Thursday, July 24, 2025
E-PAPER
Homeజాతీయంమూడో రోజూ అట్టుడికిన పార్లమెంట్‌

మూడో రోజూ అట్టుడికిన పార్లమెంట్‌

- Advertisement -

బీహార్‌ ఎస్‌ఐఆర్‌, పహల్గాంపై చర్చకు ప్రతిపక్షాల పట్టు
ఆందోళన మధ్యే లోక్‌సభలో రెండు బిల్లులు
29 నుంచి ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ
ఈ యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్‌ 25 సార్లు చెప్పడంలో మర్మమేంటీ? : రాహుల్‌ గాంధీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల మూడోరోజూ ఉభయసభలు అట్టుడికాయి. పహల్గాం ఉగ్రదాడి, ఓటర్ల జాబితా సవరణ అంశాలు పార్లమెంట్‌ను కుదిపేస్తున్నాయి. బీహార్‌ ఎస్‌ఐఆర్‌, పహల్గాంపై చర్చకు డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళ నతో బుధవారం కూడా పార్లమెంట్‌ ఉభయసభలు స్తంభించాయి. ఎలాంటి చర్చ జరగకుండానే నేటీకి వాయిదా పడ్డాయి. బుధవారం ఉదయం 11 గంటల కు ఉభయసభలు మొదలవగానే.. బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివ్యూ (ఎస్‌ఐఆర్‌) పేరుతో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన గళం వినిపించారు. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ఆగమేఘాల మీద ఓటర్ల జాబితాను సవరించడం ప్రజాస్వామ్య విరుద్ధ మని మండిపడ్డారు.

అంతేకాక ఎన్నికల వేళ బీజేపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల సంఘం కేంద్రంతో కలిసి కుట్రకు తెరలేపిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాను సవరించ డం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారిందని ఆరోపించారు. ఈ విషయంపై ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చకు సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఆ తరువాత సభలు తిరిగి ప్రారంభమైనా లోక్‌సభలో అదే సీన్‌ రిపీట్‌ అయింది. ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీహార్‌ ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు డిమాండ్‌ చేశారు. ఫలితంగా సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. దాంతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అంతకుముందు ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ జాతీయ డోపింగ్‌ నిరోధక (సవరణ) బిల్లు, జాతీయ క్రీడా పాలన బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు క్రీడా రంగంలో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో రూపొందించినట్టు తెలిపారు. తిరిగి ప్రారంభమైన ఉభయ సభల్లో పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనబడకపోవడంతో నిమిషాల్లో ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి.

జులై 29 నుంచి ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ
ఈ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్‌ సిందూర్‌పై జులై 29న చర్చ జరగనుంది. లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు చర్చించేందుకు సమయాన్ని కేటాయించారు. బుధవారం జరిగిన బిజినెస్‌ అడ్వైజరీ మీటింగ్‌ (బీఏసీ)లో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అయితే చర్చ ముగిసిన తరువాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చర్చపై సమాధానం ఇవ్వనున్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై విస్తృత స్థాయిలో చర్చ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉభయసభల్లోనూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి.


‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ఆపినట్టు ట్రంప్‌ 25 సార్లు చెప్పడంలో మర్మమేంటీ? : రాహుల్‌ గాంధీ
ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపింది తానేనని ట్రంప్‌ 25 సార్లు చెప్పడంలో మర్మమేంటీ అని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ సర్కారు విదేశాంగ విధానాన్ని ఆయన ప్రశ్నించారు. ఇండియా, పాకిస్తాన్‌ మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటిస్తున్నారని, దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇండో, పాక్‌ ఉద్రిక్తతల వేళ ఐదు యుద్ధ విమానాలు కూలిన అంశాన్ని కూడా ట్రంప్‌ ఇటీవల మళ్లీ మళ్లీ లేవనెత్తడంతో ప్రతిపక్షాలు దీనిపై అనుమా నాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతోందని ఓ వైపు చెబుతున్నారని, మరో వైపు విజయం సాధించినట్టు చెబుతు న్నారని, డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపింది తానే అని చెప్పారని, దీంట్లో ఏదో మర్మం ఉందని, మన విదేశాంగ విధానాన్ని ఏ దేశం కూడా సపోర్టు చేయలేదని రాహుల్‌ గాంధీ అన్నారు. దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దేశ భక్తులమని చెప్పుకుంటున్న వారు సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారని, ప్రధాని దీనిపై కనీసం ఒక్క ప్రకటనా చేయలేద ని తెలిపారు. ‘ఇది తన పనేనని ప్రకటన చేయడానికి ట్రంప్‌ ఎవరు? ఇది ఆయన పని కాదు. ప్రధాని ఇంతవరకూ స్పందించక పోవడం వాస్తవం’ అని పేర్కొన్నారు.

పార్లమెంట్‌ ఆవరణలో ప్రతిపక్షాల ఆందోళన
బీహార్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివ్యూ (ఎస్‌ఐఆర్‌)ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టారు. బుధవారం పార్లమెంట్‌ ఉభయ సభల ప్రారంభానికి ముందు మకర ద్వారం ఎదురుగా ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ పార్టీల నేతలు ప్లకార్డులు చేబూని ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాల హౌరెత్తించారు. ప్రభుత్వ రివ్యూ ఉద్దేశం, చట్ట బద్ధతను స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ ఆందోళనలో కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్‌పి నేత అఖిలేష్‌ యాదవ్‌, డీఎంకే నేతలు కనిమొళి, టిఆర్‌ బాలు, ఎ.రాజా, ఆర్‌జెడి ఎంపీలు మీసా భారతి, మనోజ్‌ కుమార్‌ ఝా, సీపీఐ(ఎం) ఎంపీలు అమ్రారామ్‌, సచ్చితానందన్‌ తదితర పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ సమస్య, పహల్గాం ఉగ్రవాద దాడి, నిఘా వైఫల్యాలపై పార్లమెంటులో చర్చ జరగాలని ఎస్‌పి ఎంపీ డింపుల్‌ యాదవ్‌ ప్రశ్నించారు. కానీ, ప్రభుత్వం ఈ అంశాలను నివారిం చడానికి ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -