను మాత్రమే దురదృష్ట వంతురాలినా?” అంటూ ఓ యువతి ఆన్‌లైన్‌ వేదికగా తన బాధను వెళ్లగక్కింది. ఈ బాధ ఆ ఒక్క యువతిది మాత్రమే కాదనీ, దేశంలోని మెజారిటీ యువత ఇవే అనుభవాలను ఎదుర్కొం టున్నదని మానసిక వైద్యులు, నిపుణులు చెప్తున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించండి
గొడవలు ఆపాలన్న మధ్యవర్తి పాత్ర పిల్లల బాధ్యత కాదన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తెరగాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. గొడవ జరుగుతున్న సందర్భాల్లో పిల్లలు తటస్థంగా ఉండాలని సూచిస్తున్నారు. ”నేను ఇద్దరినీ ప్రేమిస్తు న్నాను. కానీ ఈ విషయాల్లో నేను మధ్యలో ఉండదల్చుకోలేదు” అని తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పాలి. ఒకవేళ ఇద్దరి మధ్య వివాదం పెరిగితే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవాలి. దీన్ని బాధ్యతారాహిత్య చర్యగా భావించొద్దు. సెల్ఫ్‌కేర్‌గానే చూడాలి అని మానసిక నిపుణులు చెప్తున్నారు. తల్లిదండ్రుల సమస్యలు పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపకుండా వారికివారే హద్దులు పెట్టుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు.

ఇలాంటి విషయాల్లో బాధను లోలోపల అణచుకోవద్దనీ, తమ భావాలని స్నేహితులకో, మానసిక వైద్య నిపుణులకో వ్యక్తపర్చాలనీ, ఫలితంగా మనసు తేలిక అవుతుందని సూచిస్తున్నారు. మరీము ఖ్యంగా తల్లిదండ్రుల మధ్య గొడవల్లో పక్షపాతం చూపవద్దనీ, అది పరిస్థితిని మరింత చెడగొడుతుందని అంటున్నారు. ‘తల్లిదండ్రుల గొడవలను మీ భుజాలపై వేసుకోవాల్సిన అవసరం లేదు. మానసిక శాంతి, సురక్షిత భావనను కాపాడుకోవడం చాలా ముఖ్యం’ అని నిపుణులు చెప్తున్నారు. ఈ పరిణామాలు సామాజికంగానూ ప్రతికూల ప్రభావాన్నే చూపుతున్నాయి. యుక్త వయసు వచ్చాక యువతీ, యువకులు వివాహాల పట్ల అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. పెండ్లి అంటే కొట్టుకు చావడమే అనే భావనకు వచ్చేస్తున్నారు. వారిని ఆ భావన నుంచి బయటపడేసే బాధ్యత కచ్చితంగా తల్లిదండ్రులదే!!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -